– లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు
– వరద ప్రాంతాల్లో మంత్రి దామోదర పర్యటన
రామాయంపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 28: మెదక్ జిల్లాలోని రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం పర్యటించి వరద బాధితులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల రామాయంపేట జలదిగ్బంధంలో చిక్కుకుందన్నారు. వరదల్లో చిక్కుకున్న 60 మందిని జిల్లా విపత్తు నివారణ యంత్రాంగం, రెవెన్యూ, పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కాపాడారని తెలిపారు. ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారన్నారు. వీరిలో ఒకరి మృతదేహం లభించిందని మంత్రి వెల్లడిరచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాలు, వరదల పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉందంటూ జిల్లా యంత్రాంగం ప్రజలను కాపాడే పనిలో నిమగ్నమై ఉన్నదన్నారు. వరద ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మంత్రి ఫోన్‌లో సమీక్షించారు. యాభయ్యేళ్లలో ఇంతటి భారీ వర్షాలను చూడలేదని స్థానిక ప్రజలు మంత్రికి తెలిపారు. రామాయంపేటలోని కామారెడ్డి రోడ్డులో ఉన్న బీసీ కాలనీలో నీట మునిగిన ఇండ్లను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిశీలించారు. రామాయంపేటలోని వరద ప్రభావిత ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాలను ఆయనతో కలిసి మంత్రి దామోదర్ పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి నిత్యావసర వస్తువులను, భోజనాలను, బట్టలను, బెడ్ షీట్లను అందజేయాలని మంత్రి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నిజాంపేట మల్క చెరువు, కోనాపుర్, నందిగామ రోడ్డులో దెబ్బతిన్న బ్రిడ్జి, సాయి చెరువు అలుగులను ఆయన పరిశీలించారు. వచ్చే రెండుమూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు రెవెన్యూ, పోలీస్, విపత్తు నివారణ సిబ్బందికి సహకరించాలని మంత్రి ప్రజలకు సూచించారు. ప్రజలు సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలని సూచించారు. పూర్తిగా దెబ్బతిన్న, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లు పరిశీలించారు. జననష్టం జరగకుండా నష్ట నివారణ చర్యలు చేపడుతున్నామన్నారు దెబ్బతిన్న రోడ్లను త్వరలో పునరుద్ధరిస్తామన్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం అంశాలను రెవెన్యూ యత్రాంగం అంచనాలు రూపొందిస్తున్నదన్నారు. రామాయంపేట, కామారెడ్డి, మెదక్‌లలోని కొన్ని మండలాల్లో సుమారు 200 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని మంత్రి వెల్లడిరచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు నిరంతరం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్పారన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





