జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌స్థ‌లాల‌పై ఇంత జాప్య‌మా?

– రియ‌ల్ ఎస్టేట్‌కు నిబంధ‌న‌లుండ‌వు
– జ‌ర్న‌లిస్టుల‌నేస‌రికి కోర్టు కేసుల పేరుతో సాకులు
– ముఖాలు చాటేస్తున్న నాయ‌కులు
– త‌ప్పించుకుంటున్న అధికార్లు
– నిర‌స‌న‌కు దిగిన పాత్రికేయులు

నిర్మల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా నిలబడి,సమాజంలోని అన్యాయాలను ఎండగడుతూ, ప్రజల గొంతుకగా మారిన జర్నలిస్టులు నేడు తమ కనీస హక్కు అయిన ఇళ్ల స్థలాల కోసం నిర్మల్ జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై నిరసన దీక్షలు చేపట్టడం అత్యంత దురదృష్టకరం.  ఇది వ్యవస్థ‌ పతనానికి నిదర్శనం. ఎన్నికల ప్రచార సమయంలో గడప గడపకూ తిరుగుతూ, జర్నలిస్టుల కష్టాలు మా కష్టాలని, తాము అధికారంలోకి రాగానే ప్రాధాన్యత క్రమంలో ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తామని గంభీరమైన ప్రసంగాలు చేసిన ప్రజాప్రతినిధులు, తీరా గెలిచి అధికార పీఠం ఎక్కాక ఆ వాగ్దానాలను తుంగలో తొక్కి తమకేమీ తెలియనట్లు ప్రవర్తించడం విస్మయానికి గురి చేస్తోంది. ఒకప్పుడు జర్నలిస్టుల అండ కోసం పాకులాడిన నాయకులే నేడు వారిని మొహం చాటేస్తూ, కనీసం సమస్యను పరిష్కరించాలనే కనీస చిత్తశుద్ధిని ప్రదర్శించకపోవడం దారుణం. పోరాట శిబిరాల వద్దకు వచ్చి సంఘీభావం తెలిపే క్రమంలో ప్రతి పార్టీ నాయకుడు తాము జర్నలిస్టుల పక్షపాతులమని చెప్పుకుంటున్నారు కానీ, మరి అసలైన అడ్డంకి ఎక్కడుందో చెప్పడంలో మాత్రం అందరూ మౌనం వహిస్తున్నారు. “దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లుగా”, లోపల రాజకీయ నాయకులందరూ ఒకటై, విలువైన ప్రభుత్వ భూములను తమ అనుచరులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ధారాదత్తం చేస్తూ, కేవలం జర్నలిస్టుల విషయంలోనే నిబంధనలు, కోర్టు కేసులు అంటూ సాకులు వెతకడం వీరి ద్వంద్వ నీతికి పరాకాష్ట. జిల్లా కేంద్రంలో ఎటు చూసినా అక్రమ ఆక్రమణలు, అనధికార వెంచర్లు రాజ్యమేలుతున్నా కళ్లు మూసుకుంటున్న జిల్లా యంత్రాంగం , ప్రజాప్రతినిధులు, జర్నలిస్టుల దశాబ్దాల కల అయిన ఇళ్ల స్థలాల దస్త్రాన్ని మాత్రం అంగుళం కూడా కదపకుండా కాలయాపన చేయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో సామాన్య ప్రజలకు సైతం అర్థమవుతోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణదారుల పాలవుతోంది. రాజకీయనాయకుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువులు, కుంటలను కూడా వదలడం లేదు. తమ అనుచరుల కోసం అనుకూలమైన ఉత్తర్వులు తెచ్చుకోగల నాయకులు దశాబ్దాలుగా సమాజం కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల కోసం ఒక్క ఎకరం కేటాయించలేకపోవడం వెనుక ఉన్న వ్యాపార ప్రయోజనాలు ఏమిటి? ఇంత దారుణంగా జిల్లా కేంద్రంలో భూములు ఆక్రమణకు గురవుతుంటే అందరూ మద్దతిస్తున్నామని చెబుతున్నప్పుడు దోపిడీ చేస్తోంది ఎవరు? వారిని ప్రశ్నించేవారు లేరా? ఇంత నిజాయితీగల ప్రజాప్రతినిధులు కనీసం జిల్లా కలెక్టర్ ను కలిసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే అని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? జర్నలిస్టుల ఓట్లు కావాలి.. వారి కలం నుంచి వచ్చే పొగడ్తలు కావాలి.. కానీ వారి కుటుంబాలకు ఒక నీడ కావాలంటే మాత్రం సాకులు వెతుకుతున్నారు. ప్రజాప్రతినిధులు, అటు జిల్లా యంత్రాంగం ఏకతాటిపైకి వచ్చి నిర్ణయం తీసుకుంటే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య గంటల వ్యవధిలో పరిష్కారం అవుతుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *