– అప్రమత్తంగా ఉండాలని న్యాయవాదులకు హెచ్చరిక
న్యూదిల్లీ, నవంబర్ 10: ఆధునిక సాంకేతిక యుగంలో చాలా మంది డీప్‌ఫేక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాయిస్ క్లోనింగ్, డీప్‌ఫేక్, చాట్‌బాట్ ఫిషింగ్ వంటి టూల్స్, యాప్స్‌ను ఉపయోగించి దీని ద్వారా సైబర్ నేరగాళ్లు తేలికగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ డీప్‌ఫేక్ ఫొటోలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏఐ దుర్వినియోగం న్యాయవ్యవస్థపై కూడా పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎందరో న్యాయమూర్తులు, న్యాయవాదుల మార్ఫింగ్ చిత్రాలు కూడా తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఏఐ దుర్వినియోగం విషయంలో న్యాయవాదులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాధారణ ఏఐకి, జెన్ ఏఐకి మధ్య చాలా వ్యత్యాసముందని..జెన్ ఏఐని న్యాయవ్యవస్థలోకి వస్తే అది ఉనికిలో లేని చట్టాలను కూడా రూపొందిస్తుందని న్యాయవాది కార్తికేయ రావల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీని వల్ల న్యాయ వ్యవస్థలో అస్పష్టత నెలకొంటుందని.. కాబట్టి న్యాయ సంస్థలలో జనరేటివ్ ఏఐ వినియోగాన్ని నియంత్రించడానికి మార్గదర్శకాలను రూపొందించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఆర్. గవాయ్ ధర్మాసనం సోషల్ డియాలో తమ డీప్ ఫేక్ ఫొటోలు కూడా ఉండడం చూసి ఆందోళనకు గురైనట్లు పేర్కొంది. ఈ కేసుపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఏఐ అనేది మనిషి మెదడు లాగా ఆలోచించి, నేర్చుకుని, సమస్యలు పరిష్కరించే టెక్నాలజీ. కానీ జనరేటివ్ ఏఐ కేవలం మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే కాకుండా కొత్త విషయాలను సృష్టిస్తుంది. దానికి ఒక్క మాట చెప్పగానే ఎటువంటి సమాచారం ఇవ్వకపోయినా కథలు రాస్తుంది. ఫోటోలు, వీడియోలు రూపొందిస్తుంది. పాటలు కంపోజ్ చేస్తుంది. ఎటువంటి కొత్త విషయాలనైనా సొంతంగా సృష్టించ గలుగుతుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





