– రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి
– మీడియాపై దాడులకు తెగబడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?
– కాంగ్రెస్ పాలనలో చట్టం కేసీఆర్ చుట్టంగా మారిందా?
– ప్రభుత్వాన్ని నిలదీసిన బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7: ఆక్రమ నిర్మాణాల పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు చెరువులు, కుంటల్లో భవంతులు నిర్మించి కాలేజీలు, వ్యాపారాలు చేసుకుంటున్న అక్బరుద్దీన్ ఒవైసీ కుటుంబానికి మినహాయింపు ఇచ్చారా అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి, భీమారం మండలాల్లో పర్యటించిన మంత్రి బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ప్రారంభించారు. వెంకట్రావుపల్లెలో పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన వేంకట్రావుపల్లె స్కూల్ సందర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. అక్బరుద్దీన్ కాలేజీలో పదివేల మంది విద్యార్థులు చదువుకుంటున్నందున అక్రమ నిర్మాణాలైనా వాటిని కూల్చలేమని చెబుతున్న హైడ్రా అధికారులు ఏ జీవనాధారం, గూడు లేక మూసీ పరివాహక ప్రాంతాల్లో కట్టుకున్న గుడిసెలు, చిన్నచిన్న ఇండ్లను ఎందుకు కూల్చివేశారని నిలదీశారు. అక్బరుద్దీన్ కుటుంబానికే విలువ ఉంటుందా.. పేదల ప్రాణాలకు, జీవితాలకు విలువ లేదా.. వాళ్లు మనుషులు కాదా అని అడిగారు. ఎంఐఎం నాయకులు పోలీసులను కొడితే చర్యలు తీసుకోరు.. కరెంట్ బిల్లులు కట్టకుంటే వత్తాసు పలుకుతారు.. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జా చేస్తే వత్తాసు పలుకుతారు.. ఆఖరికి తీవ్రవాదులతో సంబంధాలున్న వాళ్లకు ఉద్యోగాలిచ్చి పోషిస్తుంటే పట్టించుకోరు.. ఇదేం పద్దతి అంటూ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కథనాలు రాసిందనే కారణంతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై ఆ పార్టీ నాయకులు దాడి చేసేందుకు సిద్ధమవడంపైనా కేంద్ర మంత్రి నిప్పులు చెరిగారు. మీడియాపై దాడులు చేస్తుంటే ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. ‘‘రేవంత్ రెడ్డిగారూ.. మీకు పౌరుషం లేదా? మిమ్మల్ని ఆకారణంగా జైల్లో వేసి బెయిల్ రాకుండా చేశారు కదా.. అవన్నీ మర్చిపోయి వాళ్లతో కుమ్కక్కైపోయారా.. కాళేశ్వరం, ఈఫార్ములా సహా అనేక స్కాంలు చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు అని నిలదీశారు. మహా టీవీపై దాడి చేసినప్పుడే కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, మీడియా స్వేచ్ఛను కాపాడే విషయంలో బీజేపీ ముందుంటుందని చెప్పారు. మీకు దమ్ముంటే ఏబీఎన్-ఆంధ్రజ్యొతిపై దాడులు చేసి చూడండి.. తర్వాత రెండే రెండు గంటల్లోనే మీ బీఆర్‌ఎస్ ఆఫీస్‌ను, అందులోని టీవీ చానల్ సంగతి తమ బీజేవైఎం నాయకులు చూస్తరు అని బీఆర్‌ఎస్ నాయకులకు హెచ్చరిక జారీ చేశారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద దాదాపు అన్ని గ్రామాల్లో రోడ్లు వేసినం.. తాను ఎంపీగా గెలిచినప్పటి నుండి రూ.291 కోట్ల సీఆర్‌ఐఎఫ్ నిధులతో రోడ్లు నిర్మించినం. ఉపాధి హామీ పథకం కింద ఏటా సగటున 30 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తూ రోడ్లను నిర్మిస్తున్నం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అబివృద్ధి కోసం ఆరేళ్లలో మొత్తంగా రూ.20 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చిన అని వివరించారు. అభివ్రుద్ధి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరించేందుకు సిద్దంగా ఉన్నాం. అందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తే ప్రజలకు మరింత మేలు చేయొచ్చనే ఉద్దేశంతోనే పార్టీలకతీతంగా పనిచేస్తున్నానని బండి సంజయ్ చెప్పారు.




