-స్పీకర్ తీర్పుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు: మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్ 17:ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలువునా ఖూనీ చేసిందని విమర్శించారు. దేశ అత్యున్నత న్యాయస్థానాల పైనే కాదు.. చివరికి రాజ్యాంగంపై కూడా రాహుల్ గాంధీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి నేటి స్పీకర్ నిర్ణయం వరకూ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉందని కేటీఆర్ విమర్శించారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు సాక్షాత్తు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేకసార్లు ప్రకటించినా వారిని కాపాడటం రాహుల్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని అన్నారు. కేవలం ఫోటోలకు ఫోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని. తండ్రి చేసిన చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ గాంధీ చరిత్రలో మిగిలిపోతారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెండేళ్ల పాలనా వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల్లో పల్లెపల్లెనా వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతకు భయపడే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలంటే జంకుతోందని కేటీఆర్ అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోకుండా వెనకడుగు వేయడానికి ప్రధాన కారణం ఇదేనని తెలంగాణ సమాజానికి స్పష్టంగా అర్థమైపోయిందని విమర్శించారు. గోడ దూకిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తాత్కాలికంగా కాపాడినట్టు కాంగ్రెస్ అనుకున్నా ప్రజాక్షేత్రంలో వారిని ఎమ్మెల్యే పదవికి అనర్హులుగా ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడో ప్రకటించేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. సేవ్ ది కానిస్టిట్యూషన్ అంటూ రాహుల్ గాంధీ దిల్లీలో ఉపన్యాసాలు ఇస్తారని.. కానీ ఆచరణలో మాత్రం శూన్యమని ఆరోపించారు. ఆచరణలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా దెబ్బతీసిన ఈ ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశిరచిన యాంటీ-డిఫెక్షన్ నియమాలను పూర్తిగా పక్కన పెట్టి అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం. ఇది రాజ్యాంగాన్ని కాలరాయడమే. ఇది ఎంతో సిగ్గుచేటు. ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ అని అన్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని మాజీ ఎంపి వినోద్ కుమార్ అన్నారు. స్వయంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు చెప్పారు. కానీ ఇవాళ స్పీకర్ మాత్రం పార్టీ మారలేదు అని చెప్పడం ఎంత వరకు కరెక్ట్. 10వ షెడ్యూల్‌లో రాజ్యాంగ సవరణ చేయాలి. పార్లమెంట్‌లో వెంటనే పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.