వ్యవసాయ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7: ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకాలు పెంచాలన్న డిమాండ్‌పై దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో కలిసి కేంద్ర మంత్రులను కలిసే యోచనలో ఉన్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్ పామ్ సాగుదారుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో ఆయన సంప్రదింపులు జరిపారు. ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని పెంచాలన్న అంశంపై ఈ చర్చలు జరిగాయి. కేంద్రం విధాన నిర్ణయాలు రైతులకు మేలు చేసేలా ఉండాలన్నారు. ప్రస్తుతం కేంద్రం క్రూడ్ పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల దిగుమతి చేసుకున్న ఆయిల్ దేశీయ మార్కెట్‌లో చౌకగా లభిస్తున్నదని, దీనివల్ల ఆయిల్ పామ్ ఉత్పత్తి చేస్తున్న దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లు, రిఫైనర్లు, రిటైల్ వ్యాపారులకు మాత్రం లాభాలు కలుగుతున్నాయని, రైతులకు అన్యాయం జరుగుతోందని మంత్రి తుమ్మల అన్నారు. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనాలంటే దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని భావించిన ఆయన ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు వ్యక్తిగతంగా లేఖలు పంపారు. ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలన్న డిమాండ్‌తో కేంద్రాన్ని కలవాలని, రైతుల పక్షాన గళం వినిపించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ఢల్లీికి వెళ్లి కేంద్ర మంత్రులతో ప్రత్యక్షంగా సమావేశమై సాగుదారులకు అనుకూలంగా దిగుమతి విధానాల్లో మార్పులు చేయాలన్న డిమాండ్‌ను వినిపించాలన్నారు. ఆయిల్ పామ్‌కు మినిమమ్ గ్యారంటీ ప్రైస్ రూ.25వేలుగా నిర్ణయించాల్సిన అవసరాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. గతంలో మాదిరి క్రూడ్ పామ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కోరారు. రైతుల హక్కులు, వారి జీవనోపాధి రక్షణ, దేశీయ ఆయిల్ పామ్ పరిశ్రమ స్థిరత్వం కోసం రాష్ట్రాలు కలిసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి తుమ్మల కోరారు.





