- హుందాతనం కోల్పోతున్న నేతలు
- హద్దులు దాటుతున్న విమర్శలు, ప్రతి విమర్శలు..
అధికారం కోసం నానాగడ్డి తినేందుకు నేతలు వెనకాడడంలేదు. రాజకీయమంటే అర్థం మారిపోయింది. కేవలం విమర్శలే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారు. పరస్పర విమర్శల్లో పడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అటు అధికార పార్టీ..ఇటు విపక్ష పార్టీలు పక్కన పెడుతున్నాయి. ఎంత తీవ్రంగా తిట్టి పోసుకుంటే అంత గట్టిగా రాజకీయాలు చేస్తున్నామని భావిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్నాయి. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా అవి హద్దులు దాటడమే వికృత పరిణామానికి పరాకాష్టగా చూడాలి. భాషను ఎలా వాడుకోవాలో తెలియడం లేదు. ఎత్తులు పై ఎత్తులు వేయడం అవసరమే కానీ అలవికాని భాషలో విమర్శలతో దాడులు చేయడం అవసరమా అన్నది ఆలోచన చేయాలి. ఎదుటి వారి ఆస్తులపైనా, కుటుంబంపైనా దాడులు చేసే స్థితికి నేతలు రావడం సరికాదు. ఎదుటివారు ఎంతగా రెచ్చగొట్టేలా చేసినా..అంతకు పదింతలుగా అలాంటి పంథానే ఎన్నుకోవాలి. కానీ దాడులతో కట్టడి చేయాలనుకుంటే సరికాదు. నేతలు హుందాతనం కోల్పోతున్నారు.
విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినా అవి కూడా హద్దులు దాటుతున్నాయి. వాడరాని భాష వాడుతున్నారు. రాయరాని భాషలో మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో గతంలో దాడులు, ప్రతిదాడులు ఎప్పుడూ ఉండేవి కావు. అడపాదడపా క్షేత్రస్థాయిలో స్వల్ప ఘటనలు మాత్రమే చోటు చేసుకునేవి. కానీ ఇప్పుడా పరిస్థితి కానరావడం లేదు. అధికార పార్టీ, విపక్ష పార్టీ అన్న తేడా లేకుండా దాడులకు, ప్రతిదాడులకు తెగబడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. విమర్శలకూ ఓ హద్దు ఉండాలన్న ఇంగితాన్ని మరచి నేతలు ప్రవర్తిస్తున్నారు. తాజాగా మూసీ సుందరీకరణ, లగచర్ల, ఎపిలో రాజధాని, పోలవరం, విశాఖలో జగన్ అక్రమంగా నిర్మాణాలు వంటి విషయాల్లో నడిచిన డ్కెలాగ్ వార్ కాస్తా దాడులకు దారితీస్తోంది. ఇది ముమ్మాటికీ అవాంఛనీయం. ఇలాంటి ఘటనలు జరగరాదు. అలాంటి పరిస్థితులకు రాజకీయ నాయకులు కారణం కారాదు. తెలంగాణలో ఏక్‌నాథ్ షిండే మాడల్ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీపై విమర్శలు వస్తున్నాయి. బిఆర్‌ఎస్ రేవంత్ లక్ష్యంగా ఆయన పదవి ఊడిపోతుందని అంటున్నారు. లగచర్ల విషయంలో సామాన్యులకు నస్టం జరిగితే అడ్డుకోవాల్సిందే. విమర్శలను ప్రజలు ఆలోచించే విధంగా చేయాలి. నిజాలు ఉంటేనే మాట్లాడాలి. ఎలాంటి సంస్కార హీనత సరికాదు.
ఎపిలోనూ ఇటీవల వైసిపి నేతల తీరు దారుణంగా ఉంది. ఐదేళ్లపాటు దాడులకు తెబడ్డారు. అక్రమంగా కేసులు బనాయించారు. నాయకులు యాత్రలు చేస్తుంటే అడ్డుకున్నారు. ఎక్కడ కాలు బయటపెట్టినా పోలీసులు నో చెప్పారు. సభలూ సమావేశాలు నిర్వహించుకోకుండా చేసారు. కేసులు పెట్టి వేధించారు. విపక్షాలను అడ్డుకోవడం కోసం అనేక దుర్మార్గాల కు పాల్పడ్డారు. ఇప్పుడు ఎపిలో శాంతిభద్రతలు లేవంటూ గగ్గోలు పెడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని అంటున్నారు. ఇంతకన్నా దారుణం ఉండదు. ఐదేళ్ల పాటు సిఎంగా చేసిన జగన్ నిబంధనలు తెలయకుండా, తన వైఫల్యాలను గుర్తించకుండా వ్యవహరిస్తున్నారు. గతంలో మల్లన్న సాగర్ విషయంలో నిరంకుశంగా వ్యవహరించి, రైతులపై కేసులు పెట్టిన బిఆర్‌ఎస్ ఇప్పుడు లగచర్ల విషయంలో నానాగడ్డీ కరుస్తోంది. ఫార్మాసిటీ పేరుతో బలవంతంగా భూములు లాక్కున్న కెటిఆర్ ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారు. అయితే ఎప్పుడ్కెనా, ఎక్కడ్కెనా భూసేకరణ మాత్రం బలవంతంగా సాగరాదు. సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా అడ్డుకోవాల్సిందే. సమస్యలను పెద్దవి చేసిచూపుతూ ..మొత్తంగా రాజకీయాల్లో హింసను జొప్పిస్తున్నారు. ఎవరిది పైచేయి అనేకన్నా అనేక సందర్భాల్లో అధికార పార్టీకి పోలీసులు వత్తాసుగా మారారు. దాడులకు తెగబడుతున్నా చూసీచూడనట్లుగా మిన్నికుంటున్నారు. మొత్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు శృతి తప్పుతున్నాయి.
హద్దులు విరీరుతున్నాయి. దాడులకు నేతలు తెగబడుతున్నారు. ఇది ఫ్యాక్షన్ తరహా రాజకీయం తప్ప మరోటి కాదు. వాంఛనీయం అస్సలు కాదు. ఇలాంటి వాటికి స్వస్తి చెప్పాలి. లేకుంటే ప్రజలు అయినా ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇక లగచర్ల విషయంలో ప్రభుత్వం పునరా లోచన చేయాలి. బలవంతపు భూసేకరణమాత్రం సరికాదు. తెలంగాణలో అనాగరిక రాజ్యం నడుస్తున్నదని, నియంతృత్వ పాలన కొనసాగుతున్నదని, ఏ హోదా లేని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి డిఫాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నట్లు బిఆర్‌ఎస్ ఆరోపిస్తున్నది. తెలంగాణలో అరాచక పాలనపై ప్రధాని మోదీ సహా రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు మొత్తంగా బీజేపీ ఎందుకు స్పందించటం లేదని కేటీఆర్ నిలదీస్తున్నారు. గతంలో బిఆర్‌ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి డిమాండ్‌లే వచ్చాయి. మరి ఆనాటి పాలనపైనా విచారణకు ఆదేశిస్తే మంచిదే. అమాయక పేదల పక్షాన బీజేపీ,బిఆర్‌ఎస్ నేతలు ఎందుకు సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్నాన్నే ముఖ్యం. గిరిజనులపై పోలీసులే ల్కెంగిక వేధింపులకు పాల్పడ్డారని బిఆర్‌ఎస్ చేస్తున్న విమర్శల్లో నిజాలను వెలికి తీయాలి.
ఇప్పటికైనా కేంద్రానికి మనసుంటే ఈ ఘటనపై వెంటనే విచారణ చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి సర్కార్ చేసిన అఘాయిత్యాలపై బాధితులు మానవ హకుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్‌ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కమిషన్ల ద్వారా న్యాయం జరుగుతుందని బాధితులకు, తమకు విశ్వాసం ఉన్నదని కేటీఆర్ చెప్పారు. దాష్టీకానికి పాల్పడిన పోలీసులకు నోటీసులు ఇస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు. ’లగచర్ల ఘటనను దేశ ప్రజాస్వామ్యం దృష్టికి తెస్తం.. రాజ్యసభలో మా ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో వివరించి తెలంగాణలో రేవంత్ బండారాన్ని ఎండగడుతం అని స్పష్టంచేశారు. అయితే సమస్యలను దృష్టికి తెచ్చే క్రమంలో ఎలాంటి అలజడులు, పరస్పర నిందా రోపణలు సరికాదు. రాజకీయాల్లో మంచి వాతావరణం కోసం అందరూ కృషి చేయాలి.
-కె.ఆర్.ఆర్





