రాహుల్ ప్రధాని అయితేనే వాటికి పరిష్కారం

– కాంగ్రెస్‌ను కనుమరుగు చేయాలని బీజేపీ యత్నం
– ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశంలోని రుగ్మతలకు పరిష్కారం లభిస్తుందని, ఆయనను ప్రధానమంత్రిని చేసేవరకు రెండు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నిరంతరం పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకునేలా కృషి చేయాలన్నారు. వికారాబాద్‌లో నిర్వహిస్తున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో సోమవారం ఆయన మాట్లాడారు. కుల సమస్యలు, రిజర్వేషన్లు, కాంగ్రెస్ వాదిగా కుల వివక్ష నిర్మూలనకు ఎలా పోరాలి అన్న అంశంపై ప్రసంగించారు. దేశంలో అంటరానితనం, వివక్ష సమస్య ఎక్కడ ఎదురైనా రాహుల్ గాంధీ అక్కడ ప్రత్యక్షం అవుతారని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల కుల వివక్షను భరించలేక బలవన్మరణానికి పాల్పడితే రాహుల్ గాంధీ నేరుగా యూనివర్సిటీకి చేరుకొని విద్యార్థులతో చర్చించి పోరాట విధానాన్ని ఖరారు చేశారని తెలిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఎవరినీ యూనివర్సిటీలోకి అనుమతించలేదన్నారు. అంటరానితనం సమస్యను సమస్యగా చూడాలి తప్ప రాజకీయ జోక్యం ఉండకూడదన్నది ఆయన ఆలోచన అని వివరించారు. ఆయన ఆలోచన మేరకు కర్ణాటక, తెలంగాణల్లో రోహిత్ వేముల చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.

కుల గణనను 50 రోజుల్లో పూర్తి చేసిన ప్రజా ప్రభుత్వం 

ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం.. రాగానే వనరులు, సంపద సమానంగా పంచుతామని ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ప్రకటించారని, ఆయన ప్రకటించినట్టుగా అధికారంలోకి రాగానే ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశ స్వాతంత్రం అనంతరం ఎక్కడా జరగని కుల గణనను ప్రజా ప్రభుత్వం 50 రోజుల్లో పూర్తి చేసి శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని వివరించారు. దేశానికి స్వాతంత్య్రం సాధించడంతోపాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం సాధించేందుకు అనేక విప్లవాత్మక చట్టాలు చేసిన, స్వాతంత్రం ముందు నుంచి దేశంలోని రుగ్మతల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ ముక్తభారత్ చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నదని ఆరోపించారు. ఈ సమాజం సామాజికంగా, ఆర్థికంగా విభజన జరిగి ఇలాగే ఉండాలని కొన్ని పార్టీలు కోరుకుంటున్నాయని తెలిపారు. కులం అనేది భారత దేశంలో ఒక వాస్తవమని, తానూ కుల వివక్ష ఎదుర్కొన్నానని వివరించారు. ఈ సమాజంలో కుల వివక్ష ఉంటుంది అన్న వాస్తవాన్ని మదిలో పెట్టుకుని బలమైన సంకల్పంతో లక్ష్య సాధనకు ముందుకుపోతున్న క్రమంలో వివక్ష ఎదురైనా అది మన లక్ష్యాలను దెబ్బతీయలేదని అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఒక రాజకీయ పార్టీగా మాత్రమే కాదు.. దేశంలో అంటరానితనం, బాల్య వివాహం, వితంతు వివాహం వంటి అనేక రుగ్మతలపై దశాబ్దాలుగా ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తూ ముందుకుపోతోందని భట్టి తెలిపారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామం ఒకవైపు, సామాజిక అంశాలపై ఆందోళనలో మరోవైపు ఈ దేశంలో రెండు అంశాలను ఏఐసీసీ సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లిందని వివరించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధాని నెహ్రూ, డాక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో దేశంలో అంటరానితనం నిర్మూలనకు 1049లో ఆర్టికల్ 17 ద్వారా అవకాశం కల్పించారని చెప్పారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావడం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను పూర్తిగా అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారానే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ ద్వారా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక స్వాతంత్య్రం లభించిందని, తద్వారా సామాజిక వివక్షను ఎదుర్కొనేందుకు చేయూత లభించిందని డిప్యూటీ సీఎం వివరించారు. సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డాక్టర్ వంశీచందర్ రెడ్డి, ఏఐసీసీ నాయకులు విశ్వనాథన్, సావంత్, సచిన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *