పారద‌ర్శ‌కంగా పంట కొనుగోళ్లు

– వ‌డ్ల కొనుగోలు వెంట‌నే ట్యాబ్ ఎంట్రీ, ర‌సీదు త‌ప్ప‌నిస‌రి
– పేద మ‌హిళ‌ల‌కు ఇందిర‌మ్మ చీరెలు
– ధాన్యం నుంచి త‌రుగు తీసుకోవ‌ద్దు
-మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

వనపర్తి, ప్రజాతంత్ర, నవంబర్ 20: రైతు పంట కొనుగోళ్లు  పారదర్శకంగా జరగాలనిరాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  జిల్లా ఐడీఓసీ సమావేశ మందిరంలో గురువారం వరి కొనుగోలు వ్యవస్థపై రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష‌ సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన పంటను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేసి, వారికి తక్షణమే డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు.  రైతులు కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చిన వెంటనే తూకం చేసి, తేమ శాతం 17% లోపు ఉంటే వెంటనే కొనుగోలు చేసి రసీదు ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. అయితే కేంద్రాల్లో ఆలస్యాలు, మిల్లుల వద్ద తిరుగుడులు అధికమవుతున్నట్లు తెలుస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు నుండి వడ్లు కొన్న వెంటనే ట్యాబ్ ఎంట్రీ తప్పనిసరి, ఎంట్రీ చేయక ముందే లారీ ఎక్కించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో దాదాపు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను తరలించడానికి 350 లారీలు అవసరమవుతాయని, కానీ ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో వాహనాలు అందించకపోవడం వల్ల మిల్లుల వద్ద వడ్లు దించడంలో ఆలస్యం అవుతోందని మంత్రి పేర్కొన్నారు. కొన్ని మిల్లులు సంచిపై 2% అదనంగా, తేమపై మరొక 2% అదనంగా తూకం తీసుకోవడం అసహ్యకరమని, ధాన్యం నుండి ఒక్క కిలో కూడా తరుగు తీసుకోలేరని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రతి కేంద్రానికి ఒక ప్రభుత్వ అధికారిని నియమించాలని, సమస్యలు వస్తే వెంటనే స్పందించేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. 2020–21 సీజన్ నుండి వనపర్తి జిల్లాలోని మిల్లర్లు సుమారు రూ.400 కోట్లు విలువైన ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందని మంత్రి గుర్తుచేశారు. పెండింగ్ ధాన్యం వెంటనే అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశించారు. అప్పగించని మిల్లులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేయాలని సూచించారు. మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల వద్ద తేమ కొలిచే యంత్రాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో, అవసరమైతే ఒకే రకం యంత్రాలు కొనుగోలు చేసి కేంద్రాలకు, మిల్లులకు అందజేసి వారి నుండి ఖర్చులు వసూలు చేయాలని మంత్రి కలెక్టర్‌కు సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఈ వానాకాలంలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి కాగా, అందులో 3.50 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశముందని తెలిపారు. 396 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 330 ప్రారంభించా మని చెప్పారు. ఇప్పటి వరకు 33 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయగా, వాటిలో 18 వేల మెట్రిక్ టన్నులకు ట్యాబ్ ఎంట్రీ పూర్తయినట్లు వివరించారు. జిల్లాలోని 173 రైస్ మిల్లుల్లో ఈ సీజన్‌కు 81 మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించగా, 39 మిల్లులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 10% బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి అయినప్పటికీ ఇప్పటివరకు 46 మిల్లులు మాత్రమే సమర్పించాయని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో మిల్లర్లు 100% బ్యాంకు గ్యారంటీ ఇస్తుంటే, వనపర్తిలో 10% గ్యారంటీ ఇవ్వడానికే ఎందుకు ఇబ్బంది అని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మండిపడ్డారు. కొనుగోలు చేసిన దొడ్డు వడ్లు వారం రోజులు మిల్లులకు తరలించకపోవడంతో రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నందున వెంటనే తరలింపు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రజా ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన ప్రతి పేద మహిళకు ఉచితంగా ఒక ఇందిరమ్మ చీర అందించనుందని మంత్రి జూపల్లి తెలిపారు. మండలాల వారీగా షెడ్యూల్ రూపొందించి, ప్రజా ప్రతినిధులను భాగస్వాములుగా తీసుకుని పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో  స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్‌.ఖీమ్య నాయక్, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ బి. శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదిని, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, జిల్లా అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ఎపీఎంలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page