సారలమ్మ రాకతో పోటెత్తిన భక్తజనం

– మంత్రులు సీతక్క, అడ్లూరి, జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు

మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం బుధవారం అర్ధ‌రాత్రి భక్తి పార‌వశ్య వాతావరణంలో ఆవిష్కృతమైంది. కోట్లాది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా కన్నెపల్లి నుంచి గద్దెపైకి సారలమ్మ కొలువు తీరింది. ఈ ఘట్టానికి ముందుగా పూజారులు, జిల్లా యంత్రాంగం కన్నెపల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క దేవతల పూజారులు సిద్ధబోయిన వారి ఇంటికి చేరి సంప్రదాయ కార్యక్రమాలు చేపట్టగా, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజుల ను కన్నెపల్లికి తీసుకొచ్చారు. అనంతరం సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్ కుమార్, కాక కనకమ్మ, కాక భుజంగరావు, కాక లక్ష్మీబాయిలతోపాటు గోవిందరాజుల పూజారి దుబ్బకట్ల గోవర్ధన్‌లు కలిసి ఆదివాసీ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు రెండు గంటలపాటు కన్నెపల్లి సారలమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రాత్రి సాయంత్రం 7గంటలకు సారలమ్మ అమ్మవారు కన్నెపల్లి నుంచి బయలుదేరారు. జంపన్న వాగు మీదుగా మేడారం గ్రామానికి చేరుకోగా పూనకాలతో తన్మయత్వానికి లోనైన భక్తులు డప్పు వాయిద్యాల నడుమ దారి పొడవునా అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. రాత్రి 12.30 గంటలకు గద్దెల ప్రాంతానికి చేరుకున్న సారలమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవిందరాజులు, పగిడిద్దారాజులతో కలిసి అర్ధరాత్రి గద్దెపైకి అమ్మవారు చేరుకున్నారు. ప్రధాన పూజారి సారయ్య అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చి కొలువు తీర్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ టి.ఎస్.దివాకర్‌లు సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్నెపల్లి గ్రామస్తులతో కలిసి ఆదివాసీ గిరిజన సంప్రదాయ నృత్యాల్లో పాల్గొని ఆధ్యాత్మికతను మరింత పెంచారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *