– ఓటు అనే ఆయుధంతో గడీలను కూల్చారు
– సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా ప్రజాపాలన చేస్తున్నాం
– సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే
– ఉచిత విద్యుత్ పేటెంట్ రైట్ కాంగ్రెస్‌దే
– దేవరకొండ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్
దేవరకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి తరిమికొట్టిన ప్రాంతం ఇది.. నల్గొండ జిల్లాకు చైతన్యం ఉంది..ఇక్కడి గాలికి, నీరుకు పోరాట పౌరుషం ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సోనియా గాంధీ త్యాగం, అంబేద్కర్ ఇచ్చిన స్పూర్తితో తెలంగాణ రాస్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. దేవరకొండలో శనివారం జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలు రెండేళ్ల క్రితం ఓటునే ఆయుధంగా మార్చి పదేళ్లు తెలంగాణను పట్టి పీడిరచిన నాయకుల గడీలను కుప్పకూల్చి ఇందిరమ్మ రాజ్యం తెచ్చారని, దేవరకొండ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని కార్యకర్తలు నిరూపించారని తెలిపారు. ప్రజా పాలనతో సంక్షేమం, అబివృద్దిని రెండు కళ్లుగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశంలో నరేంద్ర మోదీ పాలిత గుజరాత్ సహా బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యం ఇవ్వడం లేదు.. ఒక్క తెలంగాణలోనే 3 కోట్ల 10 లక్షల మంది ప్రజలకు సన్న బియ్యం ఇస్తూ దేశానికి ఆదర్శంగా నిలబడ్డామని సీఎం తెలిపారు. పదేళ్లలో పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న సోయి కూడా బీఆర్‌ఎస్ పాలకులకు లేకుండా పోయిందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక రేషన్ కార్డులు ఇచ్చి పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టామని చెప్పారు. దేవరకొండలోనే 14 వేల రేషన్ కార్డులు మంజూరు చేశామని, 50 లక్షల పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వివరించారు. పేదవాడికి న్యాయం జరగాలన్నదే ఇందిరమ్మ రాజ్యం ఆకాంక్ష అని, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని, ముఖ్యమంత్రిగా ఉచిత కరెంటు ఫైల్‌పైన మొదటి సంతకం చేశారని గుర్తు చేశారు. ఉచిత కరెంటు పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీదన్నారు. రైతులకు కాదు.. కేసీఆర్ ఇంట్లో కరెంటు లేదు.. జనం ఆయన ఫ్యూజులు పీకేశారు.. కానీ రాష్ట్రంలో రైతులకు మాత్రం కరెంటు ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున 22 వేల కోట్లతో రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నదని, కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉండి ఉంటే 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించే వాళ్లమని చెప్పారు. చెంచులు, గిరిజనులు ఉన్న ప్రాంతంలో అదనంగా 25 వేల ఇళ్లు ఇచ్చామంటూ ఆదివాసీ, లంబాడీలు, గిరిజనులది ఈ ప్రభుత్వం అన్నారు. లంబాడీలకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ.. వారిని ఎస్టీల్లో చేర్చడానికి జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. రూ.లక్ష రుణ మాఫీ చేస్తామని కేసీఆర్ రైతు నెత్తి మీద అప్పు పెట్టి ఫామ్ హౌస్‌లో పడుకున్నాడు.. తాము 25 లక్షల 35 వేల రైతు కుటుంబాలకు రూ.20 వేల కోట్ల రుణ మాపీ చేశాం.. వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని నిరూపించాం.. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు.. రైతు బంధు రాదని కేసీఆర్ అన్నాడు.. ఇద్దరు సర్పంచ్‌లు, నలుగురు వార్డు మెంబర్లను కూర్చోబెట్టుకుని కేసీఆర్ మాట్లాడుతున్నారు.. మంచి రోజులు వస్తాయని చెప్తున్నాడు. కేసీఆర్‌కు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి.. కొడుకు, బిడ్డ, అల్లుడు తెలంగాణను నాలుగు వైపుల నుంచి పీక్కు తిన్నారు.. రూ.8 లక్షల కోట్ల అప్పు చేసినా కేసీఆర్ ఆశ తీరలేదు.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అధికారం పోయింది.. పార్లమెంటులో గుండు సున్నా వచ్చింది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకలేదు అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సా్థనిక ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





