మేడారం వచ్చే భక్తులు క్రమశిక్షణతో మెలగాలి

– భక్తులకు స్వాగతం పలుకుతూ సూచనలు
– రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

ములుగు, ప్రజాతంత్ర, జనవరి 26: ఈనెల 28వ తేదీ నుంచి జరిగే మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. ములుగు కలెక్టరేట్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. క్యాంప్ ఆఫసులో త్రివర్ణ పతాకం ఆవిష్కరణ అనంతరం దివ్యాంగులకు సహాయ పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ మేడారం జాతరకు వచ్చే భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులందరూ క్రమశిక్షణతో మెలగుతూ ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్యూ విధానాన్ని తప్పనిసరిగా పాటిస్తూ తల్లులను దర్శించుకోవాలని సూచించారు. భక్తులందరికీ శీఘ్ర దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కొంతమంది భక్తుల అత్యుత్సాహం వల్ల ఇతర భక్తులకు ఇబ్బందులు కలగకూడదని చెప్పారు. ప్రతి భక్తుడు స్వీయ నియంత్రణతో, క్రమశిక్షణతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. కాలినడకన వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు వేగంగా వెళ్లరాదని, ఓవర్ స్పీడ్, ఓవర్ టేక్ వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. భక్తుల భద్రత, సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, జాతరకు వచ్చే ముఖ్యులు కూడా సహకరించాలని కోరారు. భక్తులే తమ ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి సీతక్క స్పష్టం చేస్తూ, అందరూ సహకరించి జాతరను శాంతియుతంగా, భక్తిభావంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *