– నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలి
– నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
– మంత్రి జూపల్లి కృష్ణారావు
– ప్యాకేజీ-16 కాలువ పనుల్లో జాప్యంపై ఆగ్రహం
వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 14 : కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకత పాటించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. శనివారం వనపర్తి ఐడీఓసీ కార్యాలయంలో ఏదుల, పాన్ గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలకు చెందిన సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీడీఓలు, డీపీఓ, డీఎల్పీఓలతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని హౌసింగ్ పీడీ, ఏఈలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను స్వయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిధులను ఏయే పనులకు ప్రాధాన్యత క్రమంలో ఖర్చు చేయాలో వివరిస్తూనే గ్రామాభివృద్ధిలో అధికారుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి జూపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలువ లైనింగ్, డిస్ట్రిబ్యూషన్ పనుల పురోగతిని సమీక్షించి ప్యాకేజీ-16 కాలువ పనుల్లో జరిగిన అవకతవకలపై సీఈ, ఎస్ఈ స్థాయి అధికారులను నిలదీశారు. పనుల్లో నాణ్యత లోపించడం, నిధుల దుర్వినియోగంపై అసహనం వ్యక్తం చేస్తూ వెంటనే ఈ అంశాన్ని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్యాకేజీ-16కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని వెంటనే అందజేయాలని ఆదేశించిన మంత్రి త్వరలోనే తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





