- పర్యావరణ హిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం
- ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
లైఫ్ సైన్సెస్ పాలసీపై త్వరలోనే క్యాబినేట్ లో నిర్ణయం తీసుకుంటామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘‘హెచ్‌ఐసీసీ’’ బయో ఏషియా 2025 సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే తొలి సారిగా తెలంగాణలో లైఫ్ సైన్సెస్ యూని వర్సిటీ నీ ఏర్పాటు చేయబో తున్నామని, ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ లోని లోపాల వల్ల పట్టాతో బయటకు వొచ్చే విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్యం ఉండడం లేదు. ఈ లోటును భర్తీ చేయడమే మా లక్ష్యం. అందుకే పరిశ్రమల భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.
ఫార్మా రంగంలో తెలంగాణ లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాలుష్యం లేకుండా వీటిని టైర్ 2, టైర్ 2 నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేస్తాం. వికారాబాద్, జహీరాబాద్ లో ఇప్పటికే స్థలాలను గుర్తించాం. లగచర్లలో ఫార్మా పరిశ్రమల కాకుండా పర్యావరణహిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మా ప్రభుత్వం ప్రజలు తెలిపే నిరసన, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని… అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణలో యూఎస్ దిగ్గజ కంపెని ఆమ్జెన్, మరికొన్ని దిగ్గజ సంస్థలు రూ.5వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం సంతోషకరమని ఆయన అన్నారు.



