వారు చనిపోయి ఉండొచ్చు
ఇళ్లకు వెళ్లాలని వారి కుటుంబాలకు అధికారుల సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 9: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ఆచూకీ లభించని ఎనిమిదిమంది కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం ఆశలు వదులుకుంది. ఇక ఎనిమిదిమంది కార్మికుల ఆచూకీ లభించడం అసాధ్యమని అధికారులు తేల్చివేశారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ అనే వ్యక్తులు ప్రమాద సమయంలో కాలి బూడిదై ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే వంద శాంపిల్స్ సేకరించినా డీఎన్‌ఏ మ్యాచ్ కాలేదని అధికారులు తెలిపారు. ఎనిమిదిమంది కార్మికుల కుటుంబ సభ్యులను ఇంటికి వెళ్లిపోవాలని, మూడు నెలల తర్వాత తిరిగి రావాలని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. అప్పటివరకు రాష్ట్ర, కేంద్ర హోం శాఖలతో సంప్రదింపులు జరుపుతామని, డీఎన్‌ఏ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. కాగా, ఇప్పటివరకు 44 మృతదేహాలను గుర్తించిన విషయం విదితమే.





