రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం

– ప్రధాని మోదీ

– న్యూదిల్లీ, సెప్టెంబర్‌25: ఉత్తర్‌ ప్రదేశ్‌లో భారత రక్షణరంగ ఉత్పత్తుల్ని మరింత బలోపేతం చేస్తూ రైఫిల్స్‌ తయారీ త్వరలో ప్రారంభం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గురువారం ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని నోయిడాలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన సందర్భంగా మాట్లాడిన మోదీ.. భారత సైన్యం స్వయం సమృద్ధి (ఆత్మనిర్భర్‌) లక్ష్యంతో విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ‘మన సైన్యం స్వయం సమృద్ధిని సాధించాలని, విదేశీ మూలాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని ఆశిస్తోంది. ఈ లక్ష్యానికి, భారతదేశంలో బలమైన రక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రతి ఉత్పత్తి ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’గా ఉండాలని నొక్కి చెబుతున్నాం. దీనికి మద్దతుగా, ఉత్తర్‌ ప్రదేశ్‌ కీలకపాత్ర పోషిస్తోంది. రష్యా సహాయంతో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో రైఫిల్స్‌ తయారీ త్వరలో ప్రారంభం కానుంది’ అని పీఎం మోదీ చెప్పారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో డిఫెన్స్‌ కారిడార్‌ అభివృద్ధి చేస్తున్నామని.. ఇక్కడ బ్రహ్మోస్‌ మిస్సైళ్లు, ఇతర ఆయుధ వ్యవస్థల తయారీ ఇప్పటికే జరుగుతోందని మోదీ చెప్పారు. ఇందులో భాగంగానే, ‘అల్టిమేట్‌ సోర్సింగ్‌ బిగిన్స్‌ హియర్‌’ అనే థీమ్‌తో సెప్టెంబర్‌ 25 నుంచి 29 వరకు ఈ ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఇది ఆవిష్కరణ, సమైక్యత, అంతర్జాతీయీకరణపై దృష్టిపెడుతూ.. విదేశీ కొనుగోలుదారులు, దేశీయ కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వైవిధ్యమైన, ఆధునిక పరిశ్రమలు, కొత్త ఆర్థికవ్యవస్థలను సృష్టించబోతున్నాయని మోదీ అన్నారు. ఈ అభివృద్ధి భారత రక్షణ రంగంలో స్వదేశీ తత్వాన్ని బలపరుస్తూ, ఉత్తర్‌ ప్రదేశ్‌ను డిఫెన్స్‌ హబ్‌గా మార్చనుందని ప్రధాని చెప్పారు. దేశ ఆర్థిక, రక్షణ లక్ష్యాలకు ఇది మరో మైలురాయిగా మోదీ అభివర్ణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *