గ్రామ సభలకు సన్నద్ధం

– అమలులో ఉన్న, కొత్త పథకాలను వివరించాలి
– ‘ప్రగతి ప్రణాళిక’పై కలెక్టర్లతో డిప్యూటీ సీఎం వీసీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి ప్రభుత్వం చేపడుతున్న గ్రామ సభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. ప్రజాభవన్ నుంచి మంగళవారం సాయంత్రం ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ సభలను రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. మొదట ముఖ్యమంత్రి సందేశం వినిపించి తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చదివి వినిపించాలని సూచించారు. రైతు భరోసా లబ్దిదారుల పేర్లు, 200 యూనిట్ల విచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సాధ్యమైనంతవరకు గ్రామ సభలో చదివి వినిపించాలని ఆదేశించారు. ఇప్పటివరకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జూన్ 2 నుంచి అందరికీ జీవిత బీమా అమలు చేయబోతున్న విషయాన్ని వివరించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయంపూట అల్పాహారం, మూడు రోజులపాటు గ్లాస్ పాలు, మూడు రోజులపాటు రాగి జావ అందిస్తున్న విషయాన్ని వివరించాలన్నారు. ఇంటర్ కళాశాలల విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసేలా వివరించాలన్నారు. వీటిని వివరించే క్రమంలో సాంస్కృతిక శాఖ, పౌర సంబంధాల శాఖ సహాయసహకారాలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నాం.. గ్రామాల వారీగా విడుదలైన నిధుల వివరాలను అందుబాటులో పెట్టుకుని గ్రామ సభ రోజు ఆ గ్రామానికి ఎంత చేరిందో ప్రకటించాలన్నారు. ప్రజా పాలన విజయవంతం అవుతున్న తీరును ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ, ప్రణాళికా శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్‌ల నుంచి సమాచారం సేకరిస్తారని తెలిపారు. ప్రభుత్వం కేవలం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కాదు.. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవా రంగాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *