– భారీ వర్షం నేపథ్యంలో సీఎస్ టెలీకాన్ఫరెన్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7: జీహెచ్ ఎంసీ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి పరిస్థితిని సమీక్షిస్తూ సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ సాయంత్రం నుండి ఆకస్మికంగా భారీ వర్షం కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండి ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాలలో 12 సెం.మి వరకు వర్ష పాతం నమోదైందని తెలియజేశారు. వర్షం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, నీరు నిలిచే ప్రాంతాల (వాటర్ లాగింగ్ పాయింట్స్)పై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు. ముఖ్యంగా వాటర్ లాగింగ్ రిపోర్ట్ అవుతున్న ఐటీ కారిడార్, టివీ-9, టైమ్స్ ఆఫ్ ఇండియా, రాజ్ భవన్, షేక్ పేట్ ఏరియాలలో నీటి నిల్వ సమస్య వస్తున్నందున తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా జీహెచ్‌ఎంసీ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు డ్రైనేజీ, నాలాలు మూతలు ఎట్టి పరిస్థితుల్లో తొలగించవద్దని విజ్ఞప్తి చేశారు. వర్షం పడే సమయంలో విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని సూచించారు. హైడ్రాతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అందరు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది వేగంగా స్పందిస్తున్నారని, తామంతా అప్రమత్తంగా ఉన్నామని అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు. 250 టీంలు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నట్లు తెలియజేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ టీంలు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. జీహెచ్‌ఎంసీ, కలెక్టర్ కార్యాలయాలలో కంట్రోల్ రూమ్స్ పనిచేస్తున్నాయని తెలిపారు. దాదాపు 250 విద్యుత్‌కు సంబంధించిన సమస్యలు వచ్చాయని, అందులో 149 సమస్యలను వెంటనే పరిష్కరించామని, మిగతా ఫిర్యాదులు ఇంకో 30 నిమిషాలలో పూర్తవుతాయని అధికారులు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ యంత్రాంగం సూచనలను పాటించి సహకరించాలని సీఎస్ కోరారు. టెలీకాన్ఫరెన్స్‌లో విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాధ్, జల మండలి ఎండి అశోక్ రెడ్డి, విద్యుత్ విభాగం సి.ఎం.డి ముష్రాఫ్ అలీ, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ ప్రియాంక మూడు పోలీస్ కమిషనరేట్ల కపతీషనర్లు, హైదరాబాద్, రంగా రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలు
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ 11,
హైదరాబాద్ సెంట్రల్ 3, హైదరాబాద్ సౌత్ 1, సికింద్రాబాద్ 12, సైబర్ సిటీ 5, రాజేంద్రనగర్ 2,
సరూర్‌నగర్ 1, హబ్సిగూడ 1, మేడ్చల్ 7 చొప్పున మొత్తం 43 ఫీడర్ల (11 కేవీ) పరిధిలో సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. హబ్సిగూడ-మేడ్చల్ సర్కిల్ పరిధిలో మౌలాలి, ఏఎస్ రావు నగర్, ఏఎస్ రాజు నగర్ ,బాబు రెడ్డి నగర్ వంటి ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు తీగలపై పడ్డాయి. అప్రమత్తంగా ఉన్న సిబ్బంది వెంటనే వాటిని తొలగించి సరఫరా పునరుద్ధరించారు.
జోనల్, సర్కిళ్ల చీఫ్ ఇంజనీర్, సూపరింటెండిరగ్ ఇంజనీర్లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో సరఫరా పరిస్థితిని సమీక్షించారు.ప్రతి అధికారి, సిబ్బంది ఫీల్డ్‌లోనే ఉండాలని, ఎక్కువగా సరఫరా సమస్యలు ఏర్పడిన సర్కిళ్ళ ఎస్‌ఈలు అప్రమత్తంగా ఉండాలని, మొత్తం ఫీడర్లు పునరుద్ధరించే వరకు విధుల్లోనే ఉండాలని టీజీఎస్‌పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు.





