రాష్ట్ర చరిత్రలో గొప్ప ఘట్టానికి గుర్తుగా ‘దీక్షా దివస్‌’

– 29న ఘనంగా నిర్వహించాలి
– నాయకులకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 22: ‘తెలంగాణ వచ్చుడో.. కెేసీఆర్‌ సచ్చుడో’ అనే నినాదంతో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ చేపట్టిన దీక్షకు గుర్తుగా ఈనెల 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) తెలిపారు. దశాబ్దంన్నర క్రితం పార్టీ అధినేత కేసీఆర్‌ దీక్షను చేపట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నారని గుర్తు చేస్తూ తెలంగాణ చరిత్రలో ఘనమైన ఈ ఘట్టాన్ని పురస్కరించుకుని దీక్షా దివస్‌ను పెద్దఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ జనరల్‌ బాడీ సభ్యులతో శనివారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనికి ముందుగా 26న అన్ని జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహించుకోవాలని, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, కార్పొరేషన్‌ల మాజీ చైర్మన్లు సహా ఇతర కీలక నాయకులందరినీ ఆహ్వానించాలని ఆదేశించారు. ఇందులో 29న దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాల‌న్నారు. దీక్షా దివస్‌ను జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లోనే నిర్వహించాలన్నారు. ఒక రోజు ముందుగా అంటే 28వ తేదీ సాయంత్రంలోగా జిల్లా కేంద్రాలు, పట్టణాలను బ్యానర్లు, ఫ్లెక్సీలతో అలంకరణ పూర్తి చేయాలి.. పార్టీ కార్యాలయ ప్రాంగణాన్ని కూడా అలంకరించాలి అని సూచించారు. జిల్లాలోని ముఖ్య నాయకులందరికీ సమాచారం అందించి కనీసం వెయ్యిమంది కీలక నేతలతో ఈ సమావేశాన్ని నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. తెలంగాణ తల్లికి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన తర్వాత కార్యక్రమం ప్రారంభానికి గుర్తుగా కేసీఆర్‌ భారీ కటౌట్‌కు పాలాభిషేకం చేయాలన్నారు. ఆనాడు జరిగిన అనేక కీలక సంఘటనలు, వార్తలు, పరిణామాల సమాహారంతో కూడిన ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేయాలని, ఈ ఫోటోలను పార్టీ కేంద్ర కార్యాలయం జిల్లాలకు పంపిస్తుందని, వీటితోపాటు జిల్లాల్లోనూ దీక్షా దివస్‌ సందర్భంగా జరిగిన సంఘటనల ఫోటోలు, వార్తా కవరేజ్‌ క్లిప్పింగ్‌లతో మరొక ఉప విభాగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రాజకీయ ఉపన్యాసాలు కాకుండా ఆనాటి ఉద్యమ స్మృతులను, ముఖ్యంగా దీక్షా దివస్‌ వివరాలను అందించేలా మాట్లాడే వక్తలను ఆహ్వానించాలని, వారి సమయాన్ని ఇప్పుడే నిర్ధారించుకోవాలని కేటీఆర్‌ సూచించారు. పండ్ల పంపిణీ, వీలుంటే అన్నదానం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టవచ్చునన్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో పండ్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పార్టీ యూత్‌, విద్యార్థి విభాగం తరఫున ప్రతి యూనివర్సిటీలో దీక్షా దివస్‌ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దీక్షా దివస్‌ పేరుతో, కెేసీఆర్‌ చిత్రంతో కూడిన ప్రత్యేక టీ-షర్టులను ధరించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *