కుట్ర‌లు చేసినా క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్ గెలుచుకున్నాం

– భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి ఆశీస్సులే ఈ విజ‌యానికి కారణం
– హిందూ స‌మాజానికి ఏ ఆప‌ద వ‌చ్చినా అండ‌గా నిల‌బ‌డ‌తా
– ఆల‌యాల‌పై దాడులు కొన‌సాగడం దారుణం
– క‌రీంన‌గ‌ర్‌లో ముస్లిం మ‌హిళ‌లు బీజేపీకి ఓట్లేశారు
– 2028లో పార్టీని అధికారంలోకి తేవాలి
– కేంద్ర‌ మంత్రి బండి సంజ‌య్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 24: ఎన్ని కుట్రలు చేసినా కరీంనగర్ మహాశక్తి అమ్మవారి, భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే తట్టుకుని కరీంనగర్ లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నామ‌ని కేంద్ర‌ మంత్రి బండి సంజ‌య్ అన్నారు. కరీంనగర్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి మొక్కులు తీర్చుకునేందుకు భాగ్యలక్ష్మీ ఆలయానికి వ‌చ్చిన సంద‌ర్భంగా ఆయ‌న మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. బాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం చాలా పవర్ ఫుల్.  బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాన్ని పంజాబ్  గోల్డెన్ టెంపుల్ లా మారుస్తామ‌న్నారు. పాత బస్తీ హిందువులకు అమ్మ‌వారి  రక్ష వున్న‌ద‌న్నారు. గతంలో ఎంతోమంది హిందువులు పాత బస్తీ నుండి వెళ్లారు.. అమ్మవారి శక్తి తెలుసుకుని మళ్లీ వ‌చ్చేశార‌ని గుర్తు చేశారు. అమ్మవారి ఆశీస్సులతోనే ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించి కేసీఆర్ సర్కార్ దాడులను తట్టుకుని దిగ్విజయం చేశామ‌న్నారు. ఈరోజుతో పాదయాత్ర ప్రారంభించి 1640 రోజులు పూర్తయ్యింద‌న్నారు. మజ్లిస్ కంచుకోటను బద్దలు కొట్టి ఇదే చోట ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించాన‌ని, హైదరాబాద్ లో హిందూ సమాజానికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి మేం సిద్ధమ‌ని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా మా బూట్లు నాకాల్సిందేనని మజ్లిస్ నేతలు చెబుతున్నారంటే సిగ్గుండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 27 నెలలైంది.. నాటి నుండి నేటివరకు దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి మొదలు సంతోష్ నగర్ భూలక్ష్మీ, బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి, శంషాబాద్ ఆలయాలపై దాడులు జరిగాయి. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? గోహత్యలు, లవ్ జిహాదీల పేరుతో హిందూ అమ్మాయిలకు డ్రగ్స్ ఇస్తూ అత్యాచారాలు చేస్తున్నా స్పందించరా? హిందూ ధర్మాన్ని కాపాడాలనే సంకల్సంతో కసితో మేం పనిచేస్తున్నామ‌న్నారు. హిందూ సమాజం జాగృతం కాకపోతే అందరివి బిచ్చపు బతుకులే అవుతాయ‌న్నారు. హనుమాన్, అయప్ప, భవానీ మాల వేసుకుంటే సెలవు ఇవ్వరు. మాల వేసుకున్న పిల్లలను కూడా స్కూలుకు రానీయ్యడం లేదు. అయినా భరిస్తూ ఉందామా అని ప్ర‌శ్నించారు.  కరీంనగర్ లో ముస్లిం మహిళలంతా ఒక్కటై బీజేపీకి ఓటేశారు. బాన్సువాడ లో ఎంఐఎం నేతలు హిందువులపై రాళ్ల దాడి చేసినా పట్టించుకోరా?  ఆ రాళ్లదాడి దృశ్యాలను డీజీపికి, మీడియాకు పంపినా పట్టించుకోలేద‌న్నారు. దాడి బాధ్యులను కాకుండా బాధితులను, అమాయక హిందువులను అదుపులోకి తీసుకోవడం సిగ్గుచేటన్నారు. పోలీసులు ఎంఐఎం గూండాలను వెంటనే అరెస్ట్ చేయ‌క‌పోతే స్వయంగా బాన్సువాడకు వెళతా. హిందువులకు రక్షణ కవచంగా నిలుస్తాన‌న్నారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసం హైదరాబాద్ ను మూడు ముక్కలు చేశారు. భాగ్యనగర్ లో గల్లీగల్లీ తిరిగి కాంగ్రెస్ మోసాలను ఎండగడతాం. భాగ్యనగర్ లో అంతోఇంతో అభివృద్ధి చెందుతుందంటే కేంద్ర నిధులతోనే. పాత బస్తీలో ఒవైసీ కుటుంబ ఆస్తులు పెరుగుతున్నాయే తప్ప ఇక్కడి ప్రజల, ముస్లింల బతులకు బాగుపడ్డాయా? ఆలోచించండి అన్నారు. ఎంఐఎం కార్యకర్తలు ట్రిపుల్ రైడింగ్ వెళ్లినా చలాన్లు వేయరు. ఇంటి పన్నులు, నల్లా, కరెంట్ బిల్లులు కట్టకపోయినా నోరు మెదపరు. ఇప్పటివరకు 18 సార్లు కేబినెట్ మీటింగ్ లు జరిగినా 6 గ్యారంటీల అమలు ఊసే లేదు. ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే సీఎం మాత్రం ఢిల్లీకి మూటలు మోయడానికే పరిమితమవుతున్నారు. ఉద్యోగులకు డీఏలు, బకాయిలు ఎందుకు ఇవ్వరు?  ఆఖరికి ఉద్యోగ  విరమణ పొందిన ఉద్యోగుల బెన్ ఫిట్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. వాళ్ల పైసలు ఇవ్వకుండా చస్తే సంతాపం, ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పడమేంటి?  ఉద్యోగుల జీతంలో కోత విధించి హెల్త్ కార్డులను అమలు చేయడమేంటి? ఉద్యోగులతో ఇన్సూరెన్స్ వ్యాపారం చేయాలనుకుంటోందా? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభివృద్దే ఎజెండా, హిందుత్వ నినాదంతోనే ప్రజల్లోకి వెళతాం. బాన్సువాడలో శాంతిభద్రతలను కాపాడాలని కోరుతున్నాం. కొందరు పోలీసులు ఎంఐఎం గూండాల అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆరోపించారు. అమాయకుల అరెస్టులను వెంటనే ఆపకపోతే మీ సంగతి చూస్తాం.. సనాతన ధర్మం, హిందూ ధర్మ రక్షణ కోసం యుద్దం స్టార్ట్ చేస్తున్నాం. కమలం జెండా, కాషాయ జెండా పట్టుకుని బయటకు రండి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గల్లీగల్లీ తిరిగి కాంగ్రెస్, ఎంఐఎంలకు బుద్దిచెబుదామ‌ని పిలుపునిచ్చారు. కేంద్రంపై విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి 27 నెలల్లో హైదరాబాద్ అభివృద్ధికి ఎన్ని నిధులిచ్చిండో చెప్పాలి. హైదరాబాద్ సహా మున్సిపాలి టీలు, పంచాయతీల అభివృద్ధి జరుగుతుందంటే కేంద్ర నిధులతోనే..  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వాస్తవాలన్నీ ప్రజల ముందుంచుతామ‌న్నారు.

2028లో  బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు సహకారంతోనే కరీంనగర్ మేయర్ తోపాటు బైంసా, నారాయణపేట మున్సిపాలిటీ ఛైర్మన్లను కైవసం చేసుకోగలిగామ‌న్నారు. 2028లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా  పనిచేద్దామ‌ని పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నిరంతరం పార్టీతో టచ్ లో ఉండాల‌న్నారు. కరీంనగర్ లో గతంలో బీజేపీకి ఇద్దరు కార్పొరేటర్లుంటే ఈరోజు పార్టీ రాష్ట్ర శాఖ‌ సహకారంతో మేయర్ సీటును కైవసం చేసుకోగలిగామ‌న్నారు. కార్యకర్తల కష్టం, నాయకుల స్ట్రాటజీతోనే మేయర్ కలను సాకారం చేసుకోగలిగామ‌న్నారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ. ఆ పార్టీ పనైపోయింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడానికి మనిషే దొరకలేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని పార్టీ బీఆర్ఎస్ ఇకపై ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ విజయం తథ్యం. కాంగ్రెస్ లో లొల్లి స్టార్ట్ అయ్యింది. కర్నాటకలో 32మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు మంత్రి పదవులు కావాలని రాహుల్ కు లేఖ రాశారు. తెలంగాణలోనూ రెండు జిల్లాల్లో ఎమ్మెల్యేలు కర్నాటక తరహాలో మంత్రి పదవులు కావాలని అసమ్మతి సమావేశాలు పెట్టుకున్నారు. ప్రస్తుత మంత్రులు అవినీతికి పాల్పడుతూ కాంగ్రెస్ ను భ్రష్టు పట్టిస్తున్నారని, ఎమ్మెల్యేలు లేఖలు రాసి రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఏర్పడింద‌న్నారు. ఎమ్మెల్యేలంతా నారాజ్ లో ఉన్నారు. నియోజకవర్గాలకు నిధులివ్వడం లేదు. కాంగ్రెస్ లో ప్రభుత్వాన్ని కూల్చే అవకాశాన్ని ఇతరులకు ఇవ్వరు. సొంత పార్టీ నేతలే ఆ ప‌నిచేస్తార‌న్నారు. రేవంత్ రెడ్డి  ప్రభుత్వం కూలిపోవాలని బీజేపీ కోరుకోవడం లేదు. ప్రజాస్వామ్యబద్దంగా పాలన కొనసాగించాలని ఆశిస్తోంద‌న్నారు. కరీంనగర్ మేయర్ గెలుపు త్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పనిచేద్దాం జీహెచ్ఎంసీ మేయర్ పదవిని కైవసం చేసుకుందామ‌న్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *