– రైతు సమస్యల కంటే బురద రాజకీయాలకు ప్రాధాన్యం
– ఈ ప్రభుత్వానికి కర్షకుల కష్టాలపై చర్చించే సామర్థ్యం లేదు
– జై కిసాన్ అన్న నాటి కాంగ్రెస్.. నై కిసాన్ అంటున్న రేవంతు
– మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10: యూరియా కొరత, వరదల మీద అసెంబ్లీలో చర్చ జరపాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తే వాటికంటే బురద రాజకీయాలే తమకు ముఖ్యమని సీఎం రేవంత్ అన్నడు.. ప్రజా సమస్యలను గాలికొదిలి కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా ఆదరాబాదరా ఆదివారం సభను నిర్వహించి అర్థంతరంగా, అసంపూర్తిగా ముగించారు అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చర్చించే సమయం, సామర్థ్యం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తెలంగాణ రైతాంగానికి పెనుశాపంగా మారిందని విమర్శించారు. పంట పొలాల్లో ఉండాల్సిన వారు యూరియా కోసం రోడ్ల వెంట బారులు తీరుతున్నారని, రైతుల ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతున్నదని అన్నారు. యూరియా సంక్షోభానికి నిన్న సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహమే నిదర్శనమన్నారు. ఇది రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల రైతన్నకు వచ్చిన సంక్షోభం అని హరీష్‌రావు విమర్శించారు. యూరియా అడిగిన రైతుల చెంపలు చెల్లుమనిపించిన సోకాల్డ్ ప్రజా పాలన ఇది అని అన్నారు. కేసీఆర్ పాలనలో సకాలంలో సరఫరా అయిన యూరియాను ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారని నిలదీశారు. రైతుల కష్టాలు తీర్చని ప్రభుత్వం ఉండి ఏం లాభం అని ఆయన ఆగ్రహం వెళ్లగక్కారు. కేంద్రం నుంచి యూరియా తెప్పించడంలో, సరఫరాలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకపోవడం శోచనీయమని, రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండడం దారుణమని అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ పేరుతో పచ్చి మోసం చేశారు.. దేశానికి అన్నం పెట్టే రైతన్నను కన్నీళ్లు పెట్టిస్తున్నరు.. అరిగోస పెడుతున్నరు అని ఆవేదన వ్యక్తం చేశారు. జై కిసాన్ అని నాటి కాంగ్రెస్ అంటే నై కిసాన్ అని నేటి రేవంతు అంటున్నడు అని ఎద్దేవా చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఇంతమంది ఉండి ఏం లాభం?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి నెపం నెట్టుకోవడం తప్ప చేస్తున్నదేం లేదని, బీజేపీ, కాంగ్రెస్‌ల నిర్లక్ష్య వైఖరి రైతాంగానికి మరణశాసనంగా మారిందని హరీష్‌రావు అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 10శాతం తగ్గించడంతో ఆయిల్‌పాం రైతులు ఆందోళన చెందుతున్నారని, తాజాగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లయిందని అన్నారు. ఇన్ని సమస్యలు రైతులను చుట్టుముడుతున్నా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు ఉలుకు లేదు.. పలుకు లేదు.. ఎనిమిదిమంది బీజేపీ ఎంపీలు, ఎనిమిదిమంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి తెలంగాణకు చేస్తున్నది ఏమున్నదని ఆయన నిలదీశారు. పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపును ఉపసంహరించుకోవాలని, పత్తిపై ఎత్తివేసిన దిగుమతి సుంకాన్ని యదావిధిగా కొనసాగించాలని ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ మానుకుని రైతాంగానికి యూరియా సరఫరా చేయడంపై రేవంత్ దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్ పక్షాన హరీష్‌రావు డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





