– ఎనుమాముల మార్కెట్‌లో నిలిచిన కొనుగోళ్లు
– కేంద్ర, రాష్ట్రాలది మొద్దు నిద్ర : కేటీఆర్, గండ్ర విమర్శలు
వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 17: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లపై తీవ్ర గందరగోళం నెలకొంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీరుపై రైతులు, జిన్నింగ్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొత్త కొర్రీలతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు, వ్యాపారులు తెలిపారు. ఈ క్రమంలో సోమవారంనుంచి జిన్నింగ్ మిల్లుల బంద్‌కు వ్యాపారులు పిలుపునిచ్చిన నేపథ్యంలో రైతులు పత్తిని మార్కెట్‌కు తీసుకురాకపోవడంతో వ్యవసాయ మార్కెట్ బోసిపోయింది. పత్తి కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పత్తిని పండిరచిన తెలంగాణ రైతన్నలు నేడు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మార్కెట్ యార్డుల్లో పడిగాపులు పడుతున్నారన్నారు. కళ్ల ముందే పండిరచిన పత్తి ఈ చలికాలపు తేమకు పాడవుతోంటే ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర నటిస్తున్నాయని మండిపడ్డారు. నెల రోజుల్లో 28 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం కాగా కేవలం 1.12 లక్షల టన్నుల పత్తి కొనుగోలు చేశారంటేనే రాష్ట్రంలో నెలకొన్న పత్తి కొనుగోళ్ళ సంక్షోభానికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. తేమ శాతం, కపాస్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్, మిల్లుల గ్రేడిరగ్ అంటూ కుంటి సాకులతో సీసీఐ పత్తి కొనుగోలుకు నిరాకరిస్తుంటే దానికి జిన్నింగ్ మిల్లర్ల అవినీతి తోడైందని విమర్శించారు. మద్ధతు ధర రాక, దళారులకు తెగనమ్ముకుని రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు వెంటనే పత్తి కొనుగోలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తీసిన పత్తిని అమ్ముకోలేక ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి రైతుల బాధలపై బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొనుగోళ్లు లేక, మద్దతు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతుంటే ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు మద్దతు ధర కోసం బీఆర్‌ఎస్ నిరసనకు దిగుతుందని హెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





