-వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక చట్టాలుండాలి
– కబ్జాకు గురైన భూములను చెంచులకు అప్పగిస్తున్నాం
– మంత్రి సీతక్క
సమాజానికి, అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్నదని మంత్రి సీతక్క అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్లమల్ల కష్టాలను కన్నీళ్లను తుడిచే నాయకుడు కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమేనన్నారు. నిజానికి వెనుకబడిన ప్రాంతాలు, వర్గాలు అభివృద్ధి చెందాలంటే వారికి ప్రత్యేక చట్టాలు అవసరమన్నారు. ఎస్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ పాలకులు ఎంతో కృషిచేశారని గుర్తుచేశారు. గత పది సంవత్సరాల కాలంలో ఐటీడీఏలను టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఐటీడీఏ ల్లో పాలకమండళ్ళు లేకుండా చేయడమే కాదు వీటిని నిర్వీర్యం చేసి గిరిజన చట్టాలకు తూట్లు పొడిచారన్నారు.గిరిజన భూములను కబ్జా చేశారు. ఆవిధంగా కబ్జాకు గురైన చెంచు భూములను విడిపించి వారికి భూములను అప్ప గిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పంచిన పోడు భూములు బీడు భూములుగా మిగిలిపోవద్దని సంకల్పంతో ఇందిరా సౌర గిరిజన వికాసం పథకాన్ని తీసుకొచ్చామని గుర్తుచేశారు.ఒకప్పుడు 29 శాఖలకు నోడల్ సంస్థగా ఐటీడీఏలు పనిచేసేవి. కానీ కెసిఆర్ సర్కార్ ఐటీడీఏ పరిధి ని కుదించి అన్యాయం చేసిందన్నారు. అందుకే ఐటీడీఏలను బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. మన్ననూరు ఐటీడీఏను పూర్తిస్థాయి ఐటిడిఏ గా మార్చాలని ఆమె కోరారు. గత ప్రభుత్వం లాక్కున్న భూములను తిరిగి అప్పగించి గిరిజనుల హక్కులను పరిరక్షిస్తామన్నారు. ఇందిరా గిరిజన వికాసంతో ఉత్పత్తి పెరగడంతో పాటు స్థానికులకు ఉపాధి లభిస్తోందన్నారు.
15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు గిరిజన మహిళలు మహిళా సంఘాల్లో చేరాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం ఇచ్చే వడ్డీ లేని రుణాలు పేదలు గిరిజనులకు ఆసరాగా ఉంటాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మహిళా సంఘాల ద్వారా లబ్ధిదారులకు రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారుల దోపిడీని నిర్మూలించేందుకు పేదరిక నిర్మూలన సంస్థ కృషిచేస్తుం దన్నారు. 65 లక్షల మంది మహిళలను సైన్యంగా మార్చి సెర్ప్ పేదరిక నిర్మల కోసం కృషి చేస్తోందని గుర్తుచేశారు. సోలార్ పంపుసెట్లతోపాటు వాగులు వంకల మీద చిన్నచిన్న చెక్ డ్యాంల ను నిర్మించి గిరి పుత్రులకు అండగా ఉంటామన్నారు. గిరిజన ఆదివాసి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఇతర ప్రాంతాలకు దీటుగా తయారుచేస్తామన్నారు.





