“కొద్దికాలంగా జగిత్యాలలో ఆయన పెంచుకున్న సామ్రాజ్యానికి ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. ఆయనకు అత్యంత సన్నిహితుడు, రాజకీయాల్లో కుడిభుజంగా ఉన్న గంగారెడ్డి హత్య ఆయనను బాగా కుంగదీసింది. ఆయన శవం ముందు చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఇది ముమ్మాటికి రాజకీయ హత్యేనంటూ ఆనాడు బిఆర్‌ఎస్‌పై నిందవేసిన విషయం తెలిసిందే. తన సన్నిహితుడు చనిపోతే, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్‌కు చెందిన బడానేతలెవరూ రాలేదని ఆయన వాపోయారు. అది ఆయనను మరింత మనస్థాపానికి గురి చేసింది.”
మండువ రవీందర్‌రావు
మాజీమంత్రి జీవన్‌రెడ్డి పార్టీ మారి సరైన నిర్ణయం తీసుకున్నారా లేక తొందరపాటు చర్యా అన్నది రాష్ట్ర రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్‌పార్టీలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన జీవన్‌రెడ్డి సాధారణంగా అవివాదగ్రస్తుడిగా పేరుంది. తన నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గ కార్యకర్తల క్షేమం చూసుకోవడానికే ఆయన ఎక్కువ శ్రద్ధ కనబర్చేవారు. ఆ విధంగా ఆయన జగిత్యాల ప్రాంతంలో నిన్నటివరకు తిరుగులేని నాయకుడిగా చలామణి అయ్యారు. పార్టీ పరమైన పదవులు, ఇతర హోదాలు ఆయనను వెత్తుకుంటూ వచ్చినవే. నాలుగు దశాబ్దాల కాంగ్రెస్‌పార్టీ ప్రస్తానంలో ఆయన అనేక పదవులను అలంకరించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏనాడు కాంగ్రెస్ అధినాయకత్వంతో ఘర్షణగాని, వివాదంగాని లేని వ్యక్తిగా ఆయనకు పేరుంది. అలాంటి వ్యక్తి ఎందుకు మనస్తాపానికి గురైనారు. నిజంగా ఆయనది అధిష్టానం తీర్చలేని సమస్యనా అంటే కాంగ్రెస్ వర్గాలనుంచి కాదనే సమాధానం వస్తున్నది. అలాంటప్పుడు ఆయన దాదాపు 27 నెలలుగా ఎందుకు మానసిక సంఘర్షణకు గురవుతున్నారన్నది ప్రశ్న.
కొద్దికాలంగా జగిత్యాలలో ఆయన పెంచుకున్న సామ్రాజ్యానికి ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. ఆయనకు అత్యంత సన్నిహితుడు, రాజకీయాల్లో కుడిభుజంగా ఉన్న గంగారెడ్డి హత్య ఆయనను బాగా కుంగదీసింది. ఆయన శవం ముందు చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఇది ముమ్మాటికి రాజకీయ హత్యేనంటూ ఆనాడు బిఆర్‌ఎస్‌పై నిందవేసిన విషయం తెలిసిందే. తన సన్నిహితుడు చనిపోతే, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్‌కు చెందిన బడానేతలెవరూ రాలేదని ఆయన వాపోయారు. అది ఆయనను మరింత మనస్థాపానికి గురి చేసింది. ఒక విధంగా పార్టీ తనను అవమానపర్చడంగానే ఆయన భావించారు. భౌతికంగా తమను నిర్మూలించాలన్న ప్రయత్నాలు జరుగుతుంటే పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోనప్పుడు ఇంకా ఆ పార్టీలో ఎందుకుండాలని ఆయన ఆనాడే ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ పార్టీకో దండం.. మీకో దండం’, మమ్మల్ని ఇలానైనా బతకనివ్వండి అని హత్యారాజకీయపట్ల తన ఆవేదనను వ్యక్తంచేశారు. దానికితగినట్లు రెండుసార్లు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే గా గెలిచిన సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో ఆయన కోపం నషాళానికి ఎక్కింది.
ముఖ్యంగా తన నియోజకవర్గంలో తనకు తెలువకుండా తన ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవడాన్ని ఆయన సహించలేకపోయారు. పార్టీకి సమృద్ధి సంఖ్యలో ఎంఎల్యేల బలం ఉన్నప్పటికీ ఇతర పార్టీ ఎంఎల్యేలను తెచ్చుకోవడాన్ని ఆయన ప్రశ్నించడం ప్రారంభించారు. ఒక్క సంజయ్‌కుమార్ విషయమే కాకుండా బిఆర్‌ఎస్‌నుంచి ఎన్నికైన పదిమంది ఎంఎల్యేలను తీసుకోవడాన్నికూడా ఆయన తప్పుపట్టారు. దీనివల్ల పార్టీకి దశాబ్దాలుగా సేవలందించిన వారికి అన్యాయం జరుగుతుందని పార్టీపై ధ్వజమెత్తడం ప్రారంభించారు. ముఖ్యంగా తన నియోజకవర్గంలో తన ప్రాపకాన్ని తగ్గించేందుకే సంజయ్‌కుమార్‌ను తీసుకువచ్చాడంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడుతూ వచ్చారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాను సూచించిన వారికి టికట్లు ఇవ్వకపోవడం, తాను చెప్పిన వ్యక్తికి మున్సిపల్ చేర్‌పర్సన్‌గా ఎంపిక చేయకపోవడంతో ఆయన హ్యుములేట్ కావడమే బిఆర్‌ఎస్‌లో చేరడానికి కారణంగా మారింది.
అయితే ఆయన నిర్ణయాన్ని కాంగ్రెస్‌లోని కొందరు సమర్ధిస్తుండగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జీవన్‌రెడ్డి విషయంలో కాంగ్రెస్ తప్పుచేసిందని ఆపార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. అంతటి సీనియర్ నాయకుడిని వదిలించుకోవాల్సిందికాదని, ఆయన వెళ్ళడంవల్ల ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కునే అవకాశం ఏర్పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అయితే జీవన్‌రెడ్డిది తొందరపాటు చర్యేనని మరికొందరు కాంగ్రెస్ నాయకులంటున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ జండాను మోస్తున్న ఎందరికో ఇప్పటికీ పదవులు లభించని విషయాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. అంతమాత్రాన వారంతా పార్టీ మారుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీకోసం కాకుండా ఆయన తన స్వప్రయోజనంకోసమే ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ విమర్శిస్తున్నారు.
జీవన్‌రెడ్డి గెలిచినా గెలువకపోయినా కాంగ్రెస్ పార్టీ ఆయనకు పద్నాలుగుసార్లు ఎన్నికల్లో పాల్గొనే అవకాశమిచ్చింది. మంత్రిని చేసింది. సాధారణ ఎన్నికల్లో ఓటమి చవిచూస్తున్నవేళ ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించింది. అయినా ఇంకా అసంతృప్తి వ్యక్తం చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎంతసేపు నియోజకవర్గానికే పరిమితయ్యాడేగాని, రాష్ట్ర రాజకీయాల్లో తనవంతుపాత్రను పోషించలేకపోయాడన్న వాదన వినవస్తున్నది. తాజాగా ఆయన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికైన విషయాన్ని గుర్తుచేస్తూ గ్రాడ్యుయేట్స్‌కోసం ఆయన చేసిందేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కె. కేశవరావు, డి. శ్రీనివాస్ లాంటి కాంగ్రెస్ సీనియర్లు బిఆర్‌ఎస్ గూటినుంచి తిరిగి కాంగ్రెస్‌కు ఎందుకు చేరారన్న విషయాన్ని జీవన్‌రెడ్డి ఆలోచించుకోవాలంటున్నారు. పొన్నాల లక్ష్మయ్య పరిస్థితేమిటని ప్రశ్నిస్తున్నారు.