– అధికారులకు సీఎస్ రామకృష్ణారావు దిశానిర్దేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 30: గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్రదిన వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సీనియర్ అధికారులతో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించనున్నారని, అనంతరం చరిత్రాత్మక గోల్కొండ కోటలో జరిగే వేడుకల్లో పాల్గొంటారని, అందుకు అవసరమైన ఏర్పాట్లపై అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని, కార్యక్రమానికి ప్రముఖులు హాజరవుతున్నందున తగిన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పండుగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా శాసనసభ, హైకోర్టు, రాజ్ భవన్, సచివాలయం, తెలంగాణ తల్లి విగ్రహాలు వంటి ప్రముఖ ప్రభుత్వ భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. గోల్కొండ కోటలో జరిగే వేడుకల్లో భాగంగా రాష్ట్ర వారసత్వం, దేశభక్తిని ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సాంస్కృతిక శాఖను ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను దృష్టి పెట్టుకొని అందుకు అవసరమైన అగ్నిమాపక సిబ్బంది, అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. వేడుకలకు విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, వేడుకల గౌరవం, వైభవాన్ని కాపాడటానికి ప్రతీ శాఖ సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో డీజీపీ జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సమాచారశాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.





