– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజారోగ్యానికి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అదేశించారు. భారీ వర్షాల ప్రభావిత జిల్లాల వైద్య శాఖ అధికారులతో హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో టెలిపోన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేటలతోపాటు ఇతర జిల్లాల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. పాము కాట్లు, సీజనల్ వ్యాధులు విస్తరించకుండా అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి అదేశించారు. వచ్చే రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్లు, నర్సింగ్ స్టాప్, ఫార్మసిస్ట్‌లు, హాస్పిటల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి అదేశించారు. భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారిన నేఫధ్యంలో ప్రజలకు తక్షణ వైద్య సాయం అందించటంపై ఉన్నతాధికారులు నిరంతరం జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి దామోదర అధికారులను అదేశించారు.
లోతట్టు ప్రాంతాలలో వర్ష ప్రభావానికి గురైన ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, అంటువ్యాధులు ప్రబలకుండా మెరుగైన పారిశుధ్య చర్యలు తీసుకోవటానికి పురపాలక, పంచాయితీ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీ, డిజాస్టర్ మెనేజ్‌మెంట్ అధికారులతో సమన్వయం చేసుకుని అధిక వర్ష ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని మంత్రి అదేశించారు.





