– సంకుచిత మనస్తత్వంతో చిట్ చాట్ పెట్టిన రేవంత్
– ఫ్రస్ట్రేషన్‌తో ఏదేదో మాట్లాడుతున్నడు
– కేసీఆర్ లేవనెత్తిన అంశాలను నివృత్తి చేయాలి
– ఉత్తమ్‌వి ఉత్తర ప్రగల్భాలు
– విలేకరుల సమావేశంలో హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22ః కేసీఆర్ ది హిమాలయాల ఎత్తు కలిగిన మనస్తత్వం.. రేవంత్ రెడ్డిది సంకుచిత మనస్తత్వం.. కేసీఆర్ స్టేట్స్ మన్ గా మాట్లాడితే రేవంత్ స్ట్రీట్ రౌడీలా మాట్లాడాడు. చీప్ గా మాట్లాడాడు. తెలంగాణకు నొక్కుబడనీయను అంటే ఎందుకు అంత ఆక్రోశం రేవంత్ రెడ్డీ అని మాజీ మంత్రి హరీష్‌రావు నిలదీశారు. సోమవారం ఇక్కడి తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డిని ద్రోహిగా నిలబెట్టారన్నారు. ఉత్తం ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. రెండేళ్లు అయ్యింది పింఛన్లు ఎందుకు పెంచలేదు, రూ.2500 మహాలక్ష్మి ఏమైందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అడిగారు. రైతులను ఎందుకు గోస పెడుతున్నరు, యాపులు, మ్యాపులు ఏమిటంటే సమాధానం లేదు. ఫార్మాసిటీ ప్రాముఖ్యతను కేసీఆర్ చెప్పారు. సమాధానం చెప్పరు. ఆర్థిక అరాచకత్వం బీఆర్ఎస్ పాలనలో అన్నరు. టోనీ బ్లెయిర్, సుబ్బారావు తెలంగాణ ప్రగతి గురించి మొన్నటి సమ్మిట్ లో ఏం చెప్పారు.. కొత్త రాష్ట్రం తెలంగాణ అద్బుతమైన అభివృద్ది సాధించిందన్నరు.. కేసీఆర్ చేసిన అభివృద్ది గురించి నువ్వు ఆహ్వానించిన ప్రతినిధులే చెప్పారు. రాజకీయాల కోసం ఎందుకు రాష్ట్రం పరువు తీస్తున్నవు రేవంత్ రెడ్డీ అని నిలదీశారు. పచ్చ కళ్లద్దాలు పెట్టుకుంటే పచ్చగా కనిపించినట్లు రేవంత్ తీరు ఉంది. సొంత పార్టీ నాయకులనే తొక్కుకుంటూ పెరిగిన అని చెప్పిండు రేవంత్ రెడ్డి.. రూ.50కోట్లు పెట్టి పీసీసీ కొన్నడు అని కోమటి రెడ్డి చెప్పిండు.. ఎమ్మెల్యేను కొనుగోలు చేసే క్రమంలో రూ.50లక్షలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగవు నువ్వు. నువ్వు నిజాయతీ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. చొక్కాలు మార్చినంత సులువుగా పార్టీ మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి.. త్యాగాల చరిత్ర మాది.. వెన్నుపోటు చరిత్ర మీది.. నీకు మాట్లాడే నైతికత ఉందా రేవంత్ రెడ్డీ.. ఊసరవెలి్ కూడా నిన్ను చూస్తే సిగ్గుపడుతుంది.. సోనియాను దేవత అంటవు, బలి దేవత అంటవు.. నీకో సిద్దాంతం ఉందా రేవంత్ రెడ్డి.. 2022-23లో 258 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణను నెంబర్ 1గా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2020-21లో 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రికార్డు నెలకొల్పినం .
మల్లన్నసాగర్, రంగనాయక్ సాగర్, అనంతగిరి కింద పండే పంటల కాళేశ్వరం కాదా? వర్షాలు బాగా ఉంటే ఎస్సారెస్పీ నుంచి, మధ్య పరిస్థితులు ఉంటే ఎల్లంపల్లి నుంచి, కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నీళ్లు వాడుతం.. నువ్వు రాకముందే ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ అయిందన్నారు. రెండేళ్లు అయినా ఉత్తం ప్రెస్ మీట్లకు ప్రిపేర్ కాకుండా రావడం సిగ్గుచేటన్నారు. సగం సగం చదవి సగం సగం చెబుతడు. 2023లో డీపీఆర్ వాపస్ వస్తే కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అనుమతి, సెంట్రల్ సాయిల్ & మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్అ నుమతి, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి, కేంద్ర భూగర్భ జల బోర్డు అనుమతి ఎట్ల సాధించినం. పాలమూరు డీపీఆర్ 12.04.2023లో వాపస్ వస్తే మూడు రోజుల్లోనే తమ ప్రభుత్వం జల్ శక్తి మినిస్ట్రీకి లేఖ రాసింది. కేసీఆర్ జల్ శక్తి అధికారులతో మాట్లాడారు. అక్కడ నుంచి సీడబ్ల్యూసీకి అప్రైసల్ కొనసాగించమని ఆదేశాలు ఇప్పించినం. ఈఏసీ సిఫారసు సహా ఏడు అనుమతులు సాధించినం. ఇది వాస్తవం కాదా అని అడిగారు. 19.12.2024 లో డీపీఆర్ వాపస్ లేఖ రాస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు. ఇదే కదా కేసీఆర్ నిన్న మిమ్మల్ని నిలదీసింది అన్నారు. రెండేళ్లలో ఒక్క అనుమతి కూడా ఎందుకు తేలేదు. ఇదికాక 45 టీఎంసీలు చాలు అంటూ ఢిల్లీకి రాసిండు ఉత్తం, సీఎం. సిగ్గులేకుండా మేం రాయలేదు అంటున్నారు. డీపీఆర్ వాపస్ తెస్తవు, 45 టీఎంసీలు చాలు అంటవు. 45 టీఎంసీలతో ఎవరికి అన్యాయం చేస్తవు, పాలమూరుకా, రంగారెడ్డికా, నల్లగొండకా.. ఎవరి డైరెక్షన్.. చంద్రబాబు డైరెక్షనా? దానికి సమాధానం చెప్పకుండా చిల్లర వాగుడు ఎందుకు అన్నారు. పాలమూరు 90శాతం పనులు ఎక్కడ అయ్యాయి అంటున్నరు వస్తరా? 90శాతం పనులు పూర్తి చేసింది వాస్తవం. మీరు రెండేళ్లలో ఏం చేశారు? 16 సెప్టెంబర్ న నార్లాపూర్ పంప్ హౌజ్ లో పంపు ను రన్ చేసి మహబూబ్ నగర్ ప్రజానీకానికి ప్రాజెక్టు నుంచి నీళ్ళు వస్తాయన్న భరోసాను కల్పించిండు కేసీఆర్. నార్లపూర్ 95 % పూర్తి, డిసెంబర్ 2023 జలాశయంలో 2 టిఎంసిల నీటిని నింపడం జరిగినది. ప్రస్తుతం జలాశయంలో 4 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఈ ఘనత మా ప్రభుత్వానికి కాదా ? ఏదుల, వట్టేం, కరివెన, ఉద్దండాపూర్ పనులు దాదాపు పూర్తి చేసినం. కేవలం రెండు కిలోమీటర్లు తవ్వుతే నీళ్లు నిండుతయి. బీఆర్ఎస్ ఉండి ఉంటే కొడంగల్, నారాయణ్ పేట్ రైతుల కాళ్లు కృష్ణా నీళ్లతో కడిగే వాళ్లం.
తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ
పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూ పాలమూరు గొంతు కోయడమేనా రాజకీయం అన్నారు. 299:512 విషయంలో మూతి పలగ్గొట్టే విధంగా ముత్తూడ్ సమాధానం అసెంబ్లీలోనే చెప్పిన. ఈ ఒప్పందానికి మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. కృష్ణాలో 299:512 వాటా ఇచ్చి తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. 2014 జులై 14 నాడు కృష్ణాలో 299 అన్యాయం అని కేంద్రానికి లేఖ రాసిండు కేసీఆర్. ఢిల్లీకి పోయి పోరాటం చేసిండు. రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఆనాటి కాంగ్రెస్ మాకు అన్యాయం చేసింది.. కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నిర్ణచించాలని కేంద్రాన్ని కోరినం. మేం 299 శాశ్వత ఒప్పందం చేసుకుంటే సెక్షన్ 3 ఎందుకు అడిగాం, అపెక్స్ కౌన్సిల్ ఎందుకు పోయాం, ఎందుకు సుప్రీంకు మెట్లు ఎక్కారు కేసీఆర్. సెక్షన్ 3 సాధించింది కేసీఆర్. ఆయన సంతకం పెట్టిండు అంటవు.. యాడ పెట్టిండు చూపెట్టు రేవంత్ రెడ్డి. 2025 ఫిబ్రవరి 17న కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ లో ఏముంది. అదే తాత్కాలిక ఒప్పందం వీళ్లు కూడా చేసుకున్నరు. దీని గురించి ఏమంటరు? దీనిపై రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు అని మేం అనలేమా? కానీ మేం చిల్లరగా మాట్లాడం. అందులో ఏముంది ఫైనల్ అవార్డు వచ్చే దాకా 50:50 చేసుకుందామని మీ సెక్రటరీ రాసిండు. అదే డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ 28 లెటర్లు రాసి అడిగింది. మీరు కొత్తగా చేసింది ఏముంది, కొత్తగా రాసింది ఏముంది. పదేండ్లలో కొత్తగా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు అని పచ్చి అబద్దం ఆడుతున్నారు. అది నోరా మోరా ఉత్తం. 2014 నుంచి 2023 వరకు 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 31.50 లక్షల ఎకరాల స్థిరీకరణ చేసినం. తొమ్మిదిన్నరేళ్లలో మొత్తం 48.74లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా.. అసెంబ్లీలో ఇచ్చినం అంటవు, నిన్ననేమో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు అంటవు. అంటే 2024-25 బడ్జెట్ లో ఆ ఏడాదికి 6,55,895 ఎకరాల ఐపీ క్రియేట్ చేస్తం అన్నరు. 2025-26 బడ్జెట్ లో 5,05,000 ఎకరాల ఐపీ క్రియేట్ చేస్తం అన్నరు. అంటే మొదటి రెండేళ్లలో 11,60,895 ఎకరాలు. 11 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినవా ఇస్తే ఎక్కడ ఇచ్చినవో చెప్పాలని సవాల్ విసురుతున్నా. చెప్పకపోతే అసెంబ్లీ సాక్షిగా తప్పు చెప్పా అని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు అని హరీష్‌రావు అడిగారు. రెండేళ్లలో మీరు చేసింది చెక్ డ్యాంల పేల్చివేత, ప్రాజెక్టుల కూల్చివేత తప్ప ఏముంది? ప్రాజెక్టులు, చెక్ డ్యాంలను కూల్చి వేస్తున్న అసలైన ఉగ్రవాది రేవంత్ రెడ్డి ఎస్ఎల్ బీ సీ కుప్పకూలితే శవాలను కూడా బయటకు తీయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది.. కృష్ణా నీళ్లలో అతి తక్కువ నీటి వినియోగం జరిగింది రేవంత్ రెడ్డి పాలనలోనే. కృష్ణా నీళ్లను తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా పెడుతురన్నది ముమ్మాటికీ నిజం. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాధించి తీరాలె అంటడు సీఎం.. ఉత్తం ఏమో 763 టిఎంసీల రైట్ షేర్ అంటడు, ముఖ్యమంత్రి ఏమో ఓసారి 500 టీఎంసీ అంటడు. ఓసారి 904 టీఎంసీలు అంటడు. పూటకో మాట మాట్లాడి పరువు తీసుకుంటున్నరు. వీళ్ల అజ్నానం వల్ల రాష్ట్రం హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉంది. కావాలనే తెలంగాణకు ద్రోహం చేస్తున్న అసలైన జల ద్రోహి రేవంత్ రెడ్డి. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం రోజు 10వేల క్యూసెక్కుల నీళ్లు తరలించుకుపోతుంటే మన ప్రభుత్వం చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తున్నదన్నారు. కృష్ణా జలాల్లో ఏపీ తాత్కాలిక వాటా 512 టిఎంసీలు.. కానీ 650 పైగా తరలించుకుపోతుంటే మీ నోరు పెగలదా? మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? తెలంగాణ నీటి ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్ఈ ప్రజల పాలిట పెను శాపం. 1984లో కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టి 2014 వరకు 13వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కానీ మేము పదేండ్లలోనే రూ.2600 కోట్లు ఖర్చు చేసి 3 లక్షల 7వేల ఎకరాలకు నీళ్లు అందించాం. నెట్టంపాడు 2300 ఎకరాలకు నీళ్లు ఇస్తే మేము రూ.540 కోట్లు ఖర్చు పెట్టి లక్షా 40వేల ఎకరాలకు,. బీమా కింద 12వేల ఎకరాలకు మీరు నీళ్లు ఇస్తే రూ.646 కోట్లు ఖర్చు చేసి లక్షా 60వేల ఎకరాలకు, కోయిల్ సాగర్ కింద 38వేల ఎకరాలకు ఇచ్చినం. మొత్తంగా పాలమూరులో పది లక్షల ఎకరాల్లో నీళ్లు పారించినం. ఎస్ఎల్ బీ సీ విషయంలోనూ అదే పచ్చి అబద్దం. ఎస్ ఎల్‌బీసీ టన్నెల్ సహా ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టులో భాగమైన డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాక రిజర్వాయర్, భూసేకరణ, పునరావాసం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ.3892 కోట్లు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే ఎక్కువ. పావు కిలోమీటర్ తవ్వకుండానే కుప్ప కూల్చారు. చిల్లర మాటలు ఇకనైనా ఆపండి ఇష్యూ బేస్ గా మాట్లాడు. ఆనాడు కేసీఆర్ గర్జిస్తే నువ్వు ప్రాజెక్టుల అప్పగింత నుంచి వెనక్కి వచ్చావు.. కేసీఆర్ నిన్ను, నీ ద్రోహాన్ని వదిలిపెట్టరు అని హరీష్‌రావు హెచ్చరించారు. చెంపలేసుకొని క్షమాపణలు చెప్పు 90టీఎంసీల కోసం పని చేసి రాష్ట్ర నీటి హక్కులు కాపాడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





