జిల్లాల్లో పర్యటించండి

– ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి దామోదర ఆదేశాలు
– సంగారెడ్డి నుంచి టెలీ కాన్ఫరెన్స్‌

సంగారెడ్డి, ప్రజాతంత్ర, జులై 24: రాష్ట్రంలో వర్షాలు, వాతావరణ మార్పులతో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. తక్షణమే జిల్లాలకు వెళ్లి ప్రభుత్వ హాస్పిటళ్లను సందర్శించాలని ఆదేశించారు. సంగారెడ్డి పర్యటనలో ఉన్న మంత్రి హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చొంగ్తు, ఇతర ఉన్నతాధికారులతో గురువారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించాలని సూచించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ శాఖలను అప్రమత్తం చేయాలని, యాంటిలార్వాల్‌ ఆపరేషన్స్‌, ఫాగింగ్‌, ఇండోర్‌ స్ప్రేయింగ్‌ విస్తృతంగా చేయాలన్నారు. సీజనల్‌ వ్యాధులతో ప్రభుత్వ హాస్పిటళ్లలో ఓపీ, ఐపీ పెరిగే అవకాశం ఉన్నందున ఓపీ కౌంటర్లను పెంచాలని, అవసరమైతే ఓపీ సమయాలను పొడిగించుకోవాలని, అన్ని రకాల మందులు, డయాగ్నస్టిక్‌ పరికరాలు, టెస్టింగ్‌ కిట్స్‌ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. టీ-డయాగ్నస్టిక్‌ సెంటర్లపై పర్యవేక్షణ పెంచాలని, అన్ని రకాల టెస్టులు చేయడంతోపాటు అదేరోజు పేషెంట్లకు రిపోర్టులు అందజేయాలన్నారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు హాస్పిటళ్లలో తనిఖీ చేయాలన్నారు. హాస్పిటల్స్‌లో వార్డులు, వాష్‌రూమ్‌లు పరిశుభ్రంగా లేకపోయినా, పేషెంట్లకు అందించే ఆహారంలో నాణ్యత లోపించినా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంవోలు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ప్రైవేటు హాస్పిటళ్లపై నిఘా పెంచి డెంగీ, ప్లేట్‌లెట్స్‌ పేరిట ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బిల్లులు అధికంగా వేసి పేషెంట్లను దోచుకోకుండా చూడాలన్నారు. ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ నుంచి టీచింగ్‌ హాస్పిటల్‌ వరకూ అన్ని హాస్పిటళ్లలో పాము, తేలు కాటుకు అవసరమైన మెడిసిన్‌, ఇంజెక్షన్లు అందుబాటులోకి ఉంచుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య సేవలందించాలన్నారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తూ ప్రసవమయ్యే రోజు దగ్గరలో ఉన్న గర్భిణులను హాస్పిటల్స్‌లోని బర్త్‌ వెయిటింగ్‌ రూమ్స్‌కు తరలించి సేవలందించాలని మంత్రి సూచించారు. ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా తక్షణమే వెళ్లి పేషెంట్‌ను తరలించేలా డ్రైవర్లు, ఈఎంటీలను 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. భారీ వర్షాలు, గాలుల వల్ల విద్యుత్‌ అంతరాయం కలిగే ప్రమాదం ఉన్నందున హాస్పిటళ్లలోని జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

ఇంట్లోనే వండుకుని తినండి: ప్రజలకు మంత్రి విజ్ఞప్తి

మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోపరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో హోటల్స్‌లో ఆహారం తినాల్సి వస్తే శుభ్రత పాటించే హోటల్స్‌నే ఎంచుకోవాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ సంగీత సత్యనారాయణ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్రరెడ్డి, ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్‌, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ రవింద్ర నాయక్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నరేంద్ర కుమార్‌, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌, ఆయుష్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ బాబు తదితరులు జిల్లాల్లో పర్యటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *