- టెంట్లు పీకేయడం కాదూ…సమస్యకు పరిష్కారం చూపండి
- సిఎం సందర్భంగా పోలీసుల చర్యపై ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: సమస్యలను పరిష్కరించాలంటూ మెదక్‌లో నిరసన చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ముందు నుంచే వెళ్లిన సిఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోకపోవడమే కాకుండా సిఎం పర్యటన సందర్భంగా ఉద్యోగులను నిర్బంధించడంపై మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఫైర్ అయ్యారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు నుంచే వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. టెంట్లు పీకేయడం కాదు.. వారి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. 15రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోవాలన్నారు. ఈ మేరకు హరీష్‌రావు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ..గతఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీసుస్టేషన్ తరలించి, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
అధికారంలోకి వొచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని, వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఉలుకు లేదు, పలుకు లేదనీ మండిపడ్డారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న విధంగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందన్నారు. ఇప్పుడు రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ నిర్బందాలకు గురిచేస్తున్నారనీ, ఇది హేయమైన చర్య అన్నారు. నిర్బంధించిన సమగ్ర శిక్ష ఉద్యోగులను తక్షణం విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా రెగ్యులైరైజేషన్ సహా ఇతర హామీలను నిలబెట్టుకోవాలని బిఆర్‌ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసున్నట్లు ఆ ప్రకటనలో హరీష్‌రావు పేర్కొన్నారు.





