– మహా నగర అభివృద్ధికి రెండేళ్లలో రూ.20వేల కోట్లు
– 27 మునిసిపాలిటీల విలీనం చరిత్రాత్మక నిర్ణయం
– ‘క్యూర్’, ‘ప్యూర్’, ‘రేర్’ వ్యూహంతో స్థిరమైన అభివృ ద్ధి
– ‘క్రెడాయ్’ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ షోలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాదు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: తమ రెండేళ్ల పాలనా కాలంలో హైదరాబాద్ నగరాభివృద్ధికి రూ.20వేల కోట్లు కేటాయించామని, అనేక పనులు పూర్తికాగా మరికొన్ని ప్రగతిలో ఉన్నాయని, ఈ తరహాలో నిధులు కేటాయించడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ షో సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. జీహెచఎంసి పరిధిలో రూ.1950.52 కోట్లు, హెచఎండబ్ల్యూఎసఎస్‌బీ పరిధిలో రూ.12,500 కోట్లు, హెచఎండీఏ పరిధిలో రూ.4,3365 కోట్లT కేటాయించినట్లు తెలిపారు. మహానగరం చుట్టుపక్కల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచఎంసీలో విలీనం చేయడం ఓ చరిత్రాత్మక నిర్ణయమని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. తద్వారా నగరంలోని పౌరులకు ఒకే విధమైన పౌర సేవలు, సమగ్ర ప్రణాళిక, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఒకే అభివృద్ధి దృక్పథం సాధ్యమయ్యాయన్నారు. ఈ రోజు హైదరాబాద్ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, పెట్టుబడులకు అనుకూలమైన నగరాలలో ఒకటిగా నిలుస్తోంది. ఇది యాదృచ్ఛికంగా జరిగినది కాదు. దశాబ్దాలపాటు సాగిన సంస్థాగత నిర్మాణం, ప్రజాస్వామ్య పాలన, సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం నిబద్ధత ఫలితమే ఇది అని అన్నారు. ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారనే అంశంతో సంబంధం లేకుండా ఈ రోజు హైదరాబాద్‌ను విడివిడిగా ఉన్న సంపన్న ప్రాంతాల సమాహారంగా కాక ఒకటిగా అనుసంధానమైన, సమగ్రంగా అభివృద్ధి చెందుతున్న మహానగరంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రాం(హెచ్-సీఐటీఐ) కింద రూ.7,032 కోట్లకుపైగా పెట్టుబడితో 45 ప్రధాన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, 10 రోడ్డు విస్తరణ ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని వివరించారు. నగరం నాలుగు దిక్కులా చేపడుతున్న అభివృద్ధి గురించి వివరించారు. ఇది నగరమంతటా జరుగుతున్న సమష్టి ప్రయత్నం.. ఏ ప్రాంతాన్నీ నిర్లక్ష్యం చేయడం లేదు.. ఏ సముదాయాన్నీ మరిచిపోవడం లేదు అని తెలిపారు. ఈ పెట్టుబడులు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తున్నాయి, లాజిస్టిక్స్‌ను మెరుగుపరుస్తున్నాయి, ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేస్తున్నాయి, భూ విలువలను పెంచుతున్నాయి. అంతకన్నా ముఖ్యంగా విద్యార్థులు, కార్మికులు, వ్యాపారవేత్తలు, కుటుంబాలు వంటి సాధారణ ప్రజల రోజువారీ జీవితాన్ని మెరుగుపరుస్తున్నాయి అని భట్టి అన్నారు.
‘క్యూర్’, ‘ప్యూర్’, ‘రేర్’ వ్యూహం
తెలంగాణ రైజింగ్ విజన్-2047 కింద ‘క్యూర’, ‘ప్యూర’, ‘రేర’ వ్యూహం రాష్ట్ర అభివృద్ధిలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీని కేంద్రంగా ఉంచుతోందని తెలిపారు. ఆర్థిక వృద్ధి సామాజిక న్యాయం, సమాన అవకాశాలతోపాటు సాగాలన్న ప్రజా ప్రభుత్వం దీర్ఘకాలిక విశ్వాసానికి ఇది ప్రతిబింబం అన్నారు. హైదరాబాద్ తెలంగాణకు ఉపాధి, ఆవిష్కరణలు, గ్లోబల్ పెట్టుబడుల ప్రధాన ఇంజిన్‌గా కొనసాగుతోందని, అదే సమయంలో అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా చూస్తుంది అని భరోసా ఇచ్చారు. మౌలిక సదుపాయాలే గొప్ప నగరాన్ని నిర్మించవు, ప్రజలతో ముఖ్యంగా అత్యంత బలహీనవర్గాలతో నగరం ఎలా వ్యవహరిస్తుందన్నదే దాని గొప్పతనానికి ప్రమాణం అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. అందుకే 2047 వరకు దృష్టిలో ఉంచుకుని వరదల భద్రత, వాతావరణ అనుకూలత కోసం ప్రత్యేకంగా లోతట్టు, వెనుకబడిన ప్రాంతాలకు ఉపయోగపడేలా సమగ్ర స్టార్మ్ వాటర్ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే ‘ఉమ్టా’ ద్వారా సమగ్ర స్పేషియల్ మాస్టర్ ప్లాన్, బ్లూ-గ్రీన్ మాస్టర్ ప్లాన్, సమగ్ర మొబిలిటీ ప్లాన్‌లను అభివృద్ధి చేస్తున్నామని, అభివృద్ధి క్రమబద్ధంగా, పర్యావరణ బాధ్యతతో, అందుబాటులో ఉండేలా చేయడానికి ఈ చర్యలు దీర్ఘకాలిక ప్రణాళికలు, సంస్థాగత బలోపేతం, స్థిరమైన అభివృద్ధిపై తమ ప్రభుత్వ నిబద్ధతను చాటుతున్నాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. వృద్ధి స్థిరంగా ఉండాలి. అభివృద్ధి నైతికంగా ఉండాలి. పురోగతి మానవీయంగా ఉండాలి అని పేర్కొన్నారు.
అత్యంత నివసించదగిన, పెట్టుబడులకనుకూలమైన నగరం
ఈ రోజు హైదరాబాద్ ఇతర భారతీయ నగరాలతో మాత్రమే కాదు పెట్టుబడులు, ప్రతిభ, జీవన నాణ్యత కోసం ప్రపంచంలోని అగ్ర నగరాలతో పోటీపడుతోందన్నారు. ఈ పోటీలో విజయం సాధించాలంటే మూలధనం, సాంకేతికతతోపాటు ప్రజాసంస్థలపై నమ్మకం, సామాజిక సౌహార్దం, రాజకీయ స్థిరత్వం కూడా అవసరం అని, అవన్నీ అందించడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. దేశంలోనే అత్యంత నివసించదగిన, పెట్టుబడులకు అనుకూలమైన, మంచి పాలనతో కూడిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడం ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాము ఫ్లైఓవర్లు, రహదారులు మాత్రమే నిర్మించడం లేదు. పాలనపై విశ్వాసాన్ని పునర్నిర్మిస్తున్నాం.. ప్రజాసంస్థలపై నమ్మకాన్ని పునరుద్ధరిస్తున్నాం.. ప్రభుత్వం ప్రజల సేవ కోసమే ఉందన్న భావనను స్థిరపరుస్తున్నాం అన్నారు. స్మార్ట్, స్థిరమైన, సమగ్ర, న్యాయసమ్మతమైన భవిష్యత్‌కు సిద్ధమైన హైదరాబాద్‌కు పునాదులు వేస్తున్నాం అని తెలిపారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల మార్గనిర్దేశంలో కలిసి హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుదాం అని డిప్యూటీ సీఎం పునరుద్ఘాటించారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సదా సిద్ధంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల బిజీ ఉన్నప్పటికీ తాను, సీనియర్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యామంటే ఈ రంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి ఎలాంటిదో స్పష్టం అవుతుందని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





