దిల్లీ ఎన్నికలకు మోగిన నగారా

  • 10న నోటిఫికేషన్‌ ‌విడుదల
  • 17 వరకు నామినేషన్ల స్వీకరణ
  • మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్‌

‌దిల్లీ  అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తుండటంతో ఆలోపే నూతన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం దిల్లీ లోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ‌ప్రకటించింది. దిల్లీ  అంతటా ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్‌ ‌నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఫిబ్రవరి 8న వోట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నట్లు పేర్కొంది. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్‌ ‌విడుదల కానుంది. జనవరి 17 వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. జనవరి 20 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.

షెడ్యూల్‌ ‌విడుదల సందర్భంగా చీఫ్‌ ఎలక్షన్‌ ‌కమిషనర్‌ ‌రాజీవ్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ.. ఈవీఎంలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం పై క్లారిటీ ఇచ్చారు. వోటర్‌ ‌లిస్ట్ ‌ట్యాంపరింగ్‌ ‌జరిగిందన్న ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపింది. ఈవీఎంలను ఎవరూ ట్యాంపరింగ్‌ ‌చేయలేరని స్పష్టం చేసింది. గత ఏడాది ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేసింది. దేశంలో వోటర్ల సంఖ్య 99 కోట్లు దాటిందనిమహిళా వోటర్ల సంఖ్య 48 కోట్లు దాటిందని సీఈసీ రాజీవ్‌ ‌కుమార్‌ ‌చెప్పారు. ఈ ఏడాది తొలి ఎన్నికలు దిల్లీలో జరగబోతున్నాయని అన్నారు.

దిల్లీలో అన్ని ప్రాంతాల వోటర్లు ఉంటారని పేర్కొన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ ఆరోపణలు సీఈసీ రాజీవ్‌కుమార్‌ ‌ఖండించారు. ఈవీఎంలతోనే ఫలితాలు పారదర్శకంగా ఉంటాయనిఈవీఎంల రిగ్గింగ్‌ ‌జరిగినట్లు ఇంతవరకు ఎక్కడా నిరూపణ కాలేదని ఆయన తెలిపారు. ఈవీఎంల రిగ్గింగ్‌ ‌సాధ్యం కాదని చెప్పారు. చీఫ్‌ ఎలక్షన్‌ ‌కమిషనర్‌గా ఇదే తనకు చివరి ప్రెస్‌ ‌మీట్‌ అని సీఈసీ చెప్పారు. వోటింగ్‌ ‌శాతంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంపై కూడా సీఈసీ స్పందించారు. పోలింగ్‌ ‌రోజు సాయంత్రం 6 గంటలకు కచ్చితమైన పోలింగ్‌ ‌శాతం వెల్లడించడం సాధ్యం కాదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *