– కేంద్ర పథకం పేరు చెప్పి రూ.లక్ష లూటీ
– పోలీసులను ఆశ్రయించిన జనగామ ఎమ్మెల్యే
జనగామ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 : సైబర్ నేరగాళ్ల చేతిలో సాధారణ ప్రజల నుంచి ఉన్నతమైనహోదాల్లో ఉన్నవారి వరకు ఎందరో మోసపోగా తాజాగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆ జాబితాలో చేరారు. ఈనెల 5న హైదరాబాద్‌లో ఉన్న రాజేశ్వరెడ్డికి ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి తాను ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ అనంతరామిరెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ పథకం కింద నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చే అవకాశం ఉందని, నియోజకవర్గంలో 40 మంది అర్హులైన లబ్దిదారుల జాబితాను పంపాలని, దరఖాస్తుకు ఈరోజే చివరి రోజని ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచాడు. ఒక్కో దానికి ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.2,500ల చొప్ప్పున మొత్తం 40 మందికి రూ.లక్ష తక్షణమే ఫోన్ పే చేయాలని కోరాడు. ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గంట వ్యవధిలోనే ఆ సొమ్మును నిందితుడు చెప్పిన నంబర్‌కు బదిలీ చేశారు. డబ్బులు పంపిన తర్వాత అటునుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చి ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీకి ఫోన్ చేసి డబ్బులు వచ్చాయా అని అడిగారు. డబ్బులు రాలేదనే సమాధానంతోపాటు అసలు తాను ఫోన్ చేయలేదని ఆయన తెలిపారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన ఎమ్మెల్యే పల్లా జూబ్లీహిల్స్ పీఎస్ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఉన్నతాధికారుల పేర్లతో ఫోన్ కాల్స్ వచ్చినప్ప్పుడు వెంటనే నగదు బదిలీ చేయకుండా సంబంధిత శాఖల ద్వారా నిర్ధారించుకోవాలని పోలీసులు సూచించారు. ఏ ప్రభుత్వ పథకానికీ వ్యక్తిగత ఫోన్ పే నంబర్లకు డబ్బులు పంపాలని అధికారులు కోరరని తెలిపారు. చెల్లింపులు ఎప్ప్పుడూ అధికారిక పోర్టల్స్ లేదా చలాన్ల ద్వారానే జరుగుతాయని తెలిపారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



