ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ దాసోజు

– సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి19: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన ప్రసంగాలు సాగుతున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నోటికి హద్దులు లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ను కలిసి ముఖ్యమంత్రిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వంద అడుగుల భూమిలోకి తొక్కిపెట్టాలని రేవంత్ రెడ్డి మాట్లాడటంపై శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణ సాధించిన నాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ దౌర్జన్యమని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ కోసం పుట్టిన బీఆరఎస్ పార్టీని కూల్చేస్తానని, బీఆరఎస్ దిమ్మెలను టీడీపి నాయకులు కూలగొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం ఇరు పార్టీల మధ్య గొడవలకు దారితీస్తోందని శ్రవణ్ ఆరోపించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని విమర్శించారు. ఎన్నికల హావిÖలు అమలు
చేయలేక, ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి ఇటువంటి ’డైవర్షన్ పాలిటిక్స’ చేస్తున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ అస్థిత్వంపై ప్రశ్నించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై కేసులు పెట్టినప్ప్పుడు, కేసీఆర్‌ను బొందపెడతామన్న ముఖ్యమంత్రిపై ఎందుకు కేసులు పెట్టరని శ్రవణ్ ప్రశ్నించారు. తలసానిపై ప్రయోగించిన అదే సెక్షన్లను రేవంత్ రెడ్డిపై కూడా వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తూ ఆయన శరీరం కాంగ్రెస్‌ది, కానీ ఆత్మ మాత్రం టీడీపీదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసుతో తెలంగాణలో టీడీపీ పతనానికి రేవంత్ రెడ్డే బీజం వేశారని, ఇప్పుడు బీజేపీ`టీడీపితో చీకటి రాజకీయాలు చేస్తూ తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. 1200 మంది అమరుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేడు తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం తగదని హెచ్చరించారు.

సీఎం రేవంత్‌వి చిల్లర మాటలు : సింగిరెడ్డి

వనపర్తి : హామీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమయ్యిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి చిల్లర కూతలు కూయడం మానుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సహచర మంత్రులతో ఉన్న విభేదాలతో ఏమి చేయాలో పాలుపోక వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి సీఎం చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ గ్దదెలు కూల్చాలన్న వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. బీఆర్‌ఎస్ గ్దదెలపై చేయి పడితే కాంగ్రెస్ పార్టీని వందమీటర్ల లోతున బొందపెడతారని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో అసమానతలు, వివక్ష మూలంగానే తెలంగాణ ఉద్యమం మొదలయిందని, టీడీపీ, కాంగ్రెస్ మోసం మూలంగానే తెలంగాణ బిడ్డలు అమరులయ్యారని అన్నారు. కొత్త జిల్లాలను ముట్టుకుంటే ప్రభుత్వ నాలికలను ప్రజలు తెగ్గొడతారని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో కొత్త జిల్లాలను శాస్త్రీయంగానే ఏర్పాటు చేశామని వివరించారు. తెలంగాణలో ఉన్న కొద్దిమంది ఓట్ల కోసం టీడీపీ గురించి రేవంత్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఆరోపించారు.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *