– జూరాల నుంచి నీళ్లు ఎత్తిపోయడం అసాధ్యం
– కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జనవరి 6: జూరాల నుంచి పాలమూరు లిప్ట్ పెడితే ఒక్క చుక్క నీరు కూడా రాదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎన్ని రోజులు పంపింగ్ చేసినా లాభం ఉండదని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాను ఎడారిగా మార్చే ఆలోచనలు చేస్తున్నారని అన్నారు. దీనిపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడలేదని ప్రశ్నించారు. యాసంగిలో జూరాల ప్రాజెక్టు కింద ఆయకట్టుకు క్రాప్ హాలీ డే ఇచ్చారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గుర్తుచేశారు. క్రాప్ హాలీడే ఇచ్చిన ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోస్తారా అని ప్రశ్నించారు. జూరాల నుంచి నీళ్లు ఎత్తిపోయడం అసాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు మళ్లీ తొండి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు అజ్ఞానంతో మాట్లాడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బూత్‌పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎలా ఎత్తిపోస్తారని ప్రశ్నించారు. పాలమూరులో పడావు పడ్డ ప్రాజెక్టులపై గులాబీ పార్టీ సమరభేరి మోగించింది. ఈ క్రమంలో జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు నింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లతో కూడిన బీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం సందర్శించింది. నార్లపూర్ పంప్‌హౌజ్, రిజర్వాయర్, వ్టటెం పంప్‌హౌజ్, కరివెన రిజర్వాయర్లను సందర్శించారు. ప్రాజెక్టులను పడావు పెట్టిన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అట్టర్ ప్లాప్ అవుతుందని విమర్శించారు. కొడంగల్ లిప్ట్‌తో ప్రజాధనం కచ్చితంగా వృథా అవుతుందని అన్నారు. కేసీఆర్ గొప్పగా ప్రాజెక్టు డిజైన్ చేస్తే.. దాన్ని పడావు పెట్టారని మండిపడ్డారు. కాల్వలకు టెండర్లు పిలిచి పూర్తి చేస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు నీళ్లు వస్తాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహన లేకుంటే నిపుణులతో మాట్లాడి తెలుసుకోవాలని సూచించారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కషన్లు దండుకున్న ఘనత కాంగ్రెస్ పాలకులదే అని లక్ష్మారెడ్డి విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆరు నెలల్లోనే పాలమూరు ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడుతున్నారని లక్ష్మారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు చెప్పి రాయలసీమ ప్రాజెక్టును ఆపించానని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అంటే.. ఆ వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించిందని తెలిపారు.
పాలమూరు మళ్లీ దివాలా తీసేలా కుట్రలు : శ్రీనివాస గౌడ్ ఆగ్రహం
ఉమ్మడి ఏపీలో అత్యంత దారుణంగా నష్టపోయిన జిల్లా పాలమూరు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాను మంత్రులు ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప రైతులను ఆదుకోలేదని విమర్శించారు. ప్రాజెక్టులను పడావు పెట్టిన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో రెండు ట్రిబ్యునల్‌లు ఏర్పాటైనా పాలమూరును పట్టించుకోలేదన్నారు. జూరాల ప్రాజెక్టు మొత్తం ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి పంటలకు జూరాల ఆయకట్టుకు క్రాప్ హాడే ఇచ్చారని తెలిపారు. జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారా అని ప్రశ్నించారు. ఇదేం ప్రభుత్వం? అసలు నీళ్ల సోయి ఉందా అని నిలదీశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేసుకున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తట్టెడు మన్ను తీయకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాలమూరు మళ్లీ దివాలా తీసేలా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పాలమూరును సస్యశ్యామలం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. రాజకీయ కోణంలో చూడకుండా పాలమూరును బాగు చేయాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ 45 టీఎంసీలకు ఒప్పుకోమని తెలిపారు. తమ పాలమూరు జిల్లాకు కేటాయించిన నీళ్లు తమకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.