– చైర్మన్, వైస్ చైర్మన్‌లకు కేటీఆర్‌అభినందనలు
మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల విజయంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను ఎదిరించి, మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సాధించిన ఘనవిజయాన్ని ప్రజాస్వామ్య జయకేతనంగా అభివర్ణించారు. ఆ మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయమన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన వారికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన మంచిర్యాల జిల్లా అధ్యక్షు బాల్క సుమన్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పార్టీ యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ (బంటి)తో పాటు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, మరెన్ని ఒత్తిళ్లు తెచ్చినా వేటికీ లొంగకుండా, మొక్కవోని దీక్షతో ఒక్క తాటిపై నిలిచిన కౌన్సిలర్ల ధైర్యానికి ఆయన సెల్యూట్ చేశారు. అలాగే క్యాతనపల్లి విజయంలో మిత్రపక్షమైన సిపిఐ కామ్రేడ్లు కనబరిచిన పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అణచివేతకు, బెదిరింపులకు, అవినీతి అక్రమాలకు తావులేదని ఈ ఎన్నికల తీర్పు స్పష్టంగా తేల్చి చెప్పిందని కేటీఆర్ అన్నారు. కేవలం రెండున్నరేళ్లలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైందంటూ అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించిన గులాబీ జెండా సైనికులను పార్టీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ విజయాలు అందించిన స్ఫూర్తితో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అడుగడుగునా విధ్వంసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారుకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని కేటీఆర్ హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





