హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: తెలుగువారందరికీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాదికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం మీ ఆశలు, ఆశయాలు నెరవేరి ఏడాది పొడవునా సుఖసంతోషాలతో జీవించాలని, రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు కలగాలని, సకల విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి సిరుల పంటలు పండాలని, సకల వృత్తుల వారికి మేలు కలగాలని, పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రతీ ఇల్లు కళకళలాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిలాల్లాలని కోరారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజాసంక్షేమం కోసం అహరహరం శ్రమిస్తోందని తెలిపారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఇందిరమ్మ ఇండ్లు సహా అనేక సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమాల పరంపర నిర్విరామంగా ప్రతిగడపకు అందేలా ప్రజాప్రభుత్వం ఎప్పటిలాగే ఈ పరాభవ నామ సంవత్సరంలో కూడా ముందుకు సాగుతుందని భట్టి హామీ ఇచ్చారు.
రామచందర్ రావు శుభాకాంక్షలు 
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ శుభసందర్భంగా విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరకూ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. ఉగాది కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ ఆశలు, ఆకాంక్షలకు శ్రీకారం చుడుతుందని, ఈ పండగ ప్రతి ఇంటికీ సంతోషం, శాంతిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ పండగ రైతుల జీవితాలలో ఆనందాలు నింపాలని, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నానన్నారు. 2026 సంవత్సరం ప్రతి బీజేపీ కార్యకర్తకు ప్రత్యేకమైనదని, ఎందుకంటే ఇది భారతీయ జనసంఘ్ స్థాపన జరిగి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఒక గర్వకారణమని ఆయన తెలిపారు. ఈ మైలురాయి పార్టీ కార్యకర్తలందరికీ ప్రేరణనిచ్చే సందర్భమని, జాతీయత, సేవాభావం, ప్రజల పట్ల అంకితభావంతో కూడిన సంస్థ గొప్ప వారసత్వాన్ని గుర్తు చేస్తుందని అన్నారు. ఈ ఉగాది ప్రతి కార్యకర్తను సమాజ సేవలో, దేశ సేవలో మరింత క్రమశిక్షణతో ముందుకు సాగేందుకు ప్రేరేపించాలని రామచందర్ రావు ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




