-గెలిచిన సర్పంచ్ తమ్ముడి దాష్టీకం
-ఓడిన అభ్యర్థిని ట్రాక్టర్‌తో ఢీ కొట్టిన వైనం
-పలువురికి తీవ్ర గాయాలు.. హాస్పిటల్‌కి తరలింపు
కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగియడంతో కక్షలు కార్పణ్యాలు బయటపడుతున్నాయి. గెలుస్తామన్న ధీమాతో బరిలోకి దిగిన అనేకమంది ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి. సర్పంచ్ ఎన్నికల కోసం భారీగా డబ్బులు వెచ్చించి ప్రచారాలు నిర్వహించారు. వోటర్లను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. గెలుస్తామని ధీమాగా ఉన్నవారు సైతం ఓటమి చెందారు. ఇదిలా ఉండగా కొన్ని ప్రాంతాల్లో ఈ ఎన్నికలు కక్షలకు దారి తీశాయి. గెలిచిన అభ్యర్థులపై ఓడిన అభ్యర్థులు దాడులకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే కామారెడ్డిలో మాత్రం రివర్స్. గెలిచిన అభ్యర్థికి చెందిన బంధువులు.. ఓడిపోయిన అభ్యర్థిపై కక్ష తీర్చుకునే ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది. జిల్లాలోని సోమార్‌పేటలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి బాలరాజును గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థి పాపయ్య తమ్ముడు చిరంజీవికి ప్రత్యర్థి బాలరాజు వర్గంతో గొడవ జరిగింది. చిన్న గొడవ కాస్తా చినికిచినికి గాలివానగా మారింది. ఆవేశంతో ఊగిపోయిన చిరంజీవి బాలరాజును ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాలరాజుతోపాటు గంజి భారతి, బాలమణి, స్వరూప, పద్మ సత్యవ్వలకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.