అవినీతికి పాల్పడితే 24 గంటల్లో క్రిమినల్‌ కేసు

-ౖఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవినీతిని సహించం
– ఇండ్లు ఇవ్వకుండానే చెల్లింపు చేసిన నలుగురు అధికారుల సస్పెన్షన్‌
– రూ.10 వేలు డిమాండ్‌ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడి తొలగింపు
– రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖ మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, చెల్లింపుల విషయంలో అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల సమస్యలు, సందేహాల కోసం గత వారం హౌసింగ్‌ కార్పొరేషన్‌లో ప్రారంభించిన కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులపై సచివాలయంలోని తన ఛాంబర్‌లో శుక్రవారం హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వి.పి.గౌతమ్‌, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెస్‌(సిజిజి) ఎడిజీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌తో కలిసి మంత్రి సమీక్షించారు. ఏయే అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయనేది తెలుసుకొని తక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఇండ్ల మంజూరుకు లబ్దిదారుల నుంచి లంచం అడిగే ఇందిరమ్మ కమిటీ సభ్యులను తక్షణం కమిటీ నుంచి తొలగించి క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లా మధిరాల మండలం పోలుమల్ల గ్రామంలో కొండ లింగయ్య అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం రూ.10వేలు డిమాండ్‌ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సత్తెయ్యను, జనగాం జిల్లా దేవరుప్పల మండలం పడమటి తండాలో శివమ్మ అనే లబ్దిదారు నుంచి రూ.30 వేలు ఇవ్వాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ డిమాండ్‌ చేశారని ఫిర్యాదు రాగా విచారణలో ఇందిరమ్మ కమిటీ సభ్యుని పాత్ర ఉందని తేలింది. దీంతో ఈ అంశంపై పూర్తిస్ధాయి విచారణ జరిపి 24గంటల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా ఖమ్మం, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఇండ్లు మంజూరు కాని నలుగురికి వారి ఖాతాలో నిధులు జమ చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శులను తక్షణం సస్పెండ్‌ చేసి పూర్తిస్ధాయి విచారణ జరపాలని అధికారులకు సూచించారు. ఇండ్ల లబ్దిదారులకు ఇంటి నిర్మాణ దశలనుబట్టి ప్రతి సోమవారం నిధులు మంజూరు చేస్తుండగా కొన్ని బ్యాంకులు పాత బకాయి కింద జమ చేసుకుంటున్నాయని, ఇలాంటి చర్యలను సహించేది లేదని, ఆ బ్యాంకులపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీనిపై రాష్ట్రస్దాయి బ్యాంకర్ల కమిటీకి లేఖ రాయాలని హౌసింగ్‌ ఎండీని ఆదేశించారు. ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా చెల్లింపుల్లో ఎదురవుతున్న సమస్యలను ఈనెల 25లోగా పరిష్కరించి దసరా పండగ లోపు చెల్లింపులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆధార్‌ నెంబర్‌ లేదా పేరు గాని తప్పు ఉంటే గ్రామ కార్యదర్శి, ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవాలన్నారు. త్వరలో లబ్దిదారుడే స్వయంగా ఈ దిద్దుబాటు చేసుకొనేలా యాప్‌ను తయారు చేశామని, ఒకటి రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పేదలనుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటామని, కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదును తక్షణం ఆయా జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి పంపడంతోపాటు సచివాలయంలోని తన కార్యాలయానికి కూడా పంపాలని సూచించారు. ఈ ఫిర్యాదులపై తమ కార్యాలయం కూడా మానిటరింగ్‌ చేస్తుందని తెలిపారు. లంచమడిగితే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18005995991కు కాల్‌ చేసి వివరాలను తెలియజేస్తే 24 గంటల్లో చర్య తీసుకుంటామని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *