– వాటిని సరిదిద్ది పాలనాపర ఇబ్బందులు తొలగిస్తాం
– రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
– సంక్రాంతి కానుకగా డీఏ
– టీజీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి 12: గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, మండలాలను రేషనలైజ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ టీజీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పాలనలో సమస్యలు సృష్టించిన ఈ జిల్లాల ఏర్పాటును సక్షించి సరిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఇది రాష్ట్రంలోని పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతం చేయడానికి అవసరమన్నారు.గత ప్రభుత్వం అశాస్త్రీయంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల పాలనపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. జిల్లాల సరిహద్దులు మార్చాలని విజ్ఞప్తులు వొస్తున్నాయని, త్వరలో జిల్లాల పునర్విభజన కోసం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ కమిటీ రాష్ట్రమంతా తిరిగి అభిప్రాయాలు స్వీకరిస్తుందని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పేరు సహేతుకంగా లేదనే మార్చినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త జిల్లా కేంద్రాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం వెల్లడించారు. వరంగల్, హనుమకొండ జిల్లాలను కలపాలని ప్రజల నుంచి డిమాండ్ వొస్తోందని.. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి త్వరలో రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కమిషన్ ఆరు నెలలపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ పై నివేదిక సమర్పిస్తుందని సీఎం చెప్పారు. అన్ని జిల్లాల్లో మండలాలు సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే, బ్జడెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని, విధివిధానాలు రూపొందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కమిషన్ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని హా ఇచ్చారు.
ఉద్యోగులు ప్రభుత్వ సారథులు
ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ సారథులుగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ‘మా ప్రభుత్వ వారదులు.. సారథులు ప్రభుత్వ ఉద్యోగులే. ఆనాడు ప్రభుత్వం తప్పుడు పనులను ఉద్యోగులపై ఒత్తిడి చేసి అమలు చేయించింది. పెద్ద దిక్కుగా ఉండాల్సిన వ్యక్తి ఫామ్ హౌజ్‌లో పడుకున్నారు’ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘నేను అన్నగా వొచ్చాను. ఇప్పుడు నేను 18 గంటలు పనిచేస్తున్నాను. ఈరోజు డీఏ ఫైల్‌పై సంతకం చేసి వచ్చాను. దీంతో ప్రభుత్వానికి రూ.227కోట్ల భారం పడుతుంది’ అని రేవంత్ రెడ్డి ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రతీ ఉద్యోగికి రూ.1.02 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని త్వరలో అమలు చేస్తాం. ఉద్యోగులు, ప్రభుత్వం వేరువేరు కాదు. ఇద్దరం కలిస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి’ అని సీఎం అన్నారు. అలాగే, భూములు, ఇసుక, ఉన్న సబ్సిడీలో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని నిరోధిస్తే ప్రభుత్వ ఆదాయం మెరుగవుతుందని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. తాను ఇప్పటివరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తీసుకుందామని అనుకున్నా.. ఏదో ఒక పని వచ్చి పడుతోందన్నారు. ప్రభుత్వంలో ఉన్న 200 మంది మాత్రమే రాష్ట్రాన్ని నడపలేరని, 10.50లక్షల ప్రభుత్వ ఉద్యోగులే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అన్నారు. ఉద్యోగులే ప్రభుత్వ సారథులు, వారధులు. వారి సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం. ఉద్యోగుల్లో కూడా నేను అంటే నచ్చని వారు చాలా మంది ఉండొచ్చు. నేను వొచ్చాక ఉద్యోగుల జీతాలు ఎలా వస్తున్నాయో రే గమనించాలి. ఉద్యోగుల డీఏ దస్త్రాలపై సంతకం చేసి ఇక్కడికి వచ్చాను. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రూ.కోటి బీమా ఇవ్వాలని నిర్ణయించాం. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.12వేల కోట్లు మేర పెండింగ్‌లో ఉన్నాయి. పన్ను వసూళ్లలో అవకతవకలు అరికడితే రావాల్సిన నిధులు వస్తాయి. పన్నులు పెంచాల్సిన అవసరం లేదు. సరిగా వసూళ్లు చేస్తే చాలు‘అని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





