– బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారు
– హుస్నాబాద్‌లో దుకాణాల మూసివేతతో కర్ఫ్యూ వాతావరణం
– మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
హుస్నాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: గతంలో ఎన్నడూ లేనివిధంగా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను తమకు అనుకూలంగా మలుచుకున్నారని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ ఆరోపించారు. హుస్నాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇలాంటి పరిస్థితులు గత దశాబ్దాలుగా ఎప్పుడూ చూడలేదని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలికినట్టుగా ఉందని పేర్కొన్నారు. 24 గంటలుగా ఉద్దేశపూర్వకంగా బీఆరఎస్ అభ్యర్థుల ఇళ్ల ముందు పోలీసు పహారా ఏర్పాటు చేసి భయభ్రాంతులకు గురిచేశారని తెలిపారు. అంతేగాక హుస్నాబాద్ పట్టణంలో రాత్రి 8 గంటలకే దుకాణాలను బలవంతంగా మూసివేయించి కర్ఫ్యూ వాతావరణం సృఫ్టించారన్నారు. ఇవి ప్రజలను ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని అడ్డుకునే కుట్రలేనన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకూడదని, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. అయినా ప్రజల మద్దతు పూర్తిగా బీఆర్ఎస్ వైపేనని తమకు గట్టి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత అంకితభావంతో పనిచేశారని ప్రశంసిస్తూ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




