– ఆహ్వానపత్రం అందజేసిన డీజీపీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23 : గచ్చిబౌలి స్టేడియం వేదికగా నిర్వహించనున్న 74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్-2026 ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి సోమవారం లోక్ భవన్ లో కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్న పోలీసు జట్ల వివరాలను డిజిపి గవర్నర్‌కు వివరించారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నీ మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేడుకల్లో భాగంగా వివిధ రాష్ట్రాల పోలీసు బృందాల గౌరవ వందన స్వీకరణ, క్రీడాకారుల మార్చ్ పాస్ట్, ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ పతాకావిష్కరణ వంటి కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. గవర్నర్ ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించనుండగా, ప్రత్యేక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు కేంద్ర భద్రతా బలగాల నుంచి అత్యుత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ వేదిక సిద్ధమైంది. క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వివిధ రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ఈ పోటీలు దోహదపడనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, స్పోర్ట్స్ ఐజీపీ గజరావు భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




