– ఆదివాసీల రేల పాట, డోలు, డప్పు ఐకమత్యానికి నిదర్శనం
– ‘కోయ ఇలవేల్పుల చరిత్ర’ ఆవిష్కరఱలో మంత్రి సీతక్క
భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, ఆహారపు అలవాట్లు మర్చిపోకుండా రాబోయే తరానికి అందిస్తూ మన సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకుంటే దేశానికి మూలం ఆదివాసులం అనే నినాదానికి సార్ధకత ఏర్పడుతుందని పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆదివాసీ సాంస్కృతిక ఆత్మీయ సమ్మేళనం, కోయ ఇలవేల్పుల చరిత్ర పుస్తకం ఆవిష్కరణకు వచ్చిన ఆమెకు గిరిజన సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మహనీయుల చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి మూలవాసులు ఆదివాసులమని, రేల పాట, డోలు సౌండ్ ఆదివాసుల ఐకమత్యానికి నిదర్శనం అని అన్నారు. కొండకోనల్లో నివసించే వీరి ఆచార వ్యవహారాలు, కుల దేవతలపై విశ్వాసాలు తెగ చరిత్ర సామాజిక వ్యవస్థ నైతిక విలువలను ప్రతిబింబిస్తాయని అన్నారు. రేపటి తరానికి తెలిసే విధంగా కోయ తెగలో వివిధ పూజా విధానాలు కుల దేవతల ఆవిర్భావ కథలు, ఇలవేల్పుల పండుగలు జరుపుకునే విధి విధానాలను, మారుతున్న జీవనశైలిలో కనుమరుగవుతున్న ఆచారాలను తలపతులు, ఆర్తిబిడ్డలు నెల రోజులపాటు శ్రమించి ఇలవేల్పుల చరిత్ర లిఖించడం గర్వకారణమని అన్నారు. అందుకు సహకరించిన ఐటీడీఏ పీవో రాహుల్‌ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఆదివాసీ¾ గిరిజన గ్రామాలలోని ఉద్యోగులు మనసుపెట్టి పనిచేసి ఆదివాసులకు, గిరిజన విద్యార్థినీవిద్యార్థులకు విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పిస్తే వారు మిమ్మల్ని దేవుళ్ళుగా భావిస్తారన్నారు. ఆదివాసుల సంక్షేమానికి ముఖ్యంగా విద్య, వైద్యం కోసం తమ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నదని, విద్యార్థులు కష్టపడి చదివి ప్రయోజకులు కావాలని ఉద్బోధించారు. ఆదివాసీ¾ గిరిజనులు ప్రతి ఇలవేల్పుకు తమ గ్రామంలో గుడులు కట్టించి దేవతలను ప్రతిష్ఠించుకొని పూజలు చేసుకోవాలని సూచించారు. అందుకు కావలసిన నిధులు ప్రభుత్వానికి నివేదించి అందిస్తామని, అలాగే కొండ రెడ్ల గిరిజనుల సంక్షేమానికి పాటుపడతానని హామీ ఇచ్చారు. గత పర్యటనల్లో భద్రాచలం వచ్చినప్పుడు ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియం సందర్శించానని, పర్యాటక శాఖ దినోత్సవం రోజున అనుకోకుండా హైదరాబాదులో ఒక సమావేశంలో మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ న్యూదిల్లీ వారు కలిసినప్పుడు మ్యూజియం గురించి వివరాలు తెలియజేయగానే రూ.కోటి మంజూరు చేశారని తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మాట్లాడుతూ గోదావరి నది పరివాహక ప్రాంతాలు, కొండ కోనల్లో నివసించే గిరిజనులకు సంస్కృతి సాంప్రదాయాలు ప్రత్యేకమైనవని, మనం పూజించే దేవతలు, పెళ్లిళ్లు, కట్టుబాట్లు పాత తరం గిరిజనులు ఆచరించేవారని, కాలక్రమేణా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. నేటితరం గిరిజన యువత పాత తరం సంస్కృతి సాంప్రదాయాలు ఆచరించే విధంగా ఐటీడీఏ పీవో బి.రాహుల్ గిరిజన మ్యూజియం ఏర్పాటు చేసి కోయ భాష, సంస్కృతి సంప్రదాయాలు ప్రతి ఒక్కరూ ఆచరించేలా పాటుపడుతున్నారని తెలిపారు. అలాగే కోయ తెగకు సంబంధించిన ఇలవేల్పుల గోత్రాలు, వారు పూజించే దేవతల పూర్తి వివరాలు సేకరించి ఇలవేల్పుల చరిత్ర గ్రంథాన్ని రూపొందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఉద్దీపకం వర్క్ బుక్
ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ ఐటీడీఏ పీవోగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి గిరిజన విద్యపై ప్రత్యేక దృష్టి సారించానని, జేపీఎస్ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికల విద్యాభ్యాసం పునాది నుండి పటిష్టపరచడానికి ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించడంతో గిరిజన బాలబాలికల విద్యాభ్యాసం చాలావరకు మెరుగుపడిందని, అలాగే పదవ తరగతి పిల్లలకు పదో తరగతి అయిన తర్వాత ఏదో ఒక రంగంలో స్థిరపడి జీవనోపాధి పొందడానికి ప్రతి ఆశ్రమ పాఠశాలలో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడంతో ఫలితాలు సానుకూలంగా వచ్చాయని, గిరిజన విద్యను బలోపేతం చేయడంతో విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలలో 30మంది ఐఐటికి ఎంపికయ్యారని, వారికి లాప్‌టాప్‌లు అందించామని, అలాగే పై చదువులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న ఎస్‌హెచ్‌జి గ్రూప్ మహిళలు, ఎంఎసఎంఈ గ్రూప్ మహిళలు ఆర్గానిక్ పంటలు పండిస్తున్న గిరిజన రైతుల వ్యవసాయ ఉత్పత్తులు జిసిసి ఉత్పత్తులు దళారులపాలు కాకుండా వారికి ఆర్థికంగా చేయూత అందించడానికి భద్రగిరి మార్టును ఏర్పాటు చేయడంతో పది రోజులలోనే దాదాపు పది లక్షల మంది వినియోగదారులు వివిధ నిత్యవసర సరకులు కొనుగోలు చేశారని ఆయన వివరించారు. ఆదివాసి తెగల ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు, వారు పూజించే దేవతల చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి తలపతులు ఆర్తి బిడ్డలను బృందాలుగా ఏర్పాటు చేసి ఆంధ్ర తెలంగాణ గోదావరి తీర ప్రాంతాల్లో సుమారు 142 ఇలవేల్పులు వెలిసిన ప్రదేశాలను సందర్శించి ఆదివాసీ పెద్దలను, పూజారులను కలిసి ఏడు గట్టు గోత్రాలు 750 ఇంటి పేర్లతో ఉన్న ఇలవేల్పుల చరిత్రను సేకరించామని, ఈ సమాచారాన్ని పుస్తక రూపంలో రూపొందించామని చెప్పారు. ఆదివాసి జీవన విధానాలు, కట్టుబాట్లు, వారి ఇలవేల్పుల గోత్రనామాలు, గిరిజన యువత జీవన విధానాలు, పాటించవలసిన విధివిధానాల గురించి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, ఎస్పీ రోహిత్ రాజ్ తదితరులు ” వివరించారు. ఇలవేల్పుల చరిత్ర సేకరణకు ప్రత్యేక శ్రద్ధ చూపిన ఐటీడీఏ పీవోకు మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, అధికారులు గిరిజన పెద్దల సమక్షంలో ఆదివాసీ వికాసరత్న బిరుదు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, ఏఎస్‌పి విక్రాంత్ కుమార్ సింగ్, సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అశోక్, ఏసీఎంవో రమేష్, సర్పంచ్ పూణేం కృష్ణ, రిటైర్డ్ ఏసిఎంఓ రమణయ్య, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసి పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





