మంచి జీవనశైలికి సైక్లింగ్‌ దోహదం

– సండేస్‌ అండ్‌ సైక్లింగ్‌ను విస్తృతం చేయాలి
– కార్య్ర‌క‌మాన్ని ప్రారంభించిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: పర్యావరణ హితానికి, పచ్చని జీవనశైలికి సైక్లింగ్‌ ఎంతో దోహదం చేస్తుందని, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన సైక్లింగ్‌ను విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవాల్లో భాగంగా గచ్చిబౌలి స్టేడియం వద్ద ఆదివారం జరిగిన ఫిట్‌ ఇండియా- సండేస్‌ ఆన్‌ సైకిల్‌ కార్యక్రమాన్ని గవర్నర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం విస్తృతంగా చేపట్టిన సండేస్‌ ఆన్‌ సైక్లింగ్‌ అనే కార్యక్రమాన్ని జాతీయ ఫిట్‌నెస్‌ ఉద్యమంలా తెలంగాణలో నిర్వహించాలన్నారు. ఫిట్‌నెస్‌కు డోస్‌ -అరగంట రోజ్‌ అన్న నినాదాన్ని విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాల ప్రజల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. క్రీడా కార్యక్రమాల్లో అందరూ పాల్గొనడం వల్ల సామాజిక బంధాలను బలపరుస్తాయని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ పేర్కొన్నారు. క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ జాతీయ క్రీడా దినోత్సవాలను తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహించి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. పసి వయసు వారి నుంచి పండు ముసలి వరకు రాష్ట్ర క్రీడా శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం హర్షణీయమన్నారు. స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేన రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రోత్సాహంతో తమ సంస్థ నిర్వహించే కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలందుతున్నాయని చెప్పారు. సైక్లింగ్‌ క్రీడను మరింతగా ప్రోత్సహించే కార్యక్రమాలు విస్తృత స్థాయిలో చేపడతామన్నారు.

స్పోర్ట్స్‌ పల్స్‌ ప్రారంభం

తెలంగాణ క్రీడాకారులు సాధించిన విజయాలను, స్పోర్ట్స్‌ అథారిటీ కార్యక్రమాలను సంక్షిప్తంగా సమాజానికి తెలియ‌జేసే నెలవారీ సంచిక స్పోర్ట్స్‌ పల్స్‌ (క్రీడా నాడి) బులెటిన్‌ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆవిష్కరించారు. భావి క్రీడాకారులకు స్ఫూర్తి కలిగించే విధంగా దీన్ని రూపొందించారు.

అనూహ్య స్పందన

ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైక్లింగ్‌ కార్యక్రమానికి సైకిలిస్టుల నుండి మంచి స్పందన లభించింది. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ జెండా ఊపి ప్రారంభించిన సైకిల్‌ ర్యాలీ గచ్చిబౌలి స్టేడియం మెయిన్‌ గేటు నుండి ప్రారంభమై త్రిబుల్‌ ఐటీ జంక్షన్‌, గచ్చిబౌలి ఫ్లైఓవర్‌, పిస్తా హౌస్‌, ఐక్య షోరూం, ఇనార్బిట్‌, కేబుల్‌ బ్రిడ్జి, మాదాపూర్‌ వైపు, అటు నుంచి భారతీయ విద్యా భవన్‌, టీ-హబ్‌, డల్లాస్‌ సెంటర్‌ రోడ్డు నుండి బయో డైవర్సిటీ రోడ్డు మీదుగా గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంది. ఇందులో పాల్గొన్న దాదాపు వెయ్యిమంది సైక్లిస్టులకు స్పోర్ట్స్‌ అథారిటీ తరఫున సర్టిఫికెట్లు అందజేశారు. సీనియర్‌ సిటిజన్స్‌తోపాటు విద్యార్థులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అథారిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సోనీ బాలాదేవి, తెలంగాణ ఒలంపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మల్లారెడ్డి ,ఐజీ (క్రీడలు) రమేష్‌, డిసిపి వినీత్‌, గచ్చిబౌలి స్టేడియం అడ్మినిస్ట్రేటర్‌ కన్నం మధు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, సైక్లిస్ట్‌ సంఘాల ప్రతినిధులు, స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *