– పేదలపై పెద్దల దాష్టీకం
– చుట్టూ బారికేడ్లు కట్టి ఎవరూ రాకుండా ఆంక్షలు
– తెల్లవారుజామునుంచే పోలీసుల పదఘట్టనలు
– బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతల కొనసాగింపు
– వీరి కాలనీ చుట్టూ పెద్దల భూములుండడమే శాపమా?
ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: వైరా-ఖమ్మం ప్రధాన రహదారిలో కలెక్టరేట్‌కు కనుచూపు మేరలో ఉన్న ఆ భూమి ఒకప్పుడు పెద్దలు ఆక్రమించిన భూదన్ భూములు.. వాటిలోనే గతంలో ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇచ్చింది. పట్టాలు పొందామన్న భరోసాతో అప్పోసొప్పో చేసి ఇళ్లు కట్టుకున్నారు. ఆ జాగాలో గ్రామీణ, పట్టణ నిరుపేదలకు చెందిన 500 కుటుంబాలు నివాసముంటున్నాయి. విద్యుత్ సౌకర్యం, నీటి సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పించడంతో గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇంతలో అక్కడ వరంగల్-విజయవాడ హైవే నిర్మాణం చేపట్టారు. అక్కడే మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతోంది. వీరి స్థలాలపై పెద్దల కన్ను పడింది. గత ప్రభుత్వ హయాంలోనే ఈ పేదలను వెళ్లగొట్టాలన్న ఆలోచన చేశారు. ఈ పేదల కాలనీకి దక్షిణం దిక్కున మాజీ మంత్రి కొనుగోలు చేసిన వంద ఎకరాల బినామీ భూమి ఉంది. అది కేటీఆర్ బినామీ భూమిగా చెప్పుకునేవారు. పడమర దిక్కున ఖమ్మం జిల్లాకు చెందిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు చెందిన వందల ఎకరాల రియల్ భూములున్నాయనే ప్రచారం ఉంది. ఆ పక్కనే మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతోంది. ఇంతటి గొప్ప వారి భూముల పక్కన పేదలు ఉండకూడదని భావించారో ఏమో ఇండ్ల కూల్చివేతల దారుణానికి ఒడిగట్టారు.

బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ సైతం ఇక్కడే జరిగింది
పదేళ్లుగా ఈ ఇళ్లను కూల్చివేయాలనే ప్రయత్నాలను గత టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసింది. చరిత్రాత్మకంగా చెప్పుకునే బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ సైతం ఇక్కడే నిర్వహించారు. ఆ సమయంలో సభకు వచ్చేవారికి, పాలకులకు ఈ పేదల ఇళ్లు కనిపించకుండా చుట్టూ పరదాలు కట్టారు. అప్పట్లో అంతమంది పేదలను నిరాశ్రయులను చేయడానికి వారు జంకారనే చెప్పవచ్చు. తర్వాత జరిగిన ఎన్నికల్లో పాలకులు ఫలితం అనుభవించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి పేదలు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్‌కు ఓటు వేయడమే ఇపుడు వారి పాలిట శాపమైంది. ఎవరైతే తమను అందలం ఎక్కించారో వారిమీదనే పాలకుల అండతో పెద్దలు బుల్డోజర్లు పంపారు. వందలాదిమంది పోలీసులను మోహరించి కాలనీ చుట్టూ బ్యారికేడ్లు పెట్టి బయటివారిని ఆఖరుకు మీడియాను సైతం అటువైపు రానీయకుండా తెల్లవారుజామునుంచే పేదలు నిద్ర లేచీలేవకముందే ఇళ్లను కూలగొట్టేస్తున్నారు. ఈ పనిచేస్తున్న వారు ఎవరి సేవలో తరిస్తున్నారో.. ఎన్ని వేల కోట్ల లావాదేవీలు జరిపారో తెలియదు కానీ పేదలు మాత్రం భూకామందుల పద ఘట్టనల్లో నలిగిపోతున్నారు. మంత్రులు, మాజీ మంత్రుల భూముల పక్కన పేదలు ఉండటమా అనే అహంకారానిదే పైచేయి అయింది. అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా, మరే పార్టీ ప్రభుత్వమైనా పేదలకు నిలువ నీడ లేకుండా చేయడంలో అందరిదీ ఒకటే పద్ధతి. పార్టీలు వేరైనా, జెండాలు వేరైనా అందరం ఒకే తాను ముక్కలమని నాయకులు, పాలకులు నిరూపించుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





