– పెండింగ్ కేసులు తగ్గేందుకు కార్యాచరణ రూపొందించాలి
– సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7: అడ్వ్సాడ్ టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులను తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ కోర్టులలో కేసుల పెండిరగ్ తగ్గించడంతోపాటు డిజిటల్ రికార్డుల నిర్వహణ, సీసీిఎంఎస్ ద్వారా కోర్టు కేసుల పురోగతిని నిరంతరం మానిటరింగ్ చేయాలన్నారు. అలాగే సమాచార వ్యవస్థలో పారదర్శకతను పాటించడం, కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకోవడంతో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఆస్కారముంటుందని తెలిపారు. సుప్రీంకోర్టుతోపాటు బీహార్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలో అమలలులో ఉన్న మానిటరింగ్ వ్యవస్థను అధ్యయనం చేసి రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు తగు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు వివిధ కోర్టుల్లో పెండిరగ్ కేసులను తగ్గించడంతోపాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సుపరిపాలనలో పారదర్శకతను పెంపొందించేందుకు కృషిచేయాలని సూచించారు. రైజింగ్ తెలంగాణ-2047 లక్ష్య సాధనకు ఈ సాంకేతిక వ్యవస్థ ఉపకరిస్తుందన్నారు. ముఖ్యంగా న్యాయ, రెవెన్యూ, హోం శాఖల అధికారులు ఎన్‌ఐసీతో సంప్రదించి ఆమేరకు కార్యాచరణను వారం రోజుల్లోగా రూపొందించి నివేదికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యకార్యదర్శి శేషాద్రి, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, జీఎడి కార్యదర్శి బి.ఎం.డి.ఎక్కా, సీసీఎల్‌ఎ కార్యదర్శి మకరంద, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.





