– ఎంపీ ఈటల రాజేందర్
– సహకార రంగ బలోపేతానికి కృషి చేశారు
– మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27ః సహకార వ్యవస్థ రాజకీయాలకతీతంగా పనిచేస్తుందని, ప్రభుత్వం పై భారం పడకుండా చూస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఇలాంటి వ్యవస్థను గొప్పగా తీర్చిదిద్దాలి తప్ప నిర్లక్ష్యం చేయవద్దన్నారు. డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పదవీ కాలం ముగిసినందున ఆయనను కరీంనగర్‌లోని గీత భవన్‌లో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేనందర్ మాట్లాడుతూ రవీందర్ రావు సేవలకు యావత్ కరీంనగర్ జిల్లా రాజకీయాలకతీతంగా ఈరోజు ఆయన్ను సన్మానించుకుంటున్నామన్నారు. ఆయన హయాంలో డీసీసీబీ రూ.400 టర్నోవర్ నుంచి రూ.800 కోట్ల టర్నోవర్ కు పెరిగిందని చెప్పారు. డీసీసీబీ ప్రగతిని ఏ రాజకీయ నాయకుడు కూడా ఒప్పుకోకుండా ఉండలేడన్నారు. 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి ఈ సహకార వ్యవస్థకు ఉరివేసి చంపేసే ప్రయత్నం జరిగింది. సహకార రంగాన్ని మూసివేయవద్దని ఆనాడు కొట్లాడిన వారిల్లో నేను కూడా ఒకడిని.. దానికి సానుకూలంగా స్పందించి సహకార వ్యవస్థను రాజశేఖర్ రెడ్డి బలోపేతం చేశారని చెప్పారు. రాజేశ్వరరావు ప్రారంభించిన కరీంనగర్ డెయిరీని కూడా ఖతం చేయాలని ప్రయత్నించినప్పుడు కూడా పాడిపంట ఉండాలని కొట్లాడిన. పాలు మహిళలకు ఆదాయం అందిస్తుందని చెప్పిన. ములకనూరు సొసైటీ, గట్టు నూతనపల్లి సొసైటీ, కరీంనగర్ డీసీసీబీ, కరీంనగర్ డెయిరీలు కరీంనగర్ జిల్లాకే వన్నె తీసుకొచ్చాయని ఈటల పేర్కొన్నారు. ఎంత ఆదాయం పెరిగింది, జిడిపి పెరిగింది అనే దానికంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఎంత భరోసాగా బతుకుతున్నారు అనేదే గీటు రాయి అన్నారు. లైవ్ స్టాక్, వ్యవసాయ రంగంలో ఉన్న బాధ ఏందో చూసిన వాన్ని కాబట్టి పార్లమెంటు స్టాండింగ్ కమిటీల్లో కూడా అడిగి మరీ మెంబర్ గా వేయించుకున్నానుని తెలిపారు. ఈ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వంలో అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు, సహకార రంగంలో పనిచేస్తున్న పెట్రోల్ బంక్ లకు కమర్షియల్ గా అనుమతి ఇవ్వాలని రవీందర్ రావు కేంద్రానికి రాసిన లేఖతోనే దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంప్ లకు కమర్షియల్ అనుమతి వచ్చిందని తెలిపారు. గోదాముల నిర్మాణానికి ఒక శాతం వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నది. ఒక మెగావాట్ విద్యుత్ కోసం కూడా ఒక శాతం వడ్డీకే రుణాలు మంజూరు చేసింది. అందుకోసం అవసరమైన చట్టాలను కూడా సవరించింది. సహకార వ్యవస్థ ఎంత బలంగా ఉంటే దేశం అంత ముందుకు పోతుందని అమిత్ షా భావిస్తున్నారు. అమిత్ షా హోం మంత్రిత్వ శాఖ మీద ఎంత దృష్టి పెడుతున్నారో.. అంతకంటే ఎక్కువ సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన కూడా ఒకనాడు సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేసి వచ్చినవారేనన్నారు. సహకార సంస్థలకు ఎన్నికలు జరుపుకొని లోపాలు ఏమైనా ఉంటే సరిచేసుకోవాలి కానీ ప్రభుత్వాలు మారగానే వాటిని రద్దు చేయడం సరికాదని ఈటల హితవు పలికారు. గ్రామాలు సమగ్ర అభివృద్ధి చెందాలంటే ఈ వ్యవస్థలన్నీ పనిచేయాలి. ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా.. తక్షణమే మున్సిపల్, జీహెచ్ఎంసి , మండల పరిషత్ ఎన్నికలు జరిపాలని కోరుతున్నానన్నారు. సహకార సంఘాలకు కూడా ఎన్నికలు జరపాలన్నారు. ఐడీపీఎల్, హెచ్ఏఎల్ మళ్ళీ తెరవాలని కోరుతున్నానని, వాటి గురించి పార్లమెంట్లో మాట్లాడానని చెప్పారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు ఏది అవసరమైనా కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మీ అందరికీ మాట ఇస్తున్నానన్నారు.
సహకార రంగంలో ఎనలేని కృషి చేశారు : మంత్రి పొన్నం
కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ గా 20 ఏళ్లుగా సేవలు అందించిన కొండూరు రవీందర్ వీడ్కోలు, సన్మాన కార్యక్రమంలో బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. సహకార సంఘాల్లో ఎనలేని కృషి చేసిన కొండూరీ రవీందర్కి శుభాకాంక్షలు తెలిపారు. సహకార సంఘాల్లో ఉన్నపుడే తాను మార్క్ ఫెడ్ చైర్మన్ గా ఆయన సహకార సంఘాల్లో ఉండేదని తెలిపారు. రైతులకు సహకార సంఘాల ద్వారా వారికి నిరంతరం అండగా ఉండేవారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం , మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ , పుట్ట మధు , సతీష్ , మోహన్ రెడ్డి , లక్ష్మణ రావు , రవిశంకర్, మోహన్ , అరుణ , శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



