– గోదావరి ప్రవాహం బాగా వుంది
– వరంగల్ జిల్లా రైతులపై కాంగ్రెస్ వివక్ష
– ఏపీకి నీళ్లు వదిలేస్తున్నారు
– 12లక్షల ఎకరాల సాగు మాట ఏమైంది?
– యాసంగి బోనస్ ఇస్తారా?
– బీఆర్ఎస్ నేత హరీష్రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: దేవాదులలో భాగమైన దేవన్న పేట వద్ద ఉన్న మూడు పంపులు పరిశీలించగా మూడుకు మూడు మోటార్లు పని చేయడం లేదని బీఆర్ఎస్ నాయకుడు హరీష్రావు తెలిపారు. ఒకవైపు గోదావరిలో కావాల్సినంత నీళ్ల ప్రవాహం ఉంది.. ఈరోజు కూడా సమ్మక్క సాగర్ దగ్గర 16వేల క్యూసెక్కుల నీళ్ళు పోతున్నాయి.. నదిలో నీళ్లు ఉన్నాయి..రైతాంగానికి నీళ్లు అవసరం ఉన్నాయి.. కానీ దేవన్నపేట పంపు హౌజ్లో మూడు మోటార్లు ఆఫ్ చేసి పెట్టారని విమర్శించారు. గత మార్చి 18న నీటిపారుదల శాఖ మంత్రి, జిల్లా మంత్రి పొంగులేటి మోటార్లు ఆన్ చేస్తే ప్రారంభం కాలేదు. మోటార్లు స్లార్ట్ అయ్యే వరకు ఇక్కడే ఉంటామని మీడియా ముందు చెప్పి వెంటనే హెలికాప్టర్ ఎక్కి వెళ్లిపోయారని గుర్తు చేశారు. గత సంవత్సరంలో ఈ పంపులు ఆన్ చేయకపోవడం వల్ల 60వేల ఎకరాల్లో పంట ఎండిపోయింది. పది రోజులుగా మోటార్లు ఆగి, నీటి లిఫ్టు ఆగిపోయింది. జనగాం, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్ నీళ్ళు లేవు. నీళ్లు లేవు అని గండిరామారం లిఫ్టులు ఆగిపోయాయి. ఇక్కడేమో మోటార్లు నడపడం లేదు. దేవన్నపేట పంపు హౌజ్ కు వస్తే రిపేర్ ఉంది, సాఫ్ట్ వేర్ ప్రాబ్లం అని చెబుతున్నారు. అసలు మూడో ఫేజ్ చేసిందే బిఆర్ఎస్ పార్టీ. 99శాతం పనులు పూర్తి చేసింది. బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన వరల్డ్ లార్జెస్ట్ టన్నెల్ ఇది. రామప్ప నుంచి ఉనికిచెర్ల వరకు 49.5 కిలోమీటర్ల టన్నెల్ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పూర్తి చేసినం. ఈ పంప్ హౌజ్ ప్రపంచంలోనే లోతైనది. 155 మీటర్ల లోతులో ఉంది. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల దేవాదుల నీళ్లు అందక వరంగల్ జిల్లా రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదన్నారు. ఆరోజైనా, ఈరోజైనా రైతులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ మాత్రమే. దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోలేదు. రెండున్నరేండ్లుగా అంగుళం కూడా ముందుకు పోలేదు. కేసీఆర్ దేవాదులను అద్బుతంగా తీర్చిదిద్దారు. కాంగ్రెస్, టీడీపీలు నది మీద బ్యారేజీ లేకుండా నదీ ప్రవాహంలోనే నీళ్లు తీసుకుంటాం అంటే వంద రోజులు కూడా నీళ్లు అందని పరిస్థితి. కానీ కేసీఆర్ సమ్మక్క బ్యారేజీ కట్టి 365 రోజులు నీళ్లు తీసుకునే విధంగా రూపకల్పన చేసారు. ఆనాడు 25టిఎంసీలు మాత్రమే దేవాదులకు కేటాయింపులు ఉంటే కేసీఆర్ 60టీఎంసీలకు పెంచి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా ప్రణాళికలు చేసారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, టిడిపీలు కలిసి దేవాదుల కింద ఇచ్చిన ఆయకట్టు కేవలం 47వేల ఎకరాలు బిఆర్ఎస్ ఆ ఆయకట్టును 3లక్షల 17వేల ఎకరాలకు పెంచినం. రెండున్నరేండ్లలో ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదు. ఉన్న మోటార్లు నడపడం చేతనవుతలేదు.
పోయిన ఏడాది భీంఘన్ పూర్ వద్ద మోటార్లు ఆన్ చేయలేదు. 8కోట్లు మెయింటనెన్స్ డబ్బులు కాంట్రాక్టర్లకు ఇవ్వలేదు. కనుక మోటార్లు ఆన్ చేయలేదు. పోయిన ఏడాది నీళ్లు అందక పంటలు ఎండిన దానికి కారణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే. ఈ జిల్లా మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. బిఆర్ఎస్ పోరాటం చేస్తే 50రోజుల తర్వాత రూ.8కోట్లు ఇచ్చి మోటార్లు ఆన్ చేసారు అప్పటికే 7,8 వందల కోట్ల పంట నష్టం జరిగింది. ఇప్పటి పరిస్థితికి మీడియానే సాక్ష్యం. ఒకవైపు పంట సాగు అవుతున్నది మరోవైపు ఇక్కడ మూడు మోటార్లు బంద్ చేసి ఉన్నాయి. గతంలో మంత్రులు వచ్చి ఇక్కడే ఉంటం ఇక్కడే పండుతతం అని స్విచ్చులు ఒత్తి పోయారు కానీ మోటార్లు ఆన్ కాలేదు. ఈ ఏడాది అయినా ఇస్తరు అంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కట్టింది లేదు, కొత్తగా తవ్వింది లేదు, ఉన్న మోటార్లు నడపక వరంగల్ జిల్లా రైతాంగం నోళ్లు కొడుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సమ్మక్క బ్యారేజీ కట్టింది మేం, ఫేజ్ 1, ఫేజ్ 2 పూర్తి చేసింది మేం, ఫేజ్ 3లో లాంగెస్ట్ టన్నెల్ కట్టినం బిఆర్ఎస్ హయాంలోరూ. 7300 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసాం. 80శాతం పైగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసాం. 47వేల ఆయకట్టును 3లక్షలకు పైగా పెంచినం. 33 వేల ఎకరాల భూసేకరణ అవసరం ఉంటే 30వేలు బిఆర్ఎస్ హయాంలో పూర్తి చేసినం. మిగిలిన 3వేల ఎకరాలు భూసేకరణ చేస్తే, వెయ్యి రెండు వేల కోట్లు ఖర్చు చేస్తే 2.40లక్షల ఎకరాలకు ఆయకట్టు వస్తది. రెండున్నరేండ్లలో రెండు వందల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. గెలిచిన పాపానికి మోటార్లు ఎందుకు నడపరు? ఎందుకు భూసేకరణ చేయరు? ఎందుకు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వరు? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నది? అని ప్రశ్నించారు. మే 2024 నాడు మంత్రులు జిల్లాకు వచ్చి 2026 మార్చికల్లా దేవాదుల పూర్తి చేస్తం అన్నరు. ఇప్పుడు 2026 ఫిబ్రవరి వచ్చింది. కనీసం పది పైసల పని కూడా కాలేదు. మేకపోతు గాంభీర్యమే తప్ప, పనులు చేయడం లేదు. జిల్లా ఎమ్మెల్యే నిద్ర పోతున్నడా? ఎప్పుడూ వచ్చే దేవాదుల నీళ్లు ఇప్పుడు ఎందుకు రావు? గోదావరి నీళ్లను ఎందుకు ఏపీకి జార విడుస్తున్నారు? అని ప్రశ్నించారు. బీంఘన్ పూర్ పంప్ హౌజ్ వద్ద ఈ నిమిషానికి 2160 క్యూసెక్కులు తీసుకునే కెపాసిటి ఉంది. కానీ లిఫ్టు చేస్తున్నది 1700 క్యూసెక్కులు.. ఎందుకు వెయ్యి తక్కువ లేపుతున్నారు. భీంఘన్ పూర్ లో పది మోటార్లు ఉంటే ఎందుకు 5,6 మోటార్లే నడుపుతున్నారు? ఇక్కడి రైతులపై ఎందుకు పగబట్టారు. ఫుల్ కెపాసిటీలో ఎందుకు మోటార్లు నడపడం లేదు? గండి రామారం లిఫ్టు ఎందుకు బంద్ అయ్యింది? దేవాదుల్లో రెండేళ్లలో మూరెడు కాల్వ తవ్వారా? ఒక్క ఎకరాకైనా కొత్తగా నీళ్లు ఇచ్చారా? బిఆర్ఎస్ 3.17లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే, బ్యాలెన్స్ 2.40లక్షల ఎకరాలకు ఎందుకు ఇవ్వడం లేదు? అన్ని పనులు చేస్తాం కనీసం పంట కాల్వలు, పిల్ల కాల్వలు తవ్వే తెలివి లేదా? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతుల పట్ల చిన్న చూపు చూస్తున్నది. గతేడాది మెయింటనెన్స్ డబ్బులు ఇవ్వకుండా మోసం, ఇప్పుడు ఉన్న మోటార్లు నడపకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి నత్తనడకన సాగుతున్నది. తొమ్మిదిన్నరేండ్లలో 48లక్షల ఎకరాలకు ఆయకట్టు, 17లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 31లక్షల ఎకరాల స్థిరీకరణ చేసినం. రెండున్నరేండ్లలో నాలుగు లక్షల ఎకరాలకైనా నీళ్లు ఇచ్చారా? ఒక్క చెక్ డ్యాం కట్టలేదు. చెరువు తీయలేదు. రైతు బంధు ఎగ్గొట్టారు. కరెంట్ కోతలు వచ్చినయి,. యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టే దుస్థితి వచ్చింది. రైతుల పట్ల ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఉత్తమ్ మొదటి ఏడాదిలో ఆరు లక్షలు, రెండో ఏడాదిలో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అన్నారు. మొత్తం 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారా? ఉత్తమ్ సమాధానం చెప్పాలె ఎక్కడ చూసినా మోటార్లు బంద్ కనిపిస్తున్నాయి. హక్కులు కాపాడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. రేవంతు రెడ్డి గోదావరి నీళ్లను చంద్రబాబుకు గురు దక్షిణగా వదులుతున్నడు. మేడిగడ్డ నీళ్లు ఎత్తడం లేదు, దేవాదుల వద్ద నీళ్లు ఎత్తడం లేదు, సీతమ్మ సాగర్ పూర్తి కాకుండా అక్కడా వదిలేస్తున్నడు. గోదావరిలో రాష్ట్ర హక్కులు కాపాడంలో ఫెయిల్. అటు కృష్ణాలోనూ ఇదే పరిస్థితి. అత్యంత తక్కువ వినియోగం ముందెన్నడు నమోదు కాలేదన్నారు. కృష్ణా, గోదావరిలో మన నీటిని వినియోగించడంలో, ఏపీ జల దోపిడిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ఫెయిలైందన్నారు. కొత్తగా నిర్మించింది లేదు, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో ఫెయిల్. తక్షణమే అన్ని దేవాదుల మోటార్లు నడపాలని, 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే విధంగా యుద్దప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




