బడికి వొచ్చిన పిల్లలందరికీ చదువులు నేర్పే బాధ్యత ప్రభుత్వం తీసుకోకుండా నేర్చుకునే బాధ్యతను పిల్లల పై మోపడమే డిటెన్షన్ విధానం . పరీక్షలు పెట్టి పిల్లలను అదే తరగతిలో కూర్చోబెట్టడం అంటే ఒక రకంగా పిల్లలను బడి నుండి వెలివేయడమే. రెండవ అవకాశం ఇచ్చినా పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు అదే తరగతిలో కొనసాగడం చాలా కష్టం. తోటి విద్యార్థులు పై తరగతిలో ఉండగా కింది తరగతి పిల్లలు తనకంటే చిన్న వయసు పిల్లలతో కూర్చోవడం ఒక అవమానంగా ఫెయిల్ అయిన విద్యార్థి గా ముద్ర పడిన తర్వాత బడిలో కొనసాగుతారనుకోవాడమే మన విధాన నిర్ణయ లోపం.
పిల్లలందరిలో నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది.. నేర్పించలేకపోవడం వ్యవస్థ వైఫల్యమే !!
బాలలకు నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నామనే చర్చ దేశవ్యాప్తంగా చాలా కాలంగా జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ అవుతున్నారని విద్యార్థులు ఎంత నేర్చుకుంటున్నారని అడిగే పద్ధతి లేదు. కాబట్టి ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయడం లేదని విద్యార్థులకు పరీక్షల భయం లేదు. కాబట్టి శ్రద్ధగా చదవడం లేదని ప్రధాన కారణాలు వినిపిస్తుంటాయి. ఈ వాదనలలో ఉపాధ్యాయులను విద్యార్థులను దోషులుగా నిలబెట్టి విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను మాట్లాడకుండా నాణ్యమైన విద్య అందక పోవడానికి కారణం నో డిటెన్షన్ విధానమని నిర్ణయానికి వొచ్చి 5, 8వ తరగతులకు పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రోమోట్ కావడంలో విఫలమైతే మళ్లీ పరీక్ష రాసేందుకు కొంత సమయం ఇచ్చి మళ్లీ ఫెయిల్ అయితే అదే తరగతిలో కొనసాగాల్సి ఉంటుందనేది కేంద్రం విడుదల చేసిన డిటెన్షన్ పాలసీ సారాంశం. దేశంలో ఉన్న బాలలందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు ఉన్న సవాళ్లను వ్యవస్థీకృత లోపాలను సరిచేసే బదులు.. పరీక్షలు నిర్వహించి వ్యవస్థ లోపాలకు పిల్లలను శిక్షించాలనుకోవడం విచిత్రం.
బాలలు నాణ్యమైన విద్య అందుకోవడం రాజ్యాంగ ద్వారా సంక్రమించిన హక్కు. నాణ్యమైన విద్య అందని పిల్లలు అత్యధిక శాతం మొదటి తరానికి చెందిన బడికి వెళ్తున్న పిల్లలు, అణగారిన వర్గాలకు చెందిన పిల్లలే. తరతరాల వెనుకబాటుతనాన్ని విద్య ద్వారా జయించడానికి కదిలిన పిల్లలు. నాణ్యమైన విద్య ఎంత ముఖ్యమో బడులలో కొనసాగడం కూడా అంత కంటే ఎక్కువ ముఖ్యం ఈ పిల్లలకు. చదువు నేర్చుకునే శైలి లయ వేగం మనం ఆశించినట్లు ఉండకపోవచ్చు. వీరికి ఆ వెసులుబాటు అవసరం. మొదటి సారి ఈ కుటుంబాలలో కత్తి కొడవలి పారా పలుగులకు బదులుగా చేతిలో పెన్ను, పేపర్ తో కసిగా విద్య ద్వారానే విముక్తి అని నమ్మిన బాలలు వీళ్ళు. వీరు 5లో 8 లో పరీక్షలు కాదు.. బడి ఆవరణలో అడుగుపెట్టినప్పుడే పాస్ అయినట్లు పిల్లలు. మన పరీక్షలు ఒక లెక్క కాదు. కాకపోతే కొంత సమయం అవసరం. అలాగే విద్యావ్యవస్థలో ఉన్న ఉపాధ్యాయుల మీద సవారీ చేసే పై అధికారుల ప్రజాప్రతినిధులు జవాబుదారితో పని చేయడం అవసరం. ఈ పిల్లలు ఎవరికి తీసిపోరు అని సమస్య పిల్లలు ఉపాధ్యాయులు కారని గుర్తిస్తే మన విధానాలు మరో రకంగా ఉండెవేమో. పిల్లలందరూ నేర్వగలరు అనే సూత్రానికి ఇది విరుద్దమైన విధానం. ఫెయిల్ చేయడం ద్వారా బడులలో నాణ్యత పెరుగుతుందనే వాదన కన్నా ఈ నేపథ్యం నుంచి వొస్తున్న పిల్లల విద్యా హక్కును హరించి వేయడమే కాకుండా విద్యా వివక్షతకు దారి తీస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా పాఠశాల విద్య స్థాయిలో చదువులో వెనకబడిన పిల్లలను అదే తరగతిలో మరికొన్ని సంవత్సరాలు కొనసాగించి వారి విద్యా ప్రమాణాలు పెంచినట్లు చూపే నివేదికలు గానీ, ఆధారాలు గానీ ఎక్కడా లేవు. స్కాండినేవియన్, జపాన్ లాంటి దేశాలు గానీ, మరే ఇతర దేశాలు డిటెన్షన్ విధానం ద్వారా కాకుండానే విద్యా ప్రమాణాలను పెంచగలిగాయి. బడికి వచ్చిన పిల్లలందరికీ చదువులు నేర్పే బాధ్యత ప్రభుత్వం తీసుకోకుండా నేర్చుకునే బాధ్యతను పిల్లల పై మోపడమే డిటెన్షన్ విధానం . పరీక్షలు పెట్టి పిల్లలను అదే తరగతిలో కూర్చోబెట్టడం అంటే ఒక రకంగా పిల్లలను బడి నుండి వెలివేయడమే. రెండవ అవకాశం ఇచ్చినా పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు అదే తరగతిలో కొనసాగడం చాలా కష్టం. తోటి విద్యార్థులు పై తరగతిలో ఉండగా కింది తరగతి పిల్లలు తనకంటే చిన్న వయసు పిల్లలతో కూర్చోవడం ఒక అవమానంగా ఫెయిల్ అయిన విద్యార్థి గా ముద్ర పడిన తర్వాత బడిలో కొనసాగుతారనుకోవాడమే మన విధాన నిర్ణయ లోపం. పిల్లల్లో నేర్చుకునే ప్రక్రియ వివిధ రకాలుగా వివిధ కాల మాన పరిస్థితులలో నేర్చుకుంటారని వివిధ పరిశోధనలు వివిధ నివేదికల ద్వారా తెలిసిందే. ముఖ్యంగా మొదటి తరం బడికి కదులుతున్న కుటుంబాల పిల్లలకు డిటెన్షన్ విధానం ఒక అవరోధంగా మారుతుంది. ఈ పిల్లలు బడికి అలవాటు పడడానికే బడి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ తరువాతనే చదువుకు ఉపక్రమిస్తారు. ఈ నేపధ్యం నుంచి వొచ్చే పిల్లలకు విద్యా వ్యవస్థ చాల వెసులుబాటు ఇవ్వాలి. సమాజంలో ఉన్న అసమానతల కారణంగా పిల్లలు నేర్చుకునే విధానంలో ఉండే వ్యత్యాసాలను అలాగే ప్రభుత్వ విద్యలో ఉన్న లోపభూయిష్ట అసమాన విద్యా వ్యవస్థలను పరిగణంలోకి తీసుకుని బాలలకు సమన్యాయం అందించే ప్రక్రియ గా విద్యా హక్కు చట్టం లో నాన్ డిటెన్షన్ విధానాన్ని రూపొందించారు. డిటెన్షన్ విధానం అమలు చేయాలంటే నాణ్యమైన విద్య అందించడంలో పాఠశాలలు సమాన స్థాయిలో ఉన్నాయా అనేది ప్రశ్న.
మన దేశం లో ప్రభుత్వాలే పేద వర్గాలకు చెందిన శ్రామిక ప్రజల పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ప్రబుత్వ బడులు, ఈ బడులలో సరిపడా బోధన సిబ్బంది కనీస సౌకర్యాల కొరత నిధుల ఎల్లప్పుడూ ఉంటుంది. మరో వైపు మెరిట్, ప్రవేశపరీక్షల పేరుతో అధిక నిధులతో గురుకుల విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక విద్యాలయాలు నిర్వహిస్తుంది. ఇక ప్రైవేటు యాజమాన్యాలు నిర్వహించే అంతర్జాతీయ పాఠశాలలు,ఉన్నత వర్గాల పిల్లలలు చదివే ప్రైవేటే విద్యా సంస్థలు, తక్కువ ఫీజులతో దగువ మధ్య తరగతి వర్గాల పిల్లలు చదివే ప్రైవేటు పాఠశాలలు. వివధ రకాల విద్యా వ్యవస్థల పేరుతో సమాజంలో ఉన్న తారతమ్యాలను వ్యవస్థీకరించారు. పాఠశాలల కూర్పు సమాజంలో ఉన్న అసమానతలకు అద్దం పడుతుంది. డిటెన్షన్ విధానాన్ని ఈ నేపథ్యం నుంచి అర్థం చేసుకోవాలి. రకరకాల బడులలో చదివే విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించి పిల్లలు ఫెయిల్ అయ్యారని ముద్ర వేయాలా లేక బాలలందరికీ సమాన విద్యా బోధన చేయడంలో విద్యావ్యవస్థ ఫెయిల్ అయ్యిందా అనేది మన ముందున్న ప్రశ్న. ప్రస్తుత విద్యా వ్యవస్థను సమూలంగా చర్చించకుండా విద్యా వ్యవస్థలోని నిర్మాణాత్మక వర్గీకరణను పరిశీలించకుండా, నిర్మాణాత్మక అసమానతలపై ఆధారపడిన విధానానికి మౌనంగా డిటెన్షన్ అనే విధానానికి చట్టబద్దత కల్పించి విద్యా వివక్షకు బాటలు వేస్తోంది. ఈ విధానం పిల్లల తప్పు లేకున్నా శాశ్వతంగా పాఠశాలలకు దూరం చేస్తుంది. పిల్లలందరికీ నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది. పిల్లలకు నేర్పించలేకపోవడం వ్యవస్థ వైఫల్యమే అని గుర్తించాలి.
దేశంలో ఉన్న బాలబాలికలందరిని బడికి తీసుకురావాలని తీసుకొచ్చిన పిల్లలు.. బడి మానివేయకుండా తగు చర్యలు చేపట్టాలని, అలాగే బడిలోకి వొచ్చిన పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. డిటెన్షన్ విధానం వల్ల ఫెయిలైన పిల్లలు బడులు మానేసే పరిస్థితులే అత్యధికం. ఈ పరీక్షలు లేకుండానే దేశంలో డ్రాపౌట్లు అవుతున్నారని మన ప్రతి సంవత్సరం విడుదల చేసే డైస్ డేటా ద్వారా తెలుస్తూనే ఉంది. ఇది ఎస్సీ, ఎస్టీ పిల్లల్లో అత్యధికం. ఈ పిల్లలంతా బాల కార్మికులుగా మారిపోతారనేది జగమెరిగిన సత్యం. పిల్లలకు విద్య నేర్పించడంలో (విద్య) వ్యవస్థాగత వైఫల్యాలపై దృష్టి పెట్టకుండా, ఈ విధమైన విధానం బాలలను బడి నుంచి వెలివేసినట్లవుతుంది. ఇది విద్యాహక్కు చట్టం స్ఫూర్తికి విరుద్ధం. చట్టంలోని ఇతర సెక్షన్ల ప్రకారం పాఠాశాల ఏర్పాటు, ప్రతి పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, బాలల అనుకూల పాఠ్య ప్రణాళికలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, విద్యేతర పనులనుంచి ఉపాధ్యాయులను మినహాయించడం లాంటి అంశాలను కలిపి చదివితేనే నాన్ డిటెన్షన్ విధానం స్ఫూర్తి అర్థమవుతుంది.
దేశంలో చాల పాఠాశాలలు ఏకోపాధ్యాయ పాఠాశాలలు శిక్షణ లేని ఉపాధ్యాయులు తరగతికి ఒక టీచర్ లేని అరకొర పాఠాశాలలు రవాణా సౌకర్యం లేని బడులు. ఇలాంటి బడులను బాగుచేసి అన్ని వసతులు కల్పించినప్పుడే చదువు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పేదవర్గాలకు చెందిన పిల్లలు తల్లిదండ్రులతో వలసలు వెళ్లి వొస్తుంటారు అనారోగ్య బారిన పడుతుంటారు బడికి కొన్ని రోజులు దూరమై మళ్లీ వొస్తుంటారు. ఉపాధ్యాయులు ప్రభుత్వం ఇచ్చే బోధనేతర పనుల మీద బోధనకు దూరమవుతుంటారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని అదే సంవత్సరంలో కాకున్నా పాఠాశాల పూర్తి అయ్యే వరకు ఎప్పుడో ఒకసారి నేర్చుకునే వెసులుబాటు కల్పిస్తుంది నో డిటెన్షన్ విధానం. బాల కార్మికుల వ్యవస్థ నుంచి విముక్తి పొంది తిరిగి బడిలో చేరిన లక్షలాది మంది పిల్లలు కేంద్ర ప్రభుత్వ సర్వశిక్ష అభియాన్ ద్వారా స్వచ్ఛంద సంస్థలు నడిపిన బ్రిడ్జి కోర్స్ ల ద్వారా ఈ వెసులుబాటు ఉన్నందు వలనే పరీక్షల వొత్తిడి లేనందువల్ల తమకు అనుకూలమైన వాతావరణం సమయంలో నేర్చుకుని లక్షలాది మంది బాలలు ఉన్నత శిఖరాలకు ఎదిగారు. పిల్లలందరూ నేర్వగలరు అని నేర్పటంలో ఉన్న సవాళ్లను అధికమించాలనే సంకల్పం ఉండాలి.. తప్ప పరీక్షలు నిర్వహించడం పరిష్కారం కాదని గుర్తించాలి. పిల్లలకున్న అనేక పరిమితులను, వారి నిస్సహాయతలను పట్టించుకోకుండా డిటెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా బాలలకు ముఖ్యంగా ఇప్పుడిప్పుడే చదువుకు అలవాటు చేసుకుంటున్న మొదటితరానికి చెందిన వెనుకబడిన, అణగారిన వర్గాలు పిల్లలను బడులకు దూరం చేయడమే తప్ప మరొకటి కాదు.
ఫెయిల్ చేయబడే పిల్లలలో ఆవేదన, నిస్సహాయత, తోటి విద్యార్థుల మధ్య అవమానకరంగా ఉండడం, ఏదో పెద్ద తప్పు చేసిన వారిగా కుమిలిపోతుండడం జరుగుతుంటుంది. చాలా ఒత్తిడికి గురి అవుతారు. అంతేగానీ, హాయిగా నేను ఫెయిల్ అయ్యాను బాగా కష్టపడి ఆనందంగా చదువుతానని ఏ బాలికా/బాలుడు అనుకోరు. పరీక్ష విధానం కాకుండా చదువుతో వెనకబడిన పిల్లలకు ధైర్యం చెప్పే దిశగా, వాళ్ళు చదువుకోగలరని నమ్మకం కలిగించే దిశగా వ్యవస్థ పని చేస్తేనే ఈ పిల్లలకు సహాయకారిగా ఉంటుంది. మనలో చాలా మంది ఇటివంటి ప్రోత్సాహాలతోటే చదువులో రాణించామన్నది వాస్తవం. సెకండరీ స్థాయిలోపు ‘పాస్’, ‘ఫెయిల్’ విధానం పిల్లలపై ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని తక్కువ ఫలితాలు వొస్తే పై అధికారుల నుంచి అవమానాలు వొత్తిడులు ఎదురుకుంటున్న ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్లను ఉపాధ్యాయులను చూస్తూనే ఉన్నాం. కలెక్టర్లు పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక సమీక్షలు నిర్వహించి ‘ ఏమైనా చేయండి’ మన జిల్లాకు మంచి పేరు వొచ్చేలా చూడండని వొత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే. డిటెన్షన్ విధానంతో ఇక నుంచి 5, 8వ తరగతుల పాస్ పర్సెంటేజ్ పెంచాలని ఉపాధ్యాయుల మీద వొత్తిడి పడబోతుంది. ఈ వొత్తిడి నుంచి దూరం చేసుకోవడానికి పాస్ పర్సెంటేజ్‌లు ఎలా పెంచగలుగుతున్నామో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. చదువు నేర్పడంపై దృష్టి పెట్టకుండా నాణ్యమైన విద్య అందించడానికి పై అధికారుల జవాబుదారీ తనం నిర్ణయించకుండా కేవలం పాస్ పర్సెంటేజ్ పై మాత్రమే దృష్టి పెడితే ఫలితాలు వంద శాతం వస్తుండ వచ్చు కానీ విద్యా సామర్థ్యాలలో అత్యంత వెనుకబడి పోతున్నారని పలు ప్రభుత్వ ప్రైవేటు నివేదికలే నిదర్శనం.
అసమాన విద్యా వ్యవస్థలు కల్పించి అసమాన బోధన చేసి పరీక్షలు మాత్రం అందరికీ సమానంగా నిర్వహించడం ద్వారా బాలలను బడి నుంచి దూరం చేసినట్లు అవుతుంది. విద్యా హక్కు చట్ట ప్రకారం బాలలందరిని బడికి తీసుకురావడం ఏ ఆటంకం లేకుండా బడిలో కొనసాగేలా చూడడం అలాగే నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వాల చట్టబద్ద బాధ్యత.అలాగే దేశం లోని పాఠశాలలన్నీ విద్యా హక్కు చట్టం షెడ్యూల్ లో పొందుపరిచిన అన్ని అంశాలను అమలుపరచాలి. నాణ్యమైన విద్యకు ఈ షెడ్యూల్ అమలుకు అవినాభావ సంబంధం ఉంది. డిటెన్షన్ విధానం ద్వారా ఈ బాధ్యత ను నెరవేర్చకుండా బాలలను దోషులుగా నిలబెట్టడం రాజ్యాంగ మూల సూత్రాలైన బహుళత్వం, సమన్యాయం, సమానత్వాలకు వ్యతిరేకం అని గమనించాలి. తెలంగాణ రాష్ట్రం డిటెన్షన్ విధానాన్ని అమలు చేస్తే డ్రాపవుట్స్ పెరుగుతాయనే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. నో డిటెన్షన్ విధానాన్నే అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో బడి బయట పిల్లలను బడులకు తీసుకురావడానికి మరియు డ్రాపవుట్స్ ను అరికట్టడానికి ‘నో డిటెన్షన్’ విధానం అమలు అవుతున్న సమయం లోనే ఈ విధానాన్ని విద్యా హక్కు చట్టం లో పొందుపరచడానికి ఉమ్మడి రాష్ట్రం ఒక మోడల్ గా నిలిచిందని గమనించాలి. ఈ రెండు రాష్ట్రాలు పాత విధానాన్ని కొనసాగిస్తూ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి దేశమంతా నో డిటెన్షన్ అమలుకు కృషి చేయాలని ఆశిద్దాం.
-ఆర్.వెంకట్ రెడ్డి,
జాతీయ కన్వీనర్, ఎంవి ఫౌండేషన్





