స్పీక‌ర్ తీర్పుతో అపహాస్యమవుతోన్న ప్రజాస్వామ్యం

– ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలి
– కేటీఆర్ అడ్డాపెట్టి డబ్బులు పంచుతున్నారట
– కేంద్ర నిధులు మింగి సిరిసిల్లను వరదల్లో ముంచుతున్నరు
– కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయా పైసా లేదు
– అందుకే 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నారు
– కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి

సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. కార్యకర్తల జోష్‌తో సిరిసిల్లలో ఎన్నికల సందడి పతాకస్థాయికి చేరింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబేద్కర్ సర్కిల్ వద్ద బుధవారం నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో ఆయ‌న‌ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని, ఆయా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవంటూ శాసనసభ స్పీకర్ తీర్పు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. ‘స్పీకర్ సార్.. మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది.. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్‌లోనే సంసారం చేస్తున్నరు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగ్‌లు పెడతారు. వాళ్ల చేతికే బి.ఫాంలు ఇస్తరు. కళ్ల ముందే ఇవన్నీ కన్పిస్తున్నా పార్టీ మారినట్లు ఆధారాల్లేవని కేసు కొట్టివేయడం దారుణం’ అని సంజయ్ అన్నారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. బీజేపీ ప్రజాస్వామ్య స్పూర్తితో పనిచేస్తోందని, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశాకే తీసుకున్నామని గుర్తు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఓట్ల కోసం వస్తున్న మీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో అడగండి.. ఏ పార్టీకి ఓటేయాలి.. ఏ అభ్యర్ధిని గెలిపించాలి అని నిలదీయండి అని పిలుపునిచ్చారు.

కేటీఆర్ డబ్బులు పంచుతున్నడట

మాకు భయపడి కేటీఆర్ సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నడట. ఆ డబ్బులు మనవే. తీసుకుని ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేసి బీజేపీకి మున్సిపల్ చైౖర్మన్ పీఠాన్ని అప్పగించండి అని బండి కోరారు. మొన్నటిదాకా బీఆర్ఎస్‌కు అప్పగిస్తే ఏం జరిగింది? వానొస్తే గల్లీలన్నీ మునిగిపోతున్నయ్. ఆఖరికి జిల్లా కలెక్టరేట్ కూడా మునిగిపాయే. మురికినీటి శుద్ధి ప్లాంట్ పేరిట పద్మనగర్‌లో ఎస్‌టిపి  నిర్మిస్తే ఏమైంది.. మురికి కాలువ నీళ్లన్నీ ఊళ్లకు వస్తున్నయ్.. వస్త్ర పరిశ్రమ సిరిసిల్లలో ఉంటే నూలు డిపోను వేములవాడలో పెడతారా ఎవరైనా.. డిపో ఈడ పెడితే వాళ్ల కమీషన్లన్నీ తెలుస్తదని ఆడ పెట్టిర్రు. ప్రతి కిలోపై కాంగ్రెస్ నేతలు కమీషన్లు కొడుతున్నారు అని ఆరోపించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు.. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వంటి వసతులలో విఫలమైందని విమర్శించారు. సుందరీకరణ పేరిట కొత్త చెరువును పూడిక తీయకుండా ఐలాండ్ నిర్మించి నీటి సామర్థ్యాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించడంతో కొద్దిపాటి వర్షానికి నీళ్లు ఊర్లోకి వస్తున్నాయన్నారు. టెక్స్‌టైల్ పార్క్ పరిస్థితి దారుణం.. నేత కార్మికులకు ఉపాధి కల్పనలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.

విలీన గ్రామాల్లో ఉపాధి లేకుండా చేశారు

సిరిసిల్ల పట్టణంలో రఘుడు, చందంపేట, ముష్టిపెళ్లి, చిన్న బోనాల, పెద్ద బోనాల, పెద్దూరు, సర్దాపూర్ వంటి ఏడు శివారు గ్రామాలను బీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్లలో కలిపి అక్కడి ప్రజలకు ఉపాధి హామీ లేకుండా చేసిందన్నారు. వీటిని మున్సిపాలిటీ నుంచి తప్పించి మళ్లీ పంచాయతీలుగా చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. విలీన గ్రామాల్లో మురికి నీటి, రోడ్ల సమస్య ఎప్పటిలాగే ఉంది.. పైపెచ్చు ఇంటి పన్నులు, ఇతర పన్నులు పెంచారన్నారు. సిరిసిల్ల పాత బస్టాండ్‌లో పార్కింగ్ స్థలం లేదు.. ట్రాఫిక్ సమస్యలున్నాయి.. పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు. కౌన్సిలర్ల అవినీతి, కాంట్రాక్టర్ల అక్రమాలతో గత పాలన అవినీతిమయమైందన్నారు.

ఆర్థిక సంఘం, ‘అమృత్‌’ నిధులు తెచ్చాం

బీజేపీ ఏం చేసిందని ఓటేయాలని మాట్లాడుతున్న వాళ్లకు నేను చెప్పే సమాధానమొక్కటే.. ఇప్పటివరకు 14, 15వ ఆర్ధిక సంఘం ద్వారా అమత్ పథకం ద్వారా కోట్ల నిధులు ఇచ్చినం.. మేం పైసలిస్తే వృధా చేస్తున్నరు. కమీషన్లు సంపుకుంటున్నరు అని బండి ఆరోపించారు. ఇదిగో బుక్ లెట్.. ఇంటింటికీ పంపిస్తున్నా.. వివరాలు చదువుకోండి అని అన్నారు. బీజేపీ రాష్ట్రంలో, ఈ మున్సిపాలిటీలో అధికారం లేకపోయినా కేంద్రం నుండి మోదీని ఒప్పించి నిధులు తీసుకొచ్చిన. నా కోసం ఇక్కడి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నరు. పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలి అని ప్రజలకు విజ్ఞప్త్తి చేశారు. మోదీ ప్రభుత్వం 2 లక్షల ఇండ్లకు పైసలిస్తే కేసీఆర్ ప్రభుత్వం సిరిసిల్లలో ఒక్కరికి ఇల్లు ఇయ్యలేదు.. నిరుద్యోగులకు ఉద్యోగాలన్నందుకు నాపై కేసు పెట్టి జైలుకు పంపారు. ఇదేందని అడిగిన మా కార్యకర్తలను జైలుకు పంపిర్రు అని విమర్శించారు. మీ కోసం లారీ దెబ్బలు తిన్న.. జైలుకుపోయిన అన్నారు. మరి నువ్వేం(కేటీఆర్) చేసినవ్. ఇక్కడికొచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నీ బండారం బయటపెడతా అని సంజయ్ హెచ్చరించారు. మొన్న వానలొచ్చి పేదలు మునిగితే వాళ్లను కాపాడే సోయి కేటీఆర్‌కు ఉందా? నేను హెలికాప్టర్ తెచ్చి బాధితులను కాపాడిన. కేంద్రం నుండి నిధులు తెచ్చి ప్రజల కోసం కష్టపడుతుంటే కేటీఆర్ ఆ నిధులను దారి మళ్లించి కమీషన్లు తిన్నడన్నారు.

ప్రభుత్వం వద్ద నయా పైసా లేదు

కాంగ్రెస్‌ను అడుగుతున్నా.. ఎన్నికల హామీలను అమలు చేశారా? అసలు ఇవ్వడానికి కాంగ్రెస్ దగ్గర పైసలున్నయా? నన్ను కోసినా ప్రభుత్వం వద్ద పైసా లేదని సీఎం రేవంత్ రెడ్డే చెప్పిండు. మరి యాడ నుండి తీసుకొచ్చి అబివద్ది చేస్తరు? నిధులిచ్చేది కేంద్రం.. తెచ్చేది నేనే. మీరు సిరిసిల్ల మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే పెద్ద ఎత్తున నిధులిస్తానని మోదీ భరోసా ఇచ్చారన్నారు. బీజేపీ గెలవకుంటే కేంద్రం నిధులను దారి మళ్లిస్తరు. పైసలు మావి.. సోకులు వాళ్లవి.. కమీషన్లు వాళ్లవి.. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి సిరిసిల్ల మున్సిపాలిటీని బీజేపీకి అప్పగించండి అని సంజయ్ ప్రజలను కోరారు. ప్రచారంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, జిల్లా నేతలు, అభ్యర్థులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *