– కీలక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామిగా తెలంగాణ
– ఫార్మా డిస్ట్రిబ్యూషన్ హబ్ ఏర్పాటుపై అధ్యయనం
– టాంజానియా బృందం భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేందుకు టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించేందుకు సిద్ధమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాబోయే రోజుల్లో ఐటీ, టూరిజం, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, మహిళా సాధికారత, ఎమర్జింట్ టెక్నాలజీస్, డిజిటల్ గవర్నెన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకో సిస్టం, కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలెప్‌మెంట్ తదితర కీలక రంగాల్లో టాంజానియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్‌ను సిద్ధం చేస్తామన్నారు. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో టాంజానియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్, ఐటీ, ఇన్నోవేషన్ ముద్రిక్ రమదాని సోరాగా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందం మంత్రి శ్రీధర్ బాబుతో శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యింది. తెలంగాణ -టాంజానియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ సామాజిక, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి బలమైన పునాదిగా మారిందన్నారు. ఆ దిశగా తెలంగాణ వేసిన అడుగులు ప్రపంచ పటంలో ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేశాయన్నారు. ఇదే స్ఫూర్తితో డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారం, మెంటార్‌షిప్, నైపుణ్య మార్పిడి అందిస్తామన్నారు. అక్కడ ఫార్మా డిస్ట్రిబ్యూషన్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘మీ సేవ’ ద్వారా డోర్ స్టెప్ సిటిజన్ సర్వీసెస్ డెలివరీ, ‘వీ హబ’ మార్గ నిర్దేశంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహం, స్టార్టప్ ఎకో సిస్టం బలోపేతం తదితర అంశాల్లో ఒక ‘నాలెడ్జ్ పార్ట్‌నర’గా వ్యవహరిస్తామన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్‌పై మార్గనిర్దేశం చేస్తామన్నారు. బ్లూ ఎకానమీ, టూరిజంలో టాంజానియా అవలంబిస్తోన్న బెస్ట్ ప్రాక్టీసెస్ పై అధ్యయనం చేసి తెలంగాణలోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డిజిటల్ ఎకానమీగా మారాలన్న తమ లక్ష్య సాధనలో తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాల వ్యూహాత్మక భాగస్వామ్యం ఆవశ్యకం.. ఐటీ, హెల్త్ కేర్, మెడికల్ టూరిజం, డిజిటల్ గవర్నెన్స్, స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకో సిస్టం, లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో సాధించిన ప్రగతి, చేపట్టిన సంస్కరణలు తమకు స్ఫూర్తిదాయకం.. అందుకే తెలంగాణతో కలిసి పని చేసేందుకు త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకుంటాం అని టాంజానియా మంత్రి ముద్రిక్ రమదాని సోరాగా తెలిపారు. సమావేశంలో టాంజానియా కమ్యూనికేషన్, ఐటీ, ఇన్నోవేషన్ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఫాత్మా మబ్రూక్ ఖమిస్, జాంజిబార్ ఐసీటీ అథారిటీ సీఈవో శుకూరు అవాద్ సులేమాన్, ప్రెసిడెంట్స్ డెలివరీ బ్యూరో హెడ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ జాన్ మహుండి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





